జనసేనతో పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు వ్యవహారం ఈదఫా చంద్రబాబుకు గట్టి షాకులే ఇచ్చేలా ఉందనే చర్చ రాజకీయవర్గాల్లో మొదలైపోయింది. ఇందులో భాగంగా… పలు స్థానాల్లో టిక్కెట్లు ఆశించి, అన్నీ సిద్ధం చేసేసుకుని, అందులో భాగంగా అనుచరులకు ఎన్నో ప్రామిస్ లూ చేసేసిన నేతలు… చివరి నిమిషంలో అధినేత నుంచి సారీ అనే మాట వినిపించే సరికి తట్టుకోలేకపోతున్నారు. తమ సీటు తాము దక్కించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తెరపైకి వచ్చారు. బీకాంలో ఫిజిక్స్ చదివిన అరుదైన నాయకుడిగా గుర్తింపు సంపాదించుకున్న జలీల్ ఖాన్ లాంటి అరుదైన మేధావి వైసీపీలో కాదు, టీడీపీలో ఉండాలనుకున్నారో ఏమో కానీ… ఆయన్ను తన పార్టీలో చేర్చుకున్నారు చంద్రబాబు. ఈయన తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఈయన విజయవాడ వెస్ట్ టికెట్ ఆశిస్తుండటమే దీనికి కారణం.
అవును… ఈసారి విజయవాడ వెస్ట్ సీటు తనకే ఇవ్వాలని పలువురు టీడీపీ నేతలతో పాటు జనసేన కూడా కోరుకుంటోంది. ఇదే సమయంలో ఆ టిక్కెట్ విషయంలో జలీల్ ఖాస్ తన మార్క్ సంచలన కామెంట్స్ చేశారు. ఇందులో భాగంగా… విజయవాడ వెస్ట్ టికెట్ తనదే అని, టిక్కేట్ దక్కించుకోవడమే కాదు.. ఎన్నికల్లో గెలిచి తీరుతానని చెబుతున్నారు. ఇది ఏ నాయకుడైనా చెప్పే మాటలే అనుకుంటే పొరపాటే!
కారణం ఈయన జలీల్ ఖాన్! అంతటితో ఆగని జలీల్ ఖాన్… తన పార్టీ నేతలతో పాటు జనసేన నాయకుడు కూడా విజయవాడ వెస్ట్ టికెట్ అడగడాన్ని దృష్టిలో పెట్టుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా… టికెట్ అందరూ అడుగుతారన్నారు కానీ.. గెలిచే స్తోమతతోపాటు మంచి విలువలతో కూడిన క్యారెక్టర్ వుండాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ సమయంలో… ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే ఉరేసుకుంటానని సంచలన కామెంట్స్ చేశారాయన.
దీంతో తన మాటలకు తానే ఉలిక్కిపడ్డారో ఏమో కాని… అనంతరం ఆ స్టేట్ మెంట్ లో కరెక్షన్ చేసే పనికి పూనుకున్నారు. ఇందులో భాగంగా.. తనకు టికెట్ ఇవ్వకపోతే ముస్లిం మైనార్టీలు ఉరి వేసుకోడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. పైగా… ఇప్పటికే ఇద్దరు ముగ్గురు ఆ పని చేయడానికి ప్రయత్నించగా.. తాను అడ్డుకున్నట్టు కూడా పేర్కొనడం గమనార్హం. మరి ఈ స్టేట్ మెంట్ ని బాబు ఎంత సీరియస్ గా తీసుకుంటారనేది వేచి చూడాలి.