తాను అధికారంలోకి రావడం కంటే… వైకాపాలో కొందరిని మాత్రం అసెంబ్లీకి రానివ్వకూడదనే విషయమో గట్టి పట్టుదలమీదున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పేరు.. కొడాలి నాని! అసెంబ్లీలో అయినా, బయట అయినా… బాబు పేరుచెబితే కొడాలి నిప్పులు చెరుగుతారు.. ఆ సమయంలో కొడాలిని ఆపడం ఎవరివల్లా కాదు అన్నంతగా ఆయన ఫైరయిపోతుంటారు. ఈ క్రమంలో… ఈసారి ఫస్ట్ టార్గెట్ గుడివాడ నియోజకవర్గం అని బాబు బలంగా ఫిక్సయ్యారు.
ఇప్పుడు బాబు మనసంతా కుప్పం, మంగళగిరి మీదకంటే… గుడివాడపైనే ఎక్కువగా ఉందన్నా అతిశయోక్తి కాదు. వరుసగా నాలుగు సార్లు గుడివాడ నుంచి కొడాలి నాని గెలుపొందారు. ఫలితంగా గుడివాడ అంటే కొడాలి కాని – కొడాలి నాని అంటే గుడివాడ అన్నంతగా ప్రాధాన్యత, పేరు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా గుడివాడ సీటును చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. ఫలితంగా.. కొడాలి నానిపై ఎన్నారై వెనిగళ్ల రామును నిలబెట్టాలని చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
అవును… వెనిగళ్ల రాము అభ్యర్థిత్వంపై చంద్రబాబు బలంగా మొగ్గు చూపడానికి ప్రత్యేక కారణాలున్నాయని అంటున్నారు టీడీపీ శ్రేణులు. రాముని అభ్యర్థిగా నిలబెడితే… కమ్మ-దళిత కాంబినేషన్ కలిసొస్తుందని చంద్రబాబు భావిస్తున్నారట. ఎందుకంటే… రాము భార్య దళితురాలు.. క్రిస్టియన్. గత కొంత కాలంగా ఆమె గుడివాడ నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారంట. దానికి తోడు వెనిగళ్ల రాముకు కమ్మ సామాజిక వర్గం మద్దతు ఎలాగూ ఉంటుందనేది చంద్రబాబు అంచనా అట. అంతకంటే ముఖ్యంగా… రాము దగ్గర ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయనేది బాబుకు ప్రధానంగా నచ్చిన అంశంగా చెబుతున్నారు.
అయితే… కొన్నేళ్లుగా గుడివాడలో టీడీపీకి అండగా ఉంటున్న రావి వెంకటేశ్వరరావుని పక్కన పెట్టేందుకే చంద్రబాబు మొగ్గు చూపుతుండటంపై ఆయన అభిమానులు ఫైరవుతున్నారు. రాము వద్ద ఉన్నన్ని ఆర్థిక వనరులు రావి వెంకటేశ్వరరావు వద్ద లేవనే ఒకే ఒక్కకారణంతో రావిని వాడుకుని వదిలేస్తున్నారని.. వెన్నుపోటు పొడుస్తున్నారని ఆయన అభిమానులు విమర్శిస్తున్నారు! మరి… బాబు భావిస్తున్నట్లు గుడివాడలో కొడాలిని రాము కొట్టగలారా లేదా అన్నది కాలమే సమాధానం చెప్పాలి!