గెలుపు అనివార్యం అయిన రాబోయే ఎన్నికల విషయంలో టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. పథకాలు కాపీ కొట్టినవి అని కామెంట్లు వినిపిస్తున్నా… బాబు తన సహజశైలికి భిన్నంగా జగన్ ని ఫాలో అవుతున్నారనే విమర్శలు ఎదురవుతున్నా… తగ్గేదేలే అన్నట్లుగా ముందుకు పోతున్న ఆయన… తాజాగా “తల్లికి వందనం” పథాకానికి సంబంధించి టోకెన్ల ను తెరపైకి తీసుకువస్తున్నారు.
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో జరిగిన కీలక మహానాడులో చంద్రబాబు మినీ మేనిఫెస్టో ను ప్రకటించారు. అయితే ఇది తొలివిడత మాత్రమే అని.. ముందు ముందు మరిన్ని మేనిఫెస్టోలు వస్తాయని.. ఎన్నికల నాటికి వీటన్నింటినీ క్రోడీకరించి ఫైనల్ మేనిఫెస్టో ఉంటుందని చెబుతున్నారు! ఈ సమయంలో వైఎస్ జగన్ సర్కారులో అత్యంత కీలకమైన “అమ్మ ఒడి” పథకానికి మరో రూపమైన “తల్లికి వందనం” కార్యక్రమాన్ని మరింతగా జనాల్లోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు.
ఇందులో భాగంగా పార్టీ మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన “తల్లికి వందనం” పథకం అమలులో భాగంగా అర్హులైన పిల్లలందరికీ ఎన్నికలకు ముందుగానే టోకెన్లు ఇవ్వనున్నట్లు నిర్ణయించారు. అవును… ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా… ప్రచారానికి వెళ్లిన సమయంలో చదువుకుంటున్న పిల్లలున్న ప్రతీ ఇంటిలోనూ ఈ టోకెన్లు ఇవ్వాలని, మీరంతా తల్లికి వందనం పథకానికి అర్హులని, టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం మీ మీ అకౌంట్లలో “అమ్మ ఒడి” తరహాలో బ్యాంక్ అకౌంట్స్ లో నగదు జమ చేస్తామని చెప్పనున్నారు.
మరి “అమ్మ ఒడి”కి నకిలీ అనే విమర్శలు ఎదుర్కొంటున్న ఈ పథకాన్ని… గత 14ఏళ్లలో ఇలాంటి ఆలోచన రాలేదు – జగన్ ని చూశాక వచ్చిందా అని విమర్శలు వస్తున్న ఈ పథకాన్ని ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది వేచి చూడాలి! ఏది ఏమైనా… ఇది సరికొత్త వ్యూహమే. అయితే ప్రజలు నమ్మడం నమ్మకం పోవడమే కీలకం!!