2024 సార్వత్రిక ఎన్నికల వేళ పలు కీలక నియోజకవర్గాలతో పాటు ఉండి నియోజకవర్గం కూడా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక్కడ నుంచి రామరాజు, శివరామరాజు ని కాదని చివరి నిమిషంలో అనూహ్యంగా రఘురామ కృష్ణంరాజుకి టిక్కెట్ కేటాయించారు చంద్రబాబు. దీంతో… ఈ నియోజకవర్గం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో అక్కడ ఆయన గెలుపు ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది!
అవును… వైసీపీ టిక్కెట్, జగన్ ఫోటోపై ఎంపీగా గెలిచి అనంతరం ఆ పార్టీకి అతిపెద్ద తలనొప్పిగా మారారనే పేరు సంపాదించుకున్న రఘురామ కృష్ణంరాజు… 2024 ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ నరసాపురం ఎంపీగా పోటీ చేయాలని ఫిక్సయ్యారనేది తెలిసిన విషయమే! కూటమిలో భాగంగా ఆ స్థానం ఎవరికి దక్కినా.. పోటీ చేసేది మాత్రం తానే అంటూ రఘురామ బల్లగుద్ది చెప్పారు. కూటమి మాత్రం నో చెప్పింది.
దీంతో… ఆ క్రెడిట్ కూడా జగన్ కే ఇచ్చారు రఘురామ. తనకు నరసాపురం లోక్ సభ టిక్కెట్ రాకపోవడం వెనుక జగన్ హస్తం ఉందని అన్నారు. అనంతరం తనకు టిక్కెట్ ఇవ్వకపోతే చంద్రబాబుని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న స్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో.. బాబుకు మరొ ఆప్షన్ లేకుండా పోయింది. ఫలితంగా.. ఆయనకు ఉండి అసెంబ్లీ టిక్కెట్ కేటాయించారు. దీంతో శివరామరాజు రెబల్ గా మారారు.
తనకు ప్రకటించిన టిక్కెట్ అనూహ్యంగా చేయి జారడంతో కంటతడి పెట్టిన మంతెన రామరాజు.. అనంతరం రఘురామను బైక్ పై ఎక్కించుకుని తిప్పినా… శివరామరాజు మాత్రం తగ్గలేదు! తన సత్తా ఏమిటో చూపిస్తానంటూ బరిలోకి దిగారు. దీంతో… రఘురామకు అతిపెద్ద కష్టం వచ్చిపడిందనే కామెంట్లు వినిపించాయి. ఏది ఏమైనా.. ఏపీలో పోలింగ్ పూర్తయ్యింది. వైసీపీ గెలుపును చాలామంది విశ్లేషకులు ప్రెడిక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో రఘురామ కూడా లైన్ లోకి వచ్చారు. రచ్చబండ పేరున మరోసారి మైకుల ముందుకు వచ్చిన ఆయన… ఈ ఎన్నికల్లో కూటమికి 150 స్థానాలు పక్కాగా వస్తాయని అంటున్నారు. అదెలా అంటే… 2019లో వైసీపీకి రాలేదా అనేది ఆయన చెబుతున్న కారణాల్లో ఒకటని తెలుస్తుంది. ఆ సంగతి అలా ఉంటే… ఉండిలో ఆయన గెలుపుపై స్థానికంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.
ఇందులో భాగంగా… ఉండిలో వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహ రాజుకి విజయావకాశాలు ఉన్నాయని స్థానికంగా వినిపిస్తోంది. రఘురామకు శివరామరాజు గట్టిగా దెబ్బకొట్టారనే చర్చ తెరపైకి వచ్చింది. కూటమి ఓట్లు భారీగా చీలాయని.. అది వైసీపీకి బలంగా మారిందని అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో కూటమికి 150 సీట్లు దక్కుతాయని రఘురామ జోస్యం చెబుతున్నారు.
దీంతో… 150 సంగతి దేవుడెరుగు.. ముందుగా తాను ఎమ్మెల్యేగా గెలుస్తారా లేదా? సభాపతిగా శాసనసభలో సింహాసనంపై కూర్చోవాలనుకున్న తన కోరిక, తాను చెబుతున్నట్లు ప్రజల కోరిక తీరుతుందా? లేదా? అనేది ఆసక్తిగా మారిందని అంటున్నారు. ఏది ఏమైనా… ట్రిపుల్ ఆర్ చెబుతున్న 150 జోస్యంపై క్లారిటీ రావాలంటే జూన్ 4 వరకూ ఆగాల్సిందే. అప్పుడు కూడా రఘురామ రచ్చబండ చూడాల్సిందే అని అంటున్నారు ఆయన అభిమానులు!