రాయలసీమకు హైకోర్టు కూడా హుళక్కేనా ? ‘శ్రీభాగ్’ ఎక్కడ?

(యనమల నాగి రెడ్డి)

శ్రీభాగ్ ఒప్పందం మేరకు రాయలసీమకు దక్కవలసిన రాజధాని దక్కలేదు.  ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు కూడా హుళక్కేనని చెప్పవచ్చు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టుకు తెలియచేసింది. అలాగే సుప్రీంకోర్టు కూడా జనవరి నాటికి హైకోర్టును ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో  ఉమ్మడి హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి టి. ఎస్. రాధాకృష్ణన్, ఆయన సహచర న్యాయమూర్తులు అమరావతిలో సి.ఆర్.డి.ఏ ఆధ్వర్యంలో హైకోర్టు కోసం నిర్మిస్తున్న నిర్మాణాలను ఇటీవల సందర్శించి సంతృప్తి వ్యక్తం చేయడం విదితమే. కోర్టు భవనాలు, న్యాయమూర్తుల నివాస భవన సముదాయాలు పూర్తి కావచ్చిన సమయంలో హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయడం సాధ్యమా? అన్న ప్రశ్న తలెత్తుతుంది.   

 

అయితే రాయలసీమ వాసులు, ఉద్యమకారులు “శ్రీభాగ్” ఒప్పందం మేరకు రాయలసీమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. రాజధాని నగరాన్ని శాసనసభ్యుల సంఖ్య అధికంగా ఉన్న కోస్తా ప్రాంతంలోనే  నిర్మించాలని పాలక టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తే, ప్రతిపక్షనేత ఈ ప్రతిపాదనను వ్యతిరేకించకుండా పోగా ఎలాంటి చర్చ కూడా లేకుండా ఈ ప్రతిపాదనకు మద్దతు పలికారు. ఆ ఒప్పందం మేరకు కనీసం హైకోర్టు నైనా రాయలసీమ లో ఏర్పాటుచేయాలని వారు కోరుతున్నారు.  

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ఇరువురు నాయకులు కూడా సీమ ప్రాంత వాసులే కావడం గమనార్హం. చిత్తూర్ జిల్లాలో పుట్టి, ఎస్. వి. యూనివర్సిటీలో   ఎం.ఏ ఎకనమిక్స్ చదివి, రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం (40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు) ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు శ్రీభాగ్ ఒడంబడికను గురించి తెలియదంటే నమ్మలేము.

అలాగే కడప జిల్లాలో సుదీర్ఘ రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబంలో పుట్టి ఒక ముఖ్యమంత్రి తనయుడిగా సుమారు 6 సంవత్సరాలపాటు చక్రం తిప్పి, ఆ తర్వాత ముఖ్యమంత్రి కావాలని అహర్నిశాలు కలలు కంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం పర్యటిస్తున్న  జగన్ మోహన్ రెడ్డికి కూడా శ్రీభాగ్ ఒడంబడిక గురించి తెలియలేదని అంటే ఎలా నమ్మగలం?

ఇకపోతే రాష్ట్ర విభజనకు మూల కారణమైన కాంగ్రెస్, బీజేపీలకు ఈ ఒడంబడిక గురించి తెలియడంలేదని ఎలా భావించగలం. దీనికితోడు అప్పట్లో  రాయలసీమ, కోస్తా ప్రాంత నాయకుల మధ్య సయోధ్య కుదిర్చి శ్రీభాగ్ ఒప్పందం కుదర్చడంలో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు కీలక పాత్ర పోషించారు. వారికి కూడా ఈ ఒప్పందం గురించి పూర్తిగా తెలుసు.

అయితే వీరందరికి శ్రీభాగ్ ఒప్పందం గురించి పూర్తిగా తెలిసినా, ఆ ఒడంబడిక మేరకు రాయలసీమకు ఇవ్వవలసిన నీళ్లు, ప్రాధాన్యత మేరకు ఇవ్వవలసిన రాజధాని కానీ, హైకోర్టు కానీ, విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలకు ఇవ్వవలసిన ప్రోత్సాహం గురించి కానీ, వెనుకపడిన ప్రాంత సమగ్రాభివృద్దికి తీసుకోవలసిన చర్యల గురించి కానీ 1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి ఏమీ చేయలేదు. కనీసం వీటి గురించి మాట్లాడలేదు కూడా.

నీళ్ల కేటాయింపుల్లో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగినా, కర్నూల్  లో ఏర్పాటు చేసిన ‘టెంట్ కాపిటల్’ ను హైదరాబాదు కు తరలించినా సీమ  నాయకులు అప్పట్లో ఏమాత్రం పట్టించుకోలేదు. రాయలసీమ, ఆంద్ర, తెలంగాణా ప్రాంతాలతో కూడిన విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పడితే తెలుగు ప్రజలు బాగుంటారని, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి జరుగుతుందని అందరూ  ఆశించారు. అయితే రాయలసీమకు ఏమి ప్రయోజనం కల్పించాలి అన్న విషయం మాత్రం ఎవరూ పట్టించుకోలేదు.

 “పొడువు చేతుల పందారం” అందుకోవడంలో నిపుణులైన కోస్తా నాయకులు తమ ప్రాంత ప్రయోజనాలను కాపాడుకోగా తమ హక్కుల కోసం నిరంతరం పోరాడిన తెలంగాణా వాసులు తమకు కావలసినవి తీసుకోగలిగారు.  అయితే రాయలసీమకోసం కుదిరిన శ్రీభాగ్ అంగీకారం గురించి కానీ, రాయలసీమ ప్రయోజనాల గురించి సీమ ప్రాంత నాయకులు కానీ, మిగిలిన ప్రాంతాల పెద్దలు కానీ ఏనాడు (ఆనాడు/ఈనాడు) పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పక తప్పదు.

ఈ దుస్థితి ఇలాగే 61 సంవత్సరాలపాటు సాగిన తర్వాత కూడా రాయలసీమ ప్రయోజనాలను గురించి నాయకులు ఏమాత్రం ఆలోచించలేదు.  2014లో కాంగ్రెస్, బీజేపీ, మిగిలిన రాజకీయ పార్టీలు కలసి “పార్లమెంట్ మందిరం తలుపులు మూసి” మరీ రాష్ట్రాన్ని విభజించిన  సమయంలో రాయలసీమకు ఉపయోగపడే కొన్ని ప్రతిపాదనలను కేంద్రం చేసినా ఎవరు వత్తిడి చేయకపోవడంతో ఆచరణలో రిక్త హస్తం మాత్రమే దక్కింది.  

రాష్ట్ర విభజన తర్వత ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం రాయలసీమను పట్టించుకోకుండా “రాజధానిని” ఏకపక్షంగా కోస్తాలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని   వైస్సార్ పార్టీ కిమ్మనకుండా మద్దతు ప్రకటించింది.

రాజధాని ఎంపికపై కమిటీ వేసి, ఆ కమిటీ నివేదిక ఆధారంగా “రాజధానిని” ఎంపిక చేస్తామని రాష్ట్ర విభజన సమయంలో ప్రకటించిన కేంద్రం రాజకీయ కారణాలతో ఆ తర్వాత ఈ విషయాన్ని అసలు పట్టించుకోలేదు. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ వ్యసాయయోగ్యమైన భూములను రాజధాని కోసం సేకరించరాదని, రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన అమరావతి  పరిసర ప్రాంతాలలో “వరదలు, భూకంపాలు సంభవించే అవకాశం ఉందని” తన నివేదకలో చెప్పినా అటు కేంద్రం ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ సమయంలో “టీడీపీ బీజేపీ మిత్ర భందం” దృడంగా ఉండటంతో మోదీ ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చి రాజధాని అంశాన్ని బుట్ట దాఖలు చేసింది. బాబు గారి పంతమే నెగ్గింది.

అప్పటి నుండి రాయలసీమ బడా నాయకులు శ్రీభాగ్ ఒప్పందాన్ని గురించి, ఈ ప్రాంతానికి జరుగుతున్న / జరగనున్న అన్యాయాన్ని గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. సీమ ఉద్యమకారులు, న్యాయవాదులు కనీసం  హైకోర్టునైనా రాయలసీమ లో ఏర్పాటు చేయాలని ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వము పట్టించుకోక పోగా తనదైన శైలిలో అమరావతి లోనే హైకోర్టు భవన నిర్మాణాన్ని ప్రారంభించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తో పాటు ఆయన సహచర న్యాయమూర్తులు కూడా ఈ భవనాలను ఇటీవల సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.

మరి ఈ నేపథ్యంలో రాయలసీమలో  హైకోర్టు ఏర్పాటు కూడా జరగదని నిశ్చయంగా చెప్పవచ్చు.  రాయలసీమకు చెందిన ఏ అంశాన్ని ప్రభుత్వం, ప్రతిపక్షం, రాజకీయ నాయకులు (అన్నిప్రాంతాల వారు) పట్టించుకోక పోవడంతో ఉద్యమాన్ని తీవ్రతరం  చేయడమా? లేక న్యాయస్థానాలను ఆశ్రయించడంమా అన్న అంశం ఉద్యమకారులే తేల్చుకోవలసి ఉంది. అలాగే శ్రీభాగ్ ఒడంబడిక ను ప్రభుత్వం అంగీకరించి అమలు చేస్తుందా?లేదా? అన్న అంశాన్ని కూడా ఉద్యమకారులు తేల్చుకోవాలి.          

(ఫోటో అమరావతి లో రాబోతున్న హైకోర్టు నమూనాల్లో ఒకటి)