Kasthuri Shankar: తెలుగు ప్రేక్షకులకు నటి కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కస్తూరి శంకర్ పేరు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీ కావడంతో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలను గుర్తించారు. ఆమెపై వ్యతిరేకత కూడా ఏర్పడింది. నవంబరు 3న చెన్నైలో ఒక కార్యక్రమానికి హాజరైన కస్తూరి శంకర్ తెలుగు వారిపై సంచలన కామెంట్స్ చేసింది.
300 ఏళ్ల క్రితం రాజుగారి అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకే తెలుగు వారు తమిళనాడుకి వచ్చారని, ఇప్పుడు వాళ్లు తమిళ వాళ్లమని చెప్పుకుంటున్నారంటూ కస్తూరి కామెంట్స్ చేసింది. అంతేకాదు వేరేవాళ్ల భార్యపై మోజు పడొద్దని, బహుభార్యాతత్వం వద్దని బ్రాహ్మణులు చెప్తుంటే వారిని తమిళులు కాదని, వారికి వ్యతిరేకంగా కొందరు ప్రచారం చేస్తున్నారని కస్తూరి కామెంట్ చేయడంతో వివాదస్పదం అయింది. ఈ విషయం పట్ల ఆమెపై పలువురు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నటి కస్తూరిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ కేసులో భాగంగా అరెస్టు అయిన కస్తూరి కి తాజాగా ఎగ్మూర్ కోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. ఈ కేసులో శనివారం హైదరాబాద్‌లో అరెస్ట్ అయిన కస్తూరిని చైన్నె పుళల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆమెకు ఈ నెల 29వ తేదీ వరకు రిమాండ్ విధించారు. ఈ పరిస్థితులలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎగ్మూర్ కోర్టులో కస్తూరి దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. తాను సింగిల్ మదర్ అని, తనకు స్పెషల్‌చైల్డ్ ఉందని, ఆమెను తానే చూసుకోవాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. దీంతో నిబంధనలతో కూడిన బెయిల్‌ను ఆమెకు మంజూరు చేస్తూ న్యాయమూర్తి దయాళన్ ఆదేశించారు.