విజయవాడ ధర్నా చౌక్ లో “రాయలసీమ సత్యాగ్రహం”

ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య 16 నవంబరు1937 లో మద్రాసు నగరంలోని కాశీనాథుని నాగేశ్వరరావు  ఇల్లు  శ్రీబాగ్ లో ఒప్పందం జరిగింది. 

ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో రాయలసీమ వాసులలలో స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడడమా?  లేదా ఉమ్మడి మద్రాసు లోనే కలిసి సాగడమా అనే సంఘర్షణ తలెత్తింది. తెలుగు వారంతా ఐక్యంగా ఆంధ్రరాష్ట్రంగా కొనసాగుదామని ఆంధ్రనాయకులు ముందుకొచ్చి రాయలసీమ వాసుల మద్దతు కోరారు. రాయలసీమ వాసులలో ఉన్న అనుమానాలను తొలగిస్తు కొన్ని రక్షణలు కల్పించారు. వాటికి కట్టుబడి ఉంటామని చెప్పేందుకు ఒక  పెద్దమనుషుల ఒప్పందం చేసుకున్నారు.

ఈ ఒప్పందం ప్రకారం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాయలసీమ ప్రాంతంలో రాజధాని లేదా హైకోర్టు నెలకొల్పాలి.  కృష్ణ – తుంగభద్ర నదీజలాలలో రాయలసీమకు ప్రాధాన్యత నీయాలి.అక్కడ విశ్వవిద్యాలయం నెలకొల్పడం, శాసనసభ స్థానాలు సమాన నిష్పత్తిలో జిల్లాల వారిగా ఏర్పాటు చేయాలి వంటి  అంశాలున్నాయి ఈ ఒప్పందంలో.     

 ఆంధ్రరాష్ట్రంలోగాని , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక గాని రాయల సీమ బతుకులో పెద్ద మార్పులేదు. నిరంతరం కరువులు వలసలు, రైతుల ఆత్మహత్యలు, వెనుకబాటుతనం తదితర అనేక సమస్యలలో కూరుకుపోయింది.

ఇపుడు 1953 నాటి ఆంధ్ర రాష్ట్రం తిరిగి 2014 లో అదే రూపంలో  ఆంధ్రప్రదేశ్ గా మనుగడలోకి వచ్చిన తరుణంలో శ్రీబాగ్ ఒప్పందం రక్షణలు వెనుకబడిన రాయలసీమ ప్రాంతలో అమలు చేయాలని ఈ ప్రాంత ప్రజల కోరుకొంటున్నారు. 

నలభై రాయలసీమ  ప్రజాసంఘాలతో ఏర్పడిన  “రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక” ఆధ్వర్యంలో శ్రీబాగ్ ఒప్పందం అమలుకై 16 నవంబరు 2018 న విజయవాడ నగరం, ధర్నాచౌక్ నందు “రాయలసీమ సత్యాగ్రహం” చేయాలని నిర్ణయించారు.
 వెనుకబడిన రాయలసీమ ప్రాంత న్యాయబద్ధ పోరాటానికి మీ సంఘీభావం కోరుతూ  ప్రజాస్వామిక వాదులంతా ఈ సత్యాగ్రహంలో పాల్గొనాలని  రాయలసీమ సాగునీటి సాధన సమితిఅధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి కోరుతున్నారు.