యువగళం పదయాత్రలో భాగంగా దూసుకుపోతున్న నారా లోకేష్ తాజాగా మంత్రి కాకాణి గోవర్ధన్ పై ఫైరయ్యారు. పాదయాత్రలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన సభలో మైకందుకున్న చినబాబు… కాకాణిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కాకాణిని కోర్టు దొంగగా లోకేశ్ అభివర్ణించారు. కాకాణి 8 కేసుల్లో నిందితుడని, అందులో అక్రమ మద్యం కేసు కూడా ఉందని విమర్శించారు. అనంతరం ఈ మంత్రికి మద్యం మీద ఉన్న అవగాహన వ్యవసాయం మీద లేదని ఎద్దేవా చేశారు.
దీంతో తాజాగా మైకుల ముందుకు వచ్చిన కాకాణి… లోకేష్ పై సెటైర్లు వేస్తూ గాలి తీసే కార్యక్రమం చేశారు. ఇప్పటికే తాను చేసిన ఛాలెంజ్ లపై స్పందించకుండా కేవలం విమర్శలకే పరిమితమవుతున్నాడన్నట్లుగా స్పందించిన కాకాణి… యువగళం పాదయాత్రను లోకేశ్ ఒక సర్కస్ కంపెనీలా నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇదే సమయంలో లోకేశ్ యాత్ర “కలెక్షన్లు ఫుల్.. జనాలు నిల్” అన్నట్టుగా జరుగుతోంది అని సెటైర్లు వేసిన మంత్రి కాకాణి… లోకేశ్ ఫుల్ ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నాడని అన్నారు. ఈ సమయంలో… నాన్న దత్తపుత్రుడిని నమ్మాడు.. సుపుత్రుడిని వదిలేశాడని లోకేశ్ విషయంలో విచారం వ్యక్తం చేసిన మంత్రి… తన తండ్రి చంద్రబాబునాయుడిపై ఉన్న కోపాన్ని వైసీపీ నేతలపై లోకేశ్ ప్రదర్శిస్తున్నారని మంత్రి వెటకరించారు.
తాతకు వెన్నుపోటు పొడిచినట్టు తనకు కూడా పొడుస్తాడేమో అని చంద్రబాబు విషయంలో లోకేశ్ భయపడుతున్నారని కాకాణి విమర్శించారు. ఇదే సమయంలో ఎల్లో మీడియా ఫోకస్ మొత్తం దత్తపుత్రుడి వైపే ఉండి, లోకేష్ వైపు లేకపోవడంతో.. మీడియా అటెన్షన్ కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయిన లోకేశ్… ఇప్పుడు రాష్ట్రమంతా తిరుగుతూ టీడీపీ అభ్యర్థుల్ని గెలిపిస్తానని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన పేపర్లను చదువుతూ, అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని మంత్రి మండిపడ్డారు.
కాగా బిందు సేధ్యంపై లోకేష్ చేసిన విమర్శలకు మంత్రి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. క్లారిటీ ఇస్తున్న క్రమంలో మంత్రి ఛాలెంజ్ కూడా చేశారు. అయితే లోకేష్ ఆ విషయాన్ని సైడ్ చేసి మళ్లీ విమర్శలు చేయడం గమనార్హం. బిందు సేద్యంపై లోకేశ్ చేసిన ఆరోపణలు అన్నీ అసత్యమని చెప్పిన కాకాణి… బిందు సేద్యంకు రూ.1250 కోట్లు జగన్ సర్కార్ ఇచ్చిందని తెలిపారు. ఇదే సమయంలో చంద్రబాబు దిగిపోయే సమయానికి రూ.800 కోట్ల బకాయిలను పెడితే ఆ బకాయిలతో కలిసి రూ.2వేల కోట్లను ఇప్పటికే చెల్లించామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.