పంచాయితీ ఎన్నికలకు సంబంధించి అడ్డంకులు తొలగిపోయాయి. అధికార పార్టీ కూడా, పంచాయితీ ఎన్నికలకు ‘సై’ అంటోందిప్పుడు. సర్వోన్నత న్యాయస్థానం తాజా మొట్టికాయలతో అధికార వైసీపీ దిగొచ్చింది. ప్రభుత్వమూ ‘పంతాల్ని’ పక్కన పెట్టి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి సహకరించాలని నిర్ణయించుకుంది. సో, ఆల్ ఈజ్ వెల్.. అన్న మాట. అయితే, ‘ఏకగ్రీవాల’ వ్యవహారంపై రచ్చ మొదలయ్యిందిప్పుడు. ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి పెడతామని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించేశారు. ‘ఇదెక్కడి చోద్యం. ప్రభుత్వం, పంచాయితీల్లో ఏకగ్రీవాల్ని ప్రోత్సహిస్తుంటుంది..
వివాదాల్లేకుండానే ఏకగ్రీవాలు జరగడం మంచి విషయమే కదా..’ అంటూ వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. నిజమే, ఏకగ్రీవాలు ఎలాంటి వివాదాల్లేకుండా జరిగితే ఎవరైనా స్వాగతించాల్సిందే. కానీ, ఏకగ్రీవం అంటే అది బెదిరింపులు, ప్రలోభాల ద్వారా జరిగే ప్రక్రియగా మారిపోయింది ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో. ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థులపై భౌతిక దాడులకు దిగుతూ, వారిని నానా రకాల ఇబ్బందులకు గురిచేస్తూ.. అధికార పార్టీలు ఆయా స్థానాల్ని గెలుచుకోవడం అనేది ఓ దారుణమైన ‘సంప్రదాయం’గా మారిపోయింది. కొత్తగా తెరపైకొచ్చిన దిక్కుమాలిన సంప్రదాయం కాదిది. చంద్రబాబు హయాంలోనూ, అంతకుముందు కూడా ఇలాంటివి చాలానే చూశాం. అంతెందుకు, గత ఏడాది స్థానిక ఎన్నికల ప్రకియ సందర్భంగా జరిగిన దారుణాలు.. ఇంకా కళ్ళముందే కనిపిస్తున్నాయి. ఆ ఏకగ్రీవాల్ని రద్దు చేయాలనే డిమాండ్ ఇప్పుడు కూడా వినిపిస్తూనే వుంది. సో, ఏకగ్రీవాలపై ఖచ్చితంగా ఎస్ఈసీ దృష్టి పెట్టి తీరాల్సిందే. ఓ పంచాయితీ పరిధిలో ఎలాంటి వివాదాల్లేకుండా అంతా కలిసి కట్టుగా ఓ నిర్ణయం తీసుకుంటే దాన్ని తప్పు పట్టాల్సిన పనేలేదు. కానీ, ఆ వాతావరణం ప్రస్తుత రాజకీయాల్లో వుంటుందా.? అవకాశమే లేదు. పంచాయితీలపై రాజకీయ పార్టీల పెత్తనం సుస్పష్టం. ఇక్కడ పంచాయితీ ఎన్నికలంటే గొడవలు చేసేది అధికార పార్టీ మాత్రమే కాదు.. విపక్షాలు కూడా తమ స్థాయిలో అల్లరి చేస్తూనే వుంటాయి. అలాంటి అల్లరికి తావివ్వకుండా, బెదిరింపులు ప్రలోభాలతో నడిచే ఏకగ్రీవాలకు ఆస్కారం లేకుండా.. సజావుగా పంచాయితీ ఎన్నికలు జరగాలని ఆశిద్దాం.