వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన మారే అవకాశం అయితే లేదు. కానీ, ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఆయన తప్పుకోవడం దాదాపు ఖాయమే. రాజకీయాలు మారుతున్నాయ్. వ్యాపార కార్యకలాపాలకు ఇబ్బంది రాకూడదనే కీలక నిర్ణయం తీసుకున్నారట.!
ఎవరాయనా.? ఏమా కథ.? ఆయన ఓ సిని నిర్మాత, రియల్ ఎస్టేట్ రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు కూడా. ఆయనెవరో కాదు, ఎంవీవీ సత్యనారాయణ. ప్రస్తుతం విశాఖ ఎంపీగా వున్నారు. వైసీపీలో అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడాయన.
విశాఖలో ఈ మధ్య ఆయన టైమ్ బాగా లేదు. ఆయన కుటుంబ సభ్యులు కిడ్నాప్‌కి గురయ్యారు. ఈ ఉదంతంతో ఉలిక్కిపడ్డారాయన. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రాణహానీ జరగలేదు. పోలీసులు సకాలంలో స్పందించడం గమనార్హం.
ఇంతలోనే, ఆయన విశాఖలో వ్యాపారం ఎత్తేయాలని, హైద్రాబాద్‌కి బేస్ షిఫ్ట్ చేసెయ్యాలని డిసైడ్ అయ్యారు. ఎందుకిలా.? అంటే, పార్టీలో పరిస్థితులు అనుకూలంగా లేవన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన. పొమ్మన లేక పొగపెడుతున్నారని అనడం సబబు కాదుగానీ, టిక్కెట్ వచ్చే ఎన్నికల్లో దొరకడం కష్టమేనట.
దాంతో, ముందుగానే సర్దేసుకున్నారు. పార్టీకి అవసరమైతే ఆర్థికంగా అండగా వుంటానని ఇటీవల ముఖ్యమంత్రికి చెప్పారట. ఆ తర్వాతే, షిఫ్టింగు మీద నిర్ణయం తీసుకున్నారట. అలాంటప్పుడు, ‘నన్ను వేధింపులకు గురిచేస్తున్నారు..’ అంటూ అధికారులపై ఆరోపించడమేంటి.? ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే.