జనసేన పార్టీకి 25 సీట్లు ఇస్తే చాలని టీడీపీ అనుకుంటోందట.! కానీ, అవే ఎక్కువట.! ఇలా టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరుగుతోంటే, జనసేన పార్టీ గుస్సా అవుతోంది. ప్రస్తుతానికి ఆ లెక్క 35 నుంచి 50 వరకు చేరుకుంది. కాదు కాదు, 72 సీట్లు అడుగుతున్నట్లుగా జనసేన పార్టీ నుంచి లీకులొస్తున్నాయ్.
ఇవన్నీ ఇలా వుంటే, చెరి సగం అనే ప్రతిపాదన తెరపైకొచ్చింది. అయితే, ఇది అధికారికం కాదు.! 85 సీట్ల కంటే తక్కువ కేటాయిస్తే, జనసేన పార్టీ నుంచి టీడీపీకి ఓటు షేరింగ్ జరగదంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు, కొందరు జనసేన నేతలూ కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా.
ఇంకేముంది.? మళ్ళీ రచ్చ మొదటికి వస్తోంది. టీడీపీ వర్సెస్ జనసేన.. ఈ సీట్ల పంపకంపై సోషల్ మీడియాలో రచ్చ తారాస్థాయికి చేరింది. ‘జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మాత్రమే సీట్లపై స్పష్టత ఇవ్వాల్సి వుంది. అప్పటిదాకా సంయమనం పాటించండి..’ అని ఇరు పార్టీలూ ఎంతలా చెబుతున్నా, ఇరు పార్టీల మధ్య గిల్లి కజ్జాలు మాత్రం ఆగడంలేదు.
అసలు జనసేన పార్టీకి 85 మంది అభ్యర్థులు నిజంగా వున్నారా.? అంటే, జనసేనకే కాదు.. నిజం మాట్లాడుకోవాల్సి వస్తే, టీడీపీకి కూడా 85 మంది అభ్యర్థులు లేరు. అధికార వైసీపీకి సిట్టింగ్ ప్రజా ప్రతినిథులున్నారు గనుక, సమస్య లేదని అనుకోవడానికి వీల్లేదు. అక్కడా, జంపింగ్ జపాంగుల సమస్య వుందన్నది టీడీపీ, జనసేన వాదన.
ఎవరి గోల ఎలా వున్నా, జనసేన పార్టీ డిమాండ్ చేసే సీట్ల విషయమై లొల్లి ఎప్పటికప్పుడు టీడీపీ – జనసేన పొత్తుని అయోమయంలోకి నెట్టేస్తూనే వుంది. దాంతో, టీడీపీ – జనసేన పార్టీల్లో చేరాలనుకుంటున్న వైసీపీ అసంతృప్త నేతలు డైలమాలో పడిపోతున్నారు.