వైఎస్ జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన రఘురామ.!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పక్కలో బల్లెంలా తయారయ్యారు. నాయకులు పార్టీలు ఫిరాయించడం కొత్త కాదు. కానీ, రఘురామకృష్ణరాజు రూటే సెపరేటు. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేని అచేతనావస్థలో వుంది వైసీపీ.

అదే, రఘురామకి బలంగా మారింది. సరే, వైసీపీని వీడి రఘురామ సాధించిందేంటి.? అన్నది వేరే చర్చ. రఘురామని వైసీపీ సర్కారు అరెస్టు చేయడం, ఆ తతంగమంతా తెలిసిందే. దాంతో, రఘురామ మరింత రెచ్చిపోతున్నారు. ఏ అవకాశం దక్కినా, వైసీపీని వదలడంలేదాయన.

తాజాగా, వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణను తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు రఘురామకృష్ణరాజు. ‘మీకేంటి సంబంధం.?’ అని రఘురామని ప్రశ్నించిన సుప్రీంకోర్టు, రఘురామ అభ్యర్థన మేరకు ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం గమనార్హం.

‘ఇన్నేళ్ళుగా కేసు విచారణ ఎందుకు నత్త నడకన సాగుతోంది.?’ అంటూ సర్వోన్నత న్యాయస్థానం, దర్యాప్తు సంస్థ సీబీఐని సూటిగా ప్రశ్నించింది. తదుపరి విచారణ జనవరికి వాయిదా పడింది.

అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్, దాదాపు పదేళ్ళుగా బెయిల్ మీదున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్, ముఖ్యమంత్రి హోదాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్ళాలన్నా కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే.

ఈ నేపథ్యంలో జగన్ కూడా, సత్వర విచారణ జరగాలనే అనుకుంటారన్నది వైసీపీ వాదన.! కానీ, వ్యవహారం వేరేలా ప్రొజెక్ట్ అవుతోంది. సుప్రీంకోర్టులో వైఎస్ జగన్‌కి ఎదురు దెబ్బ.! ‘అబ్బా’ అనిపించిన రఘురామ.. అంటూ, టీడీపీ అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేస్తోంది.