ఎన్నికల ప్రచార సమయంలో నాయకుల నాలుకకు నరం ఉండదు.. రాష్ట్రంలోని ఖజానాలో ఉన్న లెక్క ఎంత, ఆదాయం ఎంత, వ్యయం ఎంత అనే అవగాహన లేకుండానే హామీల వరాలు కురిపించేస్తుంటారు! వాటి అమలు ఎలా సాధ్యం? అనే ఆలోచన సామాన్య ప్రజానికానికి లేకపోవడం సదరు నాయకులకు దొరికిన వరం! ప్రతీ నాయకుడూ చెప్పాడంటే చేస్తాడంతే అనే విధానంలోనే ఉంటారని ప్రతీ ఐదేళ్లకూ ఒకసారి జనాలు నమ్ముతుంటారు.
ఇదే క్రమంలో ఎన్నికల సమయంలో ప్రతీ విషయంలోనూ తనదైన హామీల వర్షాలు కురిపించిన పవన్ కల్యాణ్… తాజాగా కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గంలో పర్యటించినప్పుడు మాత్రం “తానేమీ సీఎం కాదు” అని వ్యాఖ్యానించారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అంటే… నిజంగా ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం పవన్ కు లేదా?
నిర్ణయాలు తీసుకునే అధికారం, శాసనాలు చేసే శక్తి లేదని, రాదని తెలిసినా.. ఎన్నికల్లో గుక్కతిప్పుకోకుండానే ప్రజలకు హామీలు ఇస్తూ, భరోసా కల్పించేశారా?

తన శాఖల వరకూ మాత్రమే పవన్ పరిధి అయితే… ఆరో వేలుగా చెప్పే ఉప ముఖ్యమంత్రి పదవి విషయంలో పవన్ కల్యాణ్ కూడా అందరిలాగానేనా?
ఈ లెక్కన పవన్ కల్యాణ్ కు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరికి కంటి తుడుపు చర్య?
నిర్ణయాలు తీసుకునే అధికారం, శాసనాలు చేసే శక్తి లేనప్పుడు పదవులు, అధికారాలు ఎందుకు?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా.. కేశనపల్లిలో సముద్రపు నీరు చేరడంతో దెబ్బతిన్న కొబ్బరి తోటలను ఆయన పరిశీలించారు. అనంతరం కొబ్బరి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న పవన్.. ఈ క్రమంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇవి అత్యంత చర్చనీయాంశంగా మారాయి.
ఇందులో భాగంగా… ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాలువల అభివృద్ధి కోసం సుమారు రూ.4 వేల కోట్ల వరకూ ఖర్చు అవుతుందని చెప్పిన పవన్ కళ్యాణ్.. అయితే, ఆర్థికపరమైన విషయాలను సీఎం చంద్రబాబు చూస్తారని అన్నారు. కనుక.. నిధుల విషయం తనను కాకుండా ముఖ్యమంత్రిని అడగాల్సి ఉంటుందని అన్నారు!
వాస్తవానికి ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ దాదాపు అన్ని శాఖలకు సంబంధించిన హామీలు ఇచ్చారు! ఇందులో భాగంగా… సుగాలీ ప్రీతి కేసు, మహిళల హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి విషయాలపై గట్టిగా ప్రశ్నించారు. తీవ్రంగా ఆరోపించారు. అయితే.. ఇప్పుడు ఆయన హోంశాఖ మంత్రి కాదు! అందుకని పవన్ ని ఈ విషయంపై ప్రశ్నించొద్దంటారా?

పైన చెప్పుకున్నది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే! పవన్ కల్యాణ్ ఒక పార్టీ అధినేతగా అన్ని శాఖల విషయాలపైనా ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ హామీలు తాను పోటీ చేసిన, తన పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన స్థానాలకు మాత్రమే పరిమితం అని ఎవరూ భావించలేదు! ఆయన చెప్పిన హామీలు రాష్ట్రం మొత్తానికని, ఆయన రాష్ట్ర నాయకుడని నమ్మారు! ఇప్పుడు అంతా బాబే అంటే ఎలా?
ఇదే సమయంలో… ప్రతిపక్షంలో ఉన్న నాయకులు, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే క్రమంలో చెప్పే మాటల్లో… మీ సమస్యలకు నేను గళమవుతా, గొంతవుతా అని! అయితే.. ఆ సమస్యలను పరిష్కరించాల్సిన స్థానంలో ఉండి, పరిష్కరిస్తారని నమ్మి ఓట్లేసి గెలిపించిన తర్వాత కూడా… నేను కోనసీమ రైతుల గళమవుతా, గొంతునవుతా అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ వ్యాఖ్యానించడంపై పెదవి విరుపులు కనిపిస్తున్నాయి!
కొసమెరుపు!:
ఈ పర్యటనలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యాల్లో కొసమెరుపు ఏమిటంటే… కోనసీమకు దిష్టి తగిలిందని చెబుతూ.. కోనసీమ కొబ్బరి చెట్లతో పచ్చగా కలకలలాడుతూ ఉంటుందని తెలంగాణ నేతలు అనేవారని.. రాష్ట్రం విడిపోవడానికి గోదావరి పచ్చదనమే ఒక రకంగా కారణమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా.. నరుడి దిష్టికి నల్ల రాయి అయినా బద్దలైపోతుందన్నట్లుగా.. కోనసీమ కొబరి చెట్లకు కూడా అదే జరిగి ఉంటుందని చెప్పుకొచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్! దీంతో అసలు సిసలు రాజకీయ నాయకుడిలా పవన్ కల్యాణ్ మారుతున్నారనే చర్చ మొదలైంది!

హర్ట్ అవుతున్న జనసైనికులు!:
ఇలా పవన్ కల్యాణ్ వచ్చేటప్పుడు మాత్రం డిప్యూటీ సీఎం హోదాలో ప్రత్యేక హెలీకాప్టర్ లో వస్తోన్నా… మాట్లాడేటప్పుడు మాత్రం తాను పిఠాపురం ఎమ్మెల్యేని, తానో సాధారణ మంత్రిని మాత్రమే.. తనకు సీఎం స్థాయిలో అపరిమితమైన అధికారులు లేవు.. తాను కూడా చంద్రబాబు నాయకత్వంలోని కేబినెట్ లో ఒక మంత్రిని అన్నట్లుగా మాట్లాడటంపై జనసైనికులు హర్ట్ అవుతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది!
అధికారికంగా నాలుగు గోడల మధ్య జరిగేది అదే అయినప్పటికీ… జనాల్లోకి వచ్చినప్పుడు తమ గౌరవం, తమ ప్రిస్టేజ్ నిలబడేలా మాట్లాడాలని.. జనసేన పార్టీ అధినేతలా.. ఇండివిడ్యువల్ పొలిటీషియన్ గా ప్రసంగించాలని.. జనాల్లో కేవలం కూటమి పార్టీ నేతగా కాకుండా.. జనసేన అధినేతగా భరోసా కల్పించి, తద్వారా పార్టీ వ్యక్తిగత అభివృద్ధికి కృషి చేయాలని సూచిస్తున్నారని తెలుస్తోంది.

