(యనమల నాగిరెడ్డి)
‘‘రాజకీయ పార్టీల అధినేతలారా! సీమలో పుట్టి పెరిగి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన అయ్యలారా! అమ్మలారా! అన్నలారా! అక్కలారా! వచ్చే ఎన్నికలలో ఇక్కడ నుండి పోటీ చేసి గద్దె ఎక్కాలనుకుంటున్న మహానుభావులారా! గుక్కెడు మంచినీటికి కటకట లాడుతున్న ఈ కరువు సీమలో గత కొన్ని దశాబ్దాలుగా జీవచ్ఛవాలుగా బ్రతుకుతున్న జనం “ఇక్కడ బ్రతకాలా? వద్దా? ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకోండి. మా గోడు వినండి. మీ వైఖరిని చెప్పండి’’ అంటూ సీమ ఉద్యమకారుల సమన్వయ వేదిక నాయకులు గత 20 రోజులుగా సీమలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాల గడపలు ఎక్కిదిగుతున్నారు. నాయకుల వెంట పడుతున్నారు. ఆ పార్టీలు మాత్రం యధావిధిగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి.
మీకు కొమ్ము కాస్తున్న పత్రికలు, టెలివిషన్ చానళ్ల ద్వారా అసత్యాలు, అర్ధసత్యాలు, గణాంకాలు ప్రచారం చేసి మరెన్ని దశాబ్దాలు జనాన్ని మోసం చేస్తారని వారు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు తాగడానికి గుక్కెడు మంచినీళ్లు, ఒక్క ఆరుతడి పంటకు సాగునీరు అందించడానికి మీరు ఏర్పరుచుకున్న ప్రణాళికలు ప్రకటించండి అంటూ డిమాండ్ చేస్తున్నారు ఉద్యమకారులు. ఇక్కడ పుట్టి, పెరిగి, అంపశయ్యపై బ్రతుకులీడుస్తున్న జనం చలవతో గద్దెనెక్కిన(గద్దె నెక్కనున్న) మీరు అధికారం కోసం అర్రులు చాపడంతో పాటు మీ జన్మభూమిని కూడా కాపాడండి అంటూ వారు ఘోషిస్తున్నారు.
నిను వీడని నీడను అంటున్న కరువులు
నాయకుల దోరణి, వాతావరణం అండదండలతో రాయలసీమను ఎప్పటికి విడచిపెట్టమని “కరువులు”కొన్ని దశాబ్దాలుగా ప్రకటిస్తున్నాయి. ఈ ప్రాంతంలో గతంలో చోటు చేసుకున్న “ధాతు కరువు, గంజి కరువు” లాంటి కరువులు సీమలోని మూడవ వంతు జనాన్ని తుడిచి పెట్టాయి. 50వ దశకంలో 5 ఏండ్లకు ఒకసారి చుట్టాల్లా వచ్చి పోయే కరువులు 80వ దశకం నాటికి 3 ఏండ్లకు ఒకసారి, 20వ దశకం నాటికి 2 ఏండ్లకు ఒకసారి ఈ ప్రాంతాన్ని పాలించడం మొదలు పెట్టి, ప్రస్తుతం కుటుంబ సభ్యుల్లా సంవత్సరమంతా ఇక్కడే తిష్ట వేసాయి.
స్వాతంత్య్రానికి ముందు ఈ ప్రాంతంలో చోటు చేసుకుంటున్న కరువును చూసి చలించిన బ్రిటీష్ వలస పాలకులు నీటి పారుదల కోసం తయారు చేసిన అనేక ప్రణాళికలను కోస్తా నాయకులతో కలసి సీమ నాయకులు చెత్తబుట్టల పాలు చేశారు. వీటిలో గోదావరి-కృష్ణ అనుసంధానం, కృష్ణా -పెన్నార్ ప్రాజెక్టులు ప్రధానమైనవి. స్వాతంత్రం తర్వాత సీమకు సంభందించిన అన్ని నీటిపారుదల ప్రతిపాదనలను అందలమెక్కిన సీమ నాయకులు అధికార లాలసతో ప్రక్కన పెట్టారు. ఈ ప్రాంతానికి అన్ని రకాల అన్యాయం చేసి జనజీవనాన్ని అధః పాతాళానికి తొక్కివేశారు.
ఎన్నటికీ పరిష్కారం కాని సీమ సమస్యలు – పట్టించుకోని పాలకులు
భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతొ మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోవడం కోసం కోస్తా నాయకులు “శ్రీభాగ్ ఒడంబడిక” పేరుతొ సీమ నాయకులతో పెద్దమనుషుల ఒప్పందం కుదుర్చుకొన్నారు. చట్టబద్దత లేని ఈ అంగీకారం మేరకు “రాయలసీమ నీటి అవసరాలు తీర్చిన తర్వాత మిగిలిన నీరు తాము తీసుకుంటామని, సీమ వాసుల కోరిక మేరకు రాజధాని లేదా హైకోర్టు ఇస్తామన్నవి ప్రధానమైనవి”. ఆంద్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ‘శ్రీభాగ్’ కు అతీగతీ లేదు. కృష్ణ- పెన్నార్ ప్రాజెక్ట్ ప్రతిపాదన ప్రక్కన పెట్టి నాగార్జున సాగర్ కు పునాది రాయి వేస్తున్నపుడు ఒప్పందం కుదుర్చుకున్న పెద్దలు మౌన ప్రేక్షకుల్లా ఉండి పోయారు. అప్పటి నుండి ఎందరు పాలకులు వచ్చినా (అది కూడా రాయలసీమ నుంచే)సీమ ప్రజల బ్రతుకులు మారక పోగా, నానాటికీ దిగజారి దుర్భరం అయ్యాయి.
పాలకులు ప్రజల కన్నీరు తుడవడానికి చేస్తున్న ప్రతిపాదనలు, చేపడుతున్న ప్రాజెక్టులు శంఖుస్తాపనలకు, కాగితాలకే పరిమితమయ్యాయి. నాయకులు మాత్రం “ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తూ” గత 70 సంవత్సరాలుగా జనాన్ని మోసం చేస్తూనే ఉన్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యం
2014లో పూర్వపు ఆంధ్ర ప్రదేశ్ రెండుగా విడిపోయే సమయంలో రాయలసీమ అవసరాలను గురించి సీమ నాయకులు కానీ, “లాస్ట్ బాల్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి (సీమవాసే)” నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కానీ, సోనియా కనుసన్నలలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్రాన్ని విభజించడానికి ఉరుకులు, పరుగులు పెట్టిన కాంగ్రెస్, బీజేపీలు, జనం కోసమే తాము అంటున్న కమ్యూనిస్టులు ఎవరూ రాయలసీమను పట్టించుకోలేదు.
రాష్ట్ర విభజనలో కీలక పాత్రదారి, విభజన బిల్లు రూపొందించిన “జిఓఎం”కు నేతృత్వం వహించిన జైరాం రమేష్ సీమ కోసం కొన్ని ప్రతిపాదనలు సూచించినా సీమ నాయకులు పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. “కందకు లేని దురద కట్టి పీటకు ఎందుకు” అన్న రీతిలో ఆయన కూడా ఆ తర్వాత ఏమి పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన కోరిన తెలంగాణా నాయకులు తమ కోరిక సాధించుకోగా, హైదరాబాద్ పై ఆశతో విభజనను ఉత్తిత్తిగా వ్యతిరేకించిన కోస్తా నాయకులు తమ ప్రాంతానికి అవసరమైన “పోలవరం ను జాతీయ ప్రాజెక్టుగా చేయించడం” తో పాటు అనేక హామీలు పొంద గలిగారు. గుడ్డిలో మెల్లగా విభజన చట్టంలో నిర్మాణంలో ఉన్న నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని (రాష్ట్రమా? కేంద్రమా? ఎవరు పని చేస్తారు అన్న విషయం మాత్రం చెప్పలేదు), వెనుకపడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని పేర్కొన్నారు. వీటిని గురించి ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు.
2014 విభజన తర్వాత సీమ గతి అధోగతి!
రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా నష్టపోయింది, నిరాదరణకు గురైంది రాయలసీమ మాత్రమే. నీటి కేటాయింపులు, నిధులు లేని ప్రాజెక్టు పనులు నత్త నడకన సాగుతున్నా, బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై అయితే తర్వాత నీటి పంపిణీలో “ఎవరు చేయగలిగింది ఏమీ లేదని తెలిసినా” ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్షనేత జగన్ పట్టించుకోలేదు. అలాగే రాయలసీమకు 210 టీఎంసీల నీటిని కేటాయిస్తామన్న బీజేపీ, సీమకు నీళ్లెక్కడివన్న సిపిఎం (రాఘవులు గారి ఉవాచ) ఇతర కమ్యూనిస్టులు సీమ పట్ల నిజాయతీగా చేసిందేమి లేదని చెప్పక తప్పదు.
పులివెందులకు నీళ్లిచ్చి రాయలసీమ మొత్తం సస్యశ్యామలమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు చంకలు గుద్దుకుంటుండగా, మా నాయకుడు మాత్రమే ఈ ఘనత సాధించారని జబ్బలు చరచుకుంటున్న తెలుగు తమ్ముళ్లు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం (భూతాల)భూతల స్వర్గమే అంటున్న ప్రతిపక్ష నేత జగన్, తమ నాయకుడే కాబోయే సీఎం అంటున్న వైస్సార్ భజన బృందాలకు సీమ గోడు వినిపించడంలేదు. కనిపించడంలేదు కూడా.
సీమ పేరు ఎత్తితే తమకు దక్కవలసిన అధికారం ఎక్కడ చేజారుతుందో అన్న భయం ఈ నేతలిరువురిని, వీరి అంతే వాసులను నిత్యం వెంటాడుతున్నదనేది జగమెరిగిన సత్యము.
వేనుకబడిన ప్రాంతాల ప్యాకేజి
ఇకపోతే ఈ నేతలిద్దరూ “ప్రత్యేక హోదా- ప్రత్యేక ప్యాకేజి “ మత్తులో రాష్ట్ర ప్రజలను ముంచి తేల్చుతున్నారు. వెనుకపడిన ప్రాంతాల కోసం ప్రకటించిన ‘ప్రత్యేక ప్యాకేజి’ ని గురించి మాట్లాడటమేలేదు. కడప ఉక్కును గురించి సన్నాయి నొక్కులు నొక్కడం మినహా చేసిందేమి లేదు. అన్ని పార్టీల నాయకులు “ఈ ప్రాంతం వెనుక పడిందని, కరువుతో అల్లాడుతున్నదని ప్రకటనలు చేయడం తప్ప”, శాశ్వత కరువు నివారణ గురించి, ప్రజలకు ఒక పూట తిండైనా సంపాదించుకుని కనీస గౌరవంతో బ్రతికే అవకాశం కల్పించడానికి ఆలోచించడం లేదు.
ఉద్యమకారుల వినతి
ఈ నేపథ్యంలో 2015 నుండి సీమ సమస్యలపై యధాశక్తి గళం విప్పుతున్న ఉద్యమకారులు ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో రాయలసీమ సమస్యలపై, ప్రజల బ్రతుకులు బాగు చేయడానికి మీ ప్రణాళికలేమిటని? రాజకీయ పార్టీలను, ఈ ప్రాంత నాయకులను నిలదీస్తున్నారు. ఆయా పార్టీలు, నాయకులు తమ వైఖరిని బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఉద్యమకారులు బృందాలుగా ఏర్పడి అన్ని రాజకీయపార్టీల జిల్లా అధ్యక్షులకు, కార్యదర్సులకు, ముఖ్యమైన నాయకులకు 20 రోజులకు ముందు లేఖలు అందచేశారు. మీ వైఖరిని స్పష్టం చేయాలని మరో విడత ఆ కార్యాలయాల వెంట పడ్డారు. ఒకవేళ వీరు సీమ గోడు పట్టించుకోకపోతే వచ్చే ఎన్నికల నాటికి జనమే వీరిని నిలదీసే స్థితి కల్పిస్తామని ఉద్యమకారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఎవరో ఒకరి మోచేతి నీళ్లు తాగుతూ అధికార పీఠం అధిష్టించిన ఈ నేతలు తమ అగ్ర నాయకత్వాన్ని ఒప్పించి సీమ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రకటిస్తారా? అన్నది వేయిడాలర్ల ప్రశ్న. ఉద్యమకారుల ఆకాంక్ష మేరకు నాయకమన్యులు స్పందిస్తారని ఆశిద్దాం .