తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రాజకీయానికి తెరలేచింది. ఏపీలో టీడీపీలోతో పొత్తులో ఉన్న జనసేన… తెలంగాణలో బీజేపీతో పొత్తు కుదుర్చుకుందని అంటున్నారు. ఇక సీట్ల సర్ధుబాటుపైనే కుస్తీపోటీలు జరుగుతున్నాయని చెబుతున్నారు! ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీచేయకూడదని అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఈ నిర్ణయం నచ్చక అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. ఆ సంగతి అలా ఉంటే… ఏపీలో విపక్షాలు అన్నీ ఎన్నికలనాటికైనా ఒకటి అవుతాయని ఒకవర్గం ప్రజలు నమ్ముతున్నారని అంటున్నారు.
ఏపీలో వైఎస్ జగన్ ను గద్దెదింపడానికి టీడీపీ – జనసేనతో పాటు బీజేపీకూడా కలిసే అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయపడుతుండగా.. అలాంటి ఛాన్స్ ఆల్ మోస్ట్ లేదని మరికొంతమంది అంటున్నారు. ఇప్పటికే బీజేపీ-టీడీపీ ల మధ్య చాలా గ్యాప్ ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో… ఆ గ్యాప్ ని పెంచే ఉద్దేశ్యమో.. లేక, అధిష్టాణం పెద్దలకు సమాచారం ఇచ్చే క్రమమో తెలియదు కానీ… తాజాగా ఈటెల రాజేందర్ మైకందుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును… తెలంగాణాలో కాంగ్రెస్ ని పైకి లేపడానికి చంద్రబాబు చూస్తున్నారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 2018లో కాంగ్రెస్ తో పొత్తు బాహాటంగా పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారని.. ఈసారి అలా కాకుండా తాను పోటీ నుంచి తప్పుకుని తెర వెనక మద్దతు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. ఫలితంగా.. కాంగ్రెస్ గెలుపు కోసం చంద్రబాబు పనిచేస్తున్నారని ఆయన కీలక కామెంట్స్ చేశారు. దీంతో తాజాగా ఈటల చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.
ఇదే ఫ్లో కంటిన్యూ చేస్తూ… కాంగ్రెస్ పార్టీపై ఈటల తీవ్ర విమర్శలు చేశారు. ఇందులో భాగంగా… ఎవరు మద్దతు ఇచ్చినా, ఎందరు లోపాయికారీగా సాయం చేసినా ఆ పార్టీ గెలిచేది లేదని ఈటెల అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున 19 మందిని గెలిపిస్తే అందులో ఏకంగా పన్నెండు మంది ఎమ్మెల్యేలు బీఆరెస్స్ లోకి వెళ్లిపోయారని ఈటెల గుర్తు చేశారు. ఇపుడు కూడా అదే జరుగుతుందని.. కాంగ్రెస్ కి ఓటేసినా బీయరెస్స్ కి వేసినా ఒక్కటే అని ఆయన తెలిపారు.
ఆ సంగతి అలా ఉంటే… ఇక బీజేపీకి – చంద్రబాబుకు మధ్య గోడ మరింత బలంగా కట్టేలా అన్నట్లుగా ఈటల రాజేందర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. చంద్రబాబు 52 రోజుల పాటు జైలు జీవితం గడపి మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆయన హైదరాబాద్ కి బుధవారం రాత్రి చేరుకున్నారు. బాబు ఇంట్లో.. లేకపోతే, ఆసుపత్రిలో ఉండాల్సిన పరిస్థితి! మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ వచ్చింది కాబట్టి అది తప్పకపోవచ్చు!
అయితే సరిగ్గా తెలంగాణా ఎన్నికల వేళలో చంద్రబాబు హైదరాబాద్ లో ఉండడం మీదనే ఇప్పుడు చర్చ సాగుతోంది. దీంతో… ఇప్పుడు బీజేపీ స్టార్ట్ చేసేసింది. అయితే తెలంగాణలో ఇప్పటికే అస్త్ర సన్యాసం చేసినప్పటికీ… తన పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ కు ఓటు వేసేలా చంద్రబాబు కథ నడుపుతున్నారని బీజేపీ ఆరోపిస్తుంది. టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ విడుదల చేసిన లేఖలో కాసాని ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్థావించారు!
దీంతో… ఏపీలో బీజేపీ టీడీపీ పొత్తులకు మరింత గ్యాప్ ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే కాంగ్రెస్ కి, కాంగ్రెస్ లో ఉన్న రేవంత్ కి లోపాయి కారీగా చంద్రబాబు మద్దతు అంటూ వస్తున్న వార్తలను తీసుకుంటే ఇండియా కూటమి వైపుగా టీడీపీ సాగుతోందా అన్న కొత్త చర్చ కూడా తెరపైకి వస్తుంది. దీంతో… ఏపీలో టీడీపి – జనసేన మాత్రమే పొత్తులో ఉండబోతోందా అనే చర్చ తెరపైకి వచ్చింది! మరి ఈ విమర్శలను బాబు తనదైన చాణక్యంతో ఎలా తిప్పికొడతారనేది వేచి చూడాలి.