మొన్న సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఒక ప్రముఖ నాయకురాలు ఫోన్ చేశారు. “కోర్ట్ తీర్పు మాకు వ్యతిరేకంగా వచ్చింది. ఇప్పుడు ఏమి జరుగుతుందంటారు?” అడిగారు. “ఏముందండి? సాయంత్రానికి డిజిపిని, చీఫ్ సెక్రెటరీని తప్పిస్తారు. రెండు నెలలపాటు ఎన్నికల కమీషన్ పెత్తనం సాగుతుంది” బదులిచ్చాను.
విచిత్రంగా అలాంటిదేమీ జరగలేదు. 2009 ఎన్నికల సమయంలో అప్పటి డిజిపి యాదవ్ ను తప్పించమని ఎన్నికల సంఘం ఆదేశించినపుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వెంటనే ఆయన్ను తప్పించారు. అలాంటివే అనేక ఉదాహరణలు ఉన్నాయి. తనను అడుగడుగునా ధిక్కరించారని డిజిపి, సీఎస్ ల మీద గుర్రుగా ఉన్న నిమ్మగడ్డ ఎందుకింకా వారి జోలికి వెళ్ళలేదు? “దూకుడు పెంచిన నిమ్మగడ్డ” … “ఆ అధికారులను తప్పించాలని నిమ్మగడ్డ ఆదేశం” …. అంటూ తాటికాయంత అక్షరాల సైజులో వార్తలు ప్రచురిస్తున్న పచ్చపత్రికలు ఎందుకు డీలా పడ్డాయి అని పరిశీలిస్తే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నత మాత్రాన నిమ్మగడ్డ నియంత కాదని, ఆయన అధికారాలకు హద్దులు ఉన్నాయని గవర్నర్ సైతం అయన ముఖతా తెలిపారంటున్నారు. బహుశా అందుకే కాబోలు, నిమ్మగడ్డ తీసుకున్న సెన్సూర్ ప్రొసీడింగ్స్ ను ప్రభుత్వం వెనక్కు పంపింది. ఎన్నికల కమీషనర్ కు అలాంటి అధికారాలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసిందట. మరి దీనిమీద నిమ్మగడ్డ, రాష్ట్ర ప్రభుత్వం కోర్టు మెట్లు ఎక్కుతాయేమో చూడాలి.
ఇక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఉద్యోగులకు ధైర్యం చెబుతూ ప్రకటనలు చెయ్యడం పట్ల కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వానికి సలహాదారు అని, ప్రభుత్వానికి అండగా నిలబడిన ఉద్యోగులకు ధైర్యవచనాలు పలకడం ఆయన కర్తవ్యము అని గ్రహించాలి. ఒకవంక కోర్ట్ ఇచ్చిన అభయంతో నిమ్మగడ్డ చెలరేగిపోతూ, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నపుడు, ఆయన చంద్రబాబు ఆదేశాలమేరకు పనిచేస్తున్నారని అనుమానాలు ఎల్లెడలా ఉన్నప్పుడు ఉద్యోగులకు రక్షణగా నిలబడటం, ప్రభుత్వం బాధ్యత. అవసరానికి వాడుకుని, ఆ తరువాత వారిని గాలికి వదిలెయ్యడం విజ్ఞత కలిగినవారు చేసే పనికాదు. నిమ్మగడ్డ ప్రస్తుతానికి బలవంతుడే కావచ్చు. కానీ ఆయన బలం అంతా తాత్కాలికం. ఎన్నికల కోడ్ ముగిశాక ఎన్నికల కమీషనర్ గాలి తీసిన బెలూన్ లాంటివాడు. ఆయన ఈ రెండు నెలలలో ఎంతమందిని సస్పెండ్ చేసినా, బదిలీలు చేసినా, కోడ్ ముగిశాక ప్రభుత్వం వాటినన్నింటిని ఉపసంహరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగించడం అంత సులభమేమీ కాదు. మరీ క్రిమినల్ కేసులు ఉంటే తప్ప అవిధేయత, అసమర్ధత కారణాలుగా చూపి తొలగించడం సాధ్యం కాదు. వారికి రక్షణ ఇచ్చే వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఆ కోణంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగుల వెన్ను తడుతున్నారు. అందుకు ఆయన్ను అభినందించాలి.
గవర్నర్ ను కలిసిన తరువాత నిమ్మగడ్డ స్వరం కూడా చాలా మారిపోయింది. ఏకగ్రీవాలమీద కన్నెర్ర చేసిన ఆయన ఇప్పుడు ఏకగ్రీవాలను స్వాగతించమని పిలుపిచ్చారు. అలాగే డిజిపి, సీఎస్ లంటే తనకు గౌరవాభిమానాలు ఉన్నాయన్నారు. నేనూ ఒక ఉద్యోగిని కాబట్టి ఉద్యోగుల మీద తనకు ఎలాంటి కక్ష లేదని చెప్పుకున్నారు. ఎన్నికలకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని కితాబిచ్చారు. ప్రభుత్వ పెద్దలు కొంచెం సంయమనంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. మొత్తానికి మొన్నటిదాకా ప్రదర్శించిన దుడుకుతనం నిమ్మగడ్డలో తగ్గిందని తోస్తున్నది. అయితే ఇది తాత్కాలికమా లేక ఏదైనా వ్యూహమా అనేది కాలక్రమంలో తెలుస్తుంది.
ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత కూడా నిమ్మగడ్డ తీరుపై వైసిపి నాయకుల విమర్శలు ఆగడం లేదు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కూడా నిమ్మగడ్డ చర్యలను దుయ్యబడుతున్నారు. ఆయన చంద్రబాబు అనుచరుడులా వ్యవహరిస్తున్నారు అంటూ విమర్శించారు. ఒక్క చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు మినహా రాష్ట్రంలో ఎవ్వరూ నిమ్మగడ్డకు సానుకూలంగా మాట్లాడటం లేదు. అది నిమ్మగడ్డ స్వయంకృతం. ఒక రాజ్యాంగ వ్యవస్థకు ప్రతినిధిగా ఉండీ తన పక్షపాత చర్యల ద్వారా ఆయన అందరి విశ్వాసాన్ని కోల్పోయారు. ఏమైనప్పటికీ వైసిపి నాయకులు, ప్రభుత్వ పెద్దలు కూడా పరిస్థితులను బట్టి సర్దుకుని పోతూ ఎన్నికల కమీషన్ కు సంపూర్ణంగా సహకరించాల్సిన ఆవశ్యకత ఉన్నది. నిమ్మగడ్డ తన వైఖరిని, ప్రవర్తనను మార్చుకున్నారని అనిపిస్తే తమ విమర్శలను ఆపడం మంచిది. ఎందుకంటే నిమ్మగడ్డ పదవీఆయుసు మరో రెండు నెలలు మాత్రమే. కానీ వైసిపి ప్రభుత్వం చాలాకాలం కొనసాగుతుంది. మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి తమ ప్రజాదరణను అంచనా వేసుకోవడానికి, అవసరం అయితే విధానాలను మార్చుకోవడానికి, ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వారికి గొప్ప అవకాశం.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు