తమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి రాజ్యాధికారం చేపడతాడని.. తమ జాతిని ఉద్దరిస్తాడని.. జనసేన పార్టీ పెట్టిన పవన్ ని ఆ సామాజికవర్గం విపరీతంగా అభిమానించింది! దేవుడు అని సంభోదించిన సందర్భాలూ ఉన్నాయి!! కట్ చేస్తే… తన బ్రతుకు తాను చూసుకుంటున్నాడని, పదవులపై వ్యామోహం లేదంటూనే ఆ ప్రయత్నాల్లో ఉన్నాడని.. ఈ బలహీనతలను స్టేట్ లో టీడీపీ, సెంట్రల్ లో బీజేపీ క్యాష్ చేసుకుంటున్నాయని కథనాలు రావడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది!
టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలను విదిలించిన సంగతి తెలిసిందే. ఇరవై నాలుగే ఎందుకు అని ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేసిన వారితో.. గాయత్రీ మంత్రంలో కూడా 24 అక్షరాలే ఉంటాయంటే తనదైన ప్రత్యేక జ్ఞానాన్ని ప్రదర్శించారు పవన్! ఈ సమయంలో బీజేపీని కూడా పొత్తులో కలుపుకున్నారు. ఇందులో భాగంగా… జనసేన – బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ 8 లోక్ సభ స్థానాలు ఇవ్వడానికి బాబు అంగీకరించారని అంటున్నారు.
ఆ సంగతి అలా ఉంచితే… పవన్ కల్యాణ్ కాకినాడ నుంచి లోక్ సభకు పోటీ చేస్తారని.. ఆయనకు కేంద్రమంత్రి పదవిని బీజేపీ పెద్దలు ఆఫర్ చేశారని ఒక వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వైరల్ గా మారింది. ఎమ్మెల్యేగా ఎక్కడ నుంచి పోటీ చేసినా.. జగన్ తనను తప్పకుండా ఓడించడానికి కోట్ల రూపాయలు వెచ్చించబోతున్నారని నిన్నటివరకూ చెప్పిన పవన్… తాజాగా ఎంపీగా పోటీచేయబోతున్నారని వార్తలొస్తున్నాయి.
దీంతో… ఇదే నిజమైతే జనసేన మరింత బలహీనపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. కారణం… ఎమ్మెల్యేగా పోటీచేసి అసెంబ్లీకి వెళ్తే… కూటమి అధికారంలోకి వస్తే… ప్రస్తుతానికి కర్ణాటకలో డీకే శివకుమార్ లా, తెలంగాణలో భట్టి విక్రమార్క లా ఒకటే ఉప ముఖ్యమంత్రి పదవి పెట్టి, అది పవన్ తీసుకుని, జనసేనను బలపరచుకుంటే… ఫ్యూచర్ లో రాజ్యాధికారం వచ్చే అవకాశం ఉండేదని పలువురు భావించారు.
అందుకే ఈ దఫా ఎన్ని త్యాగాలు చేయాల్సి వచ్చినా.. ఆ బాధ దిగమింగుకుంటూ ఉంటున్నారు. ఈ క్రమంలో తన బ్రతుకు తాను చూసుకుంటాను.. జాతిని ఉద్దరించడం, ముఖ్యమంత్రి అవ్వడం వంటి ఆలోచనలు తనకు లేవు అన్నట్లుగా పవన్ హస్తిన రాజకీయాల్లోకి వెళ్తే మాత్రం.. అది క్షమించరాని నేరంగానే పరిగణించబడుతుందని అంటున్నారు పరిశీలకులు.
నాడు.. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపేసిన చిరంజీవి.. ఫలితంగా కేంద్రమంత్రి పదవి సంపాదించుకున్నారు! ఇప్పుడు జనసేనను పరోక్షంగా టీడీపీకి బీ టీం గా, బీజేపీ చంకలో బిడ్డలా మార్చేసి.. తాను కూడా కేంద్రమంత్రి పదవి సంపాదించుకుని వెళ్తే.. తమ రాజకీయాలు తమ పదవులకోసమే తప్ప.. జాతి ఉద్దరణ కోసం కాదని మరోసారి ఆ సామాజికవర్గానికి మెగా కుటుంబం నొక్కి చెప్పినట్లవుతుందనే విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.
మరి వస్తున్న ప్రచారం నిజమేనా.. లేక, గాసిప్ మాత్రమేనా అనేది వేచి చూడాలి. అది నిజమైతే మాత్రం… అది మెగా ద్రోహమే!!