తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. జనసేన పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. తొలుత 32 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు జనసేన పార్టీ ప్రకటించినా, బీజేపీతో పొత్తు ఖరారైన దరిమిలా, బీజేపీ సూచన మేరకు 8 స్థానాల్లో పోటీతోనే సరిపెట్టాల్సి వచ్చింది.
ఇక, జనసేన పోటీ చేయని మిగతా నియోజకవర్గాల్లో బీజేపీకి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. సరే, తెలంగాణలో జనసేన బలం ఎంత.? అసలు బీజేపీ బలం ఎంత.? అన్నది వేరే చర్చ. ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తోంది గనుక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి.! కానీ, ఆ జాడ కనిపించడంలేదెక్కడా.
తెలంగాణలో తిరిగేందుకు ‘వారాహి’ ఎందుకు మొహమాటపడుతోంది.? అసలు పవన్ కళ్యాణ్ ఇప్పుడెక్కడ వున్నారు.? ఏం చేస్తున్నారు.? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేదెవరబ్బా.! ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలేమీ లేవు. కానీ, అక్కడ టీడీపీ – జనసేన మధ్య సమన్వయ కమిటీల సమావేశాలు జరుగుతున్నాయి.
మరి, తెలంగాణను ఎందుకు పవన్ కళ్యాణ్ ‘గాలికి వదిలేసి’నట్టు.? ఈ విషయమై తెలంగాణ జనసైనికులూ ఒకింత గుస్సా అవుతున్నారు. అయితే, తమ అభిమాన నటుడు అలాగే నాయకుడు పవన్ కళ్యాణ్ మీద గౌరవంతో, జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో అగ్రెసివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు.
అలాగే, బీజేపీ ప్రచార కార్యక్రమాల్లోనూ జనసైనికులు పాల్గొంటుండడం గమనార్హం. బీజేపీ నేత ధర్మపురి అరవింద్ ‘నా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్.. ఆయన్ని ప్రచారానికి రమ్మని కోరుతున్నాం.. మీరూ రమ్మని ఒత్తిడి పెంచండి..’ అంటూ జనసైనికుల్ని ఉద్దేశించి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
ఇంతకీ, పవన్ కళ్యాణ్ ఎందుకు తెలంగాణ ఎన్నికల ప్రచారం విషయమై మొహమాటపడుతున్నట్లు.? జనసేన అభ్యర్థులూ ఈ విషయమై ఒకింత గుస్సా అవుతున్నారట అధినేత మీద.