పవన్ కళ్యాణ్ గారు శ్రీ బాగ్ ఒడంబడిక అమలు పై మీ వైఖరి ఏమిటి?

(వి శంకరయ్య) 
 
మీ పర్యటనలో సీమ వాసులకు ఏం చెబుతారు? 
 
2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు. నమ్మి నాన బోస్తే పుచ్చి బుర్ర లైనాయి. అది పవన్ కుతెలుసు. ఆ పాపం సీమ ప్రజలు అనుభవిస్తున్నారు. ఈ పాప ఫలంలో పవన్ కళ్యాణ్ కు భాగ స్వామ్యం వుంది. ఎందుకంటే టిడిపి అధినేత సరసన పవన్ కళ్యాణ్ పర్యటించారు. అయితే ఏ మైంది? పట్టి సీమ పథకం ఒక సంవత్సరంలో పూర్తి చేసి లిమ్కాబుక్ కెక్కిన ముఖ్యమంత్రి నాలుగు ఏళ్లు గడుస్తున్నా పోతు రెడ్డి పాడు రెగులేటర్ పూర్తి నిర్మాణం చేయ లేదు. గుండ్రేవుల పథకం వేదవతి హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు ఎక్కడేసిన గొంగళి అక్కడే వుంది. 
 
తిరిగి ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి సీమకు వచ్చినపుడల్లా పట్టి సీమ జలాలతో సీమ పొలాలు పునీతం చేస్తున్నానని చెప్పి పుండుపై కారం పొడి వేసి వెలు తున్నారు. తుంగభద్ర కృష్ణ నదులలో సీమ కు హక్కు లేదని పరోక్షంగా చెబుతున్నారు.ఒక ప్రతి పక్ష నేతగా 2014 లో టిడిపిని బలపరిచిన నేతగా సీమ ప్రజలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్ప వలసి వుంది. .
 
1953 లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఆలంబనగా 1937 లో శ్రీ బాగ్ ఒడంబడిక జరిగింది. ఆ ఒడంబడిక గురించి పవన్ కళ్యాణ్ కు గాని రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదిబహిరంగ డాక్యుమెంట్. ఆ మేరకు 1953 లో కర్నూలు రాజధాని చేశారు. గుంటూరులో హైకోర్టు పెట్టారు. తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు.
 
ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత రాజధాని కోస్తా ప్రాంతంలో పెట్టారు. ఇందుకు సీమ ప్రజలు అసూయ పడటం లేదు. గతంలో జరిగిన ఒడంబడిక మేరకు సీమ ప్రాంతంలో హైకోర్టు పెట్టాలి. వికేంద్రీకృత విధానానికి ముఖ్యమంత్రి సమాధి కట్టి సీమకు తీరని అన్యాయం చేశారు..అమరావతి ప్రాంత రైతులు విమానంలో సింగ పూర్ కువిహార యాత్రకు వెళ్ల డాన్ని సీమ రైతులు ఆక్షేపించడం లేదు తమ వలస బతుకులు నివారింప బడాలని మాత్రమే కోరుతున్నారు .
 
ఈ అంశంలో జన సేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ ఏమి చెబుతారోనని సీమ వాసులు ఎదురు చూస్తున్నారు.ఈ అంశంలో ముఖ్యమంత్రి సీమ ప్రజల గొంతు అడ్డంగా కోశారు. పవన్ కళ్యాణ్ కు తెలియదని చెప్ప లేము.  ఎప్పుడూ సీమ వాసులు మృత్యువుతో పోరాడుతూ చస్తూ బతుకు తుంటారు. మరోవైపు బతుకుతూ కొంచెం కొంచెం చనిపోతుంటారు. ముఖ్యమంత్రి సీమ వాసులు గొంతు కోసినా కొన ఊపిరితో పోరాటం చేయడం సీమ వాసులకు వెన్నతో పెట్టిన విద్య. ఫలితంగా సీమ ప్రజలు కొన ఊపిరితోనే తమకు అన్యాయం చేసిన వారికి గుణపాఠం నేర్ప గలరు.
 
గొంతు ఎండి పోతున్న సీమ నుండే రాజకీయాల్లో ఓనమాలు దిద్దు కున్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వుండీ సీమకు తీరని ద్రోహం చేస్తున్నారు. మరి విపక్ష నేత జగన్ అంత కన్నా నోరు విప్పడంలేదు. తాను అధికారంలో లేనని చెబుతున్నారు. 
 
 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డొక్క లెండి బక్క చిక్కిఎడారిని తపించే విధంగా వున్న రాయలసీమ ప్రాంతాల్లో మూడు దఫాలు పర్యటించారు. ప్రప్రథమంగా అనంతపురంలో తదుపరి తిరుపతిలో తిరిగి అనంతపురంలో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. జన సేన అధినేత వెంబడి అడుగులో అడుగు వేసి ఎన్నో ఆశలతో యువత నడిచారు. అనంతపురంతొలి దఫా సభ సందర్భంగా సీమ వెనుక బాటు తనం గురించి ప్రస్తావించారు. తను అనంతపురం నుండి పోటీ చేస్తానని చెప్పారు. అనంతపురం రెండవ సభ సందర్భంగా కొన్ని కుటుంబాలు సీమ రాజకీయాలను గుప్పెట్లో పెట్టుకొని వున్నాయని ప్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలకాలని ఉద్వేగ భరితంగా ప్రసంగించారు. కేంద్ర లోని బిజెపి ప్రభుత్వం పాచి పోయిన లడ్డు ఇచ్చిందని కూడా రాయలసీమ నుండే శంఖారావం పూరించారు. ఈ మూడు సభల సందర్భంగా పవన్ కళ్యాణ్ సీమ వెనుక బాటు తనం గురించి ప్రస్తావించారు. కాని నేటి తరం కోరుతున్న శ్రీ బాగ్ ఒడంబడిక సాగు నీటి వాటా గురించి స్పష్టంగా ప్రస్తావించలేదు.
 
రాజ ధాని సర్కారు ప్రాంతంలో పెడుతున్నా హైకోర్టు కర్నూలులో పెట్టాలని అంశంపై పవన్ కళ్యాణ్ ఏమి చెబుతారోనని సీమ వాసులు ఎదురు చూస్తున్నారు. 
 
ఏ సందర్భంలో కూడా సీమ ప్రజలు కోరుతున్న శ్రీ బాగ్ ఒడంబడిక ఇతర కీలక మైన అంశాలను మాట మాత్రంగా తన ప్రసంగాలో పవన్ కళ్యాణ్ ప్రస్తావించ లేదు.   కోస్తా అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని వారితో పాటు తమ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని గతంలో జరిగిన శ్రీ బాగ్ ఒడంబడిక పాక్షికంగా నైనా అమలు చేయాలని మాత్రమే కోరుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సీమ పర్యటన సందర్భంగా ఇంత ఎందుకు చెప్ప వలసి వున్న దంటే గతంలో పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా తెలుగు దేశం ప్రభుత్వం అవలంభిస్తున్న కేంద్రీకృత విధానం వల్ల ప్రాంతీయవాదం తలెత్తు తున్న దని చెప్పిన సందర్భముంది. పదే పదే ఉత్తరాంధ్రలో ఈ అభిప్రాయం వెల్లడించిన పవన్ కళ్యాణ్ అంత కన్నా ఎక్కువగా ప్రాంతీయ వాదం బీజాలు మొలకెత్తు తున్న సీమలో ఏ విధంగా స్పందించుతారోనని ప్రజలు వేచి చూడటంసహజమే.
 
(వి. శంకరయ్య సీనయర్ జర్నలిస్టు ఫోన్. 9848394013 )