ప్రకాష్ రాజ్ యార్కర్: విష్ణు ఇన్నింగ్స్ ఎలా వుంటుందో.!

ప్రకాష్ రాజ్ కొత్త కుంపటి ఏమీ పెట్టడంలేదు. కానీ, యార్కర్ వేశాడు ‘మా’ కొత్త అధ్యక్షుడు మంచు విష్ణుకి. మరిప్పుడు, విష్ణు ఎంచుకోబోయే ఆటతీరు ఎలా వుండబోతోంది.? ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసి వివిధ పదవులకు గెలిచిన మొత్తం 11 మంది రాజీనామా చేసేశారు వారి వారి పదవులకి.

శ్రీకాంత్, ఉత్తేజ్, బెనర్జీ, తనీష్ తదితరులున్నారు రాజీనామా చేసినవారిలో. ‘మా’ ఎన్నికల పోలింగ్ రోజున మోహన్ బాబు రౌడీయిజం చూశాక, ‘మా’ అసోసియేషన్ విష్ణు నాయకత్వంలో ఎలా పని చేస్తుందోనన్న ఆందోళన తమలో వుందనీ, విష్ణు సారధ్యంలో తాము ఇమడలేమన్న కారణంగానే, రాజీనామా నిర్ణయం తీసుకున్నామనీ వారంతా చెప్పారు.

అంతేనా, ‘రాజీనామా చేసినవారి స్థానంలో మీకు నచ్చినవారిని నియమించుకుని, అత్యద్భుతంగా మీరే అన్నీ సమర్థవంతంగా నడపండి.. నెలవారీ రిపోర్టు కార్డు మాత్రం నేను మా సభ్యుడిగా అడుగుతాను.. మా ప్యానెల్ తరఫున తప్పుల్ని నిలదీస్తాం..’ అని ప్రకాష్ రాజ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారు మంచు విష్ణుకి.

కాగా, మోహన్ బాబు తనను బూతులు తిట్టారంటూ సీనియర్ నటుడు బెనర్జీ కంటతడి పెట్టారు. ఉత్తేజ్, తనీష్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మరో సీనియర్ నటుడు శ్రీకాంత్, ఇలాంటి పరిస్థితుల్ని తను కలలో కూడా ఊహించలేదన్నాడు. బుల్లితెర నటుడు ప్రభాకర్ కూడా, పోలింగ్ రోజు ఘటనలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు, ‘మా’ అధ్యక్షుడిగా విజయం సాధించిన విషయం విదితమే. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి మొత్తం 11 మంది విజయం సాధించారు. మంచు ప్యానెల్ మెజార్టీ సీట్లను దక్కించుకుంది.

ఇదిలా వుంటే, పోలింగ్ రోజున వచ్చిన ఫలితాల్లో తాను గెలిచినట్లు మీడియా అంతా చెప్పిందనీ, రాత్రికి రాత్రి ఫలితం ఎలా మారిందని అనసూయ ఆవేదన వ్యక్తం చేసింది. మొదటి రోజు కౌంటింగ్ తర్వాత బ్యాలెట్ పత్రాల్ని కొందరు ఇంటికి తీసుకెళ్ళడంపై ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు.

‘ఆ రోజున మేం ఆ విషయంపై ఫిర్యాదు చేసి వుంటే, ఎన్నిక రద్దయ్యేది. కానీ, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పరువు పోకూడదనే అప్పటికి ఆ విషయంపై ఫిర్యాదు చేయకూడదనుకున్నాం..’ అని ప్రభాకర్ చెప్పాడు. శివబాలాజీ తన మీద దాడికి యత్నించాడని సమీర్ చెప్పడం గమనార్హం.