జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నదానిపై స్పష్టత లేదు. తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశముందంటూ, ఇటీవల ఉమ్మడ చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన మెగా బ్రదర్ నాగబాబు పార్టీ శ్రేణులతో చెప్పారట.
తిరుపతి నుంచి పోటీ చేస్తే, భీమవరం నుంచి కూడా పోటీ చేయొచ్చు. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల జనసేనాని పోటీ చేసి, ఆ రెండు చోట్లా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే నియోజకవర్గం విషయమై జనసేనాని ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.
ఏదో ఒక నియోజకవర్గాన్ని ఫైనల్ చేస్తే, గ్రౌండ్ లెవల్లో తాము పని మొదలు పెట్టుకుంటామని జనసైనికులు అంటున్నా, పవన్ కళ్యాణ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారాయె.
అయితే, గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ మళ్ళీ భీమవరం నుంచే పోటీ చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఈసారి లక్ష మెజార్టీ కొడతాం.. అని కొందరు జనసేన మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా హడావిడి కూడా చేస్తున్నారు. కానీ, భీమవరం అంత తేలిక కాదు పవన్ కళ్యాణ్‌కి.
గత ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గంలో ఓటు రేటు చాలా చాలా టూమచ్‌గా పెరిగింది. ఐదు వేలు, ఆ పైన కూడా ఒక్క ఓటుకీ చెల్లించాయి ప్రధాన రాజకీయ పార్టీలు. జనసేనానిని ఓడించేందుకు వైసీపీ చేసిన ఖర్చు గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటున్నారక్కడ.
‘ఈసారి పది వేలు.. కాదు కాదు, పదిహేను వేలు ఒక్కో ఓటు కోసం ఖర్చు చేయడానికి అధికార వైసీపీ సిద్ధంగా వుంది’ అని భీమవరం ప్రజానీకంలో చర్చ జరుగుతోంది. ‘పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గెలుస్తారు.. ఇంకెవరైనా పోటీ చేస్తే, జనసేనకి కష్టమే..’ అన్నది స్థానికంగా వినిపిస్తున్న అభిప్రాయం.