తెలంగాణలో మరో రెండు వారాల్లో ఎన్నికల సందడి ముగిసిపోనున్న సంగతి తెలిసిందే. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికల సందడి ముగియనుంది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల కోలాహలం మొదలుకాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రధానంగా దక్షిణాదిలో ఏపీపైనా ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఇక్కడ బీజేపీ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందీ అనేది కూడా ఆసక్తిగా మారింది.
ఆ సంగతి కాసేపు పక్కనపెడితే ఈలోపు ఏపీలో జనసేన – టీడీపీ పొత్తులో ముందుకు సాగుతున్నాయి. అయితే ఈ విషయంలో వ్యూహాత్మకంగా వెళ్లడం లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దానికి బలమైన కారణం ఉందని అంటున్నారు పరిశీలకులు.
వివరాళ్లోకి వెళ్తే… 2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ – జనసేన పార్టీలు కదన రంగంలోకి దిగిపోయాయి. పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ 2019 ఫలితాలు రిపీట్ కాకూడదని పథకాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో… ప్రతి రెండువారాలకూ ఒకసారి సమన్వయ కమిటీలు భేటీలు కావాలని నిర్ణయించాయి. ఫలితంగా కార్యచరణతో పాటు.. ఇరు పార్టీల నేతల మధ్య సమన్వయం సెట్ అవుతుందని భావిస్తున్నారు.
ఆ సంగతి అలా ఉంటే… ప్రధానంగా సీట్ల విషయంలో క్లారిటీ అనేది అత్యంత ప్రధానకరమైన విషయమని, తేడావస్తే ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం కూడా అని అంటున్నారు పరిశీలకులు. పైగా ఇప్పటికే సీట్ల పంపకాలపై ఒక క్లారిటీకి రావాలనే డిమాండ్లు సమన్వయ కమిటీలలో మొదలైపోయాయి. క్షేత్ర స్థాయిలో కేడర్ కు క్లారిటీ ఇవ్వడం ఈ విషయంలో అత్యంత ప్రధానం అనే మాటలూ వినిపిస్తున్నాయి.
ముందుగా సీట్లపై క్లారిటీ రావాలని.. ఫలితంగా దానిని బట్టి తాము కార్యాచరణ రూపొందించుకుంటామని పలువురు నేతలు చెబుతున్నారని తెలుస్తుంది. అయితే… ఇప్పటికిప్పుడు సీట్లను ప్రకటించేస్తే.. పొత్తుకు ప్రమాదం ఏర్పడడమో అని పలువురు టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. అయితే… ఇప్పుడే అయితే అసంతృప్తులను బుజ్జగించడానికి ఛాన్స్ ఉంటుందని… ఎన్నికలు సమీపించిన సమయంలో అయితే రెబల్స్ ని నిలువరించడం తలకు మించిన భారం అవుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
మరి ఈ నేపథ్యంలో ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది.. సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపిక విషయంలో వీలైనంత తొందరగా క్లారిటీకి వచ్చి.. అప్పుడు సమన్వయం కోసం ప్రయత్నించాలని… అలా కాని పక్షంలో ముందు పని వెనుక, వెనుక పని ముందు అయ్యి.. కొత్త సమస్యలు వస్తాయని చెబుతున్నారు!