టీడీపీ లో లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అనే చర్చ నిత్యం జరుగుతూ ఉండే సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో ఈ వ్యవహారం తానా వేడుకల్లో కొట్టుకునేవరకూ వెళ్లిందనే వార్తలు, వీడియోలు హల్ చల్ చేశాయి. ఈ సందర్భంగా ఏపీలో వెలిసిన ఒక ఫ్లెక్స్ హాట్ టాపిక్ గా మారింది.
అవును… చంద్రబాబు సభల్లో కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన ఫోటోలు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తుండటం నిత్యం జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రతీసారీ చంద్రబాబు అసహనం వ్యక్తపరుస్తుంటారు. జూనియర్ అభిమానులను పక్కకు లాగిపడెయ్యమని తన అభిమానులను ఆదేశిస్తుంటారు.
సంగతి అలా ఉంటే… ఏపీలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీని అధికారంలోకి తేవాలని ఓవైపు నారా లోకేష్ పాదయాత్ర చేస్తుండగా.. ఇప్పుడు ఆయనకు పార్టీలో కనిపించని ప్రత్యర్ధిగా మారిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు షాకిచ్చినంత పనిచేశారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్స్ కి సంబంధించిన ఫోటోలు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి.
ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అనుకోని షాకిచ్చారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ను తదుపరి సీఎంగా పేర్కొంటూ ఓ ఫ్లెక్సీ పెట్టారు. అంతటితో ఆగకుండా ఓ కోట్ కూడా రాసిపెట్టారు. దీంతో ఇప్పుడు ఆ కొటేషన్ లో వాడిన పదాలు లోకేష్ తో పాటు చంద్రబాబుకు కూడా మంటపుట్టించేలా ఉన్నాయని తెలుస్తుంది.
ఆ ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు… “అసలోడు వచ్చే వరకూ కొసరోడికి పండగే” అనే కామెంట్ ను పెట్టారు. అంటే… అసలోడైన జూనియర్ ఎన్టీఆర్ వచ్చే వరకూ కొసరోడు అయిన లోకేష్ కు పండగే అన్న మాట. మరి వైరల్ అవుతున్న ఈ ఫ్లెక్స్ పై టీడీపీ నేతలు ఎవరైనా స్పందిస్తారా.. లేదా అనేది వేచి చూడాలి!