(యనమల నాగిరెడ్డి)
నాయకుల పదవీదాహానికి బలిపశువుగా మారిన రాయలసీమ అన్ని రంగాలలో వెనుకబడింది. నిరంతరం కరువు కోరల్లో చిక్కి తాగడానికి గుక్కెడు నీటి కోసం కూడా జనం అల్లాడుతున్నారు. మద్రాస్ రాష్ట్రము నుండి విడిపోయి ఆంధ్ర రాష్ట్రము ఏర్పడడానికి కారణభూతమైన “శ్రీ భాగ్ ఒప్పందం” ఆంధ్ర రాష్ట్రంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ అమలుకు నోచుకోలేదు. పాలకుల కనీస స్మరణకు కుడా నోచుకోలేదు. 2014లో (పూర్వపు 1953 నాటి ఆంధ్ర రాష్ట్రం) తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది.
కనీసం ఇప్పుడైనా తమ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని సీమ వాసులు ఆశించారు. తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలను ఎత్తి చూపి ఈ ప్రాంతానికి న్యాయం చేయాలని సీమ ఉద్యమకారులు గత నాలుగు సంవత్సరాలుగా పోరాడుతున్నారు. వీరి ఆకలి కేకలు, ఉద్యమ ఘోషలు చెవిటి ముందు శంఖనాదంలా మారాయి తప్ప ఎలాంటి ఫలితం లేదు.
ఈ నేపథ్యంలో తమ గోడును కోస్తా ప్రాంతంలోని ప్రజాస్వామ్యవాదులకు వినిపింఛి, సీమ సమస్యల పరిష్కారానికి సహాకరించాలని కొరుతూ “రాయలసీమ ఉద్యమకారుల ఐక్య వేదిక” విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసారు.
రాయలసీమ దశాబ్దాల పాటు ముఠా కక్షలతో కునారిల్లింది. పాలకుల పదవీ దాహానికి బలై నిరంతరం కరువుతో అల్లాడుతున్నఈ కరువుసీమ ను ఏడు కోడానికి సహకరించాలని కోస్తా ప్రాంతంలోని ప్రజా సంఘాలను కోరనున్నామని, రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయవేదిక కన్వీనర్ బొజ్జా దశరథరామి రెడ్డి తెలిపారు.
మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు కోస్తా, సీమ ప్రాంత నాయకులు కుదుర్చుకున్న “శ్రీభాగ్ ఒప్పందం” అమలు ఆవశ్యకత, రాయలసీమకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 124 టి.ఎం.సి ల నీళ్ల సద్వినియోగం, బ్రిజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ ముందు రాయలసీమ అవసరాలను గురించి చెప్పడం, సీమలో నిర్మిస్తున్న “గాలేరు-నగిరి, హంద్రీ-నీవా, వెలిగొండ” ప్రాజెక్ట్ లకు నీటి కేటాయింపుల గురించి, పట్టిసీమ, పోలవరం నుండి కృష్ణ బేసిన్ కు నీళ్లు తరలించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామనన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనను అమలు చెయించడం .
అభివృద్ధి వికేంద్రీకరణ పై ద్రుష్టి పెట్టి రాయలసీమను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వంపై వత్తిడి తేవడమే లక్ష్యముగా ఈ సమావేశం ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. ఆరు సూత్రాల ఫార్ములా మేరకు రాయలసీమ వాసులకు రాజధాని ప్రాంతంలోని ఉద్యోగాలలో అవకాశం కల్పించాలని, విభజన చట్టంలో రాయలసీమకు ప్రకటించిన హామీల అమలుకు, ముంపు వాసులకు, భూములు పోగొట్టుకున్న వారికి వివక్ష లేకుండా పరిహారం ఇవ్వాలని కోరుతున్నామని ఆయన తెలిపారు.
విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో రాయలసీమ నాయకులతో పాటు కోస్తా నాయకులు పాలు పంచుకుంటారని దశరథరామి రెడ్డి తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఇది మొదటి సమావేశమని, ముందు ముందు తమ పోరాటాన్ని ఇక్కడే కేంద్రీకరిస్తామని ఆయన తెలిపారు.