సినీ నటుడు సప్తగిరి, వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నాడట. వారం పది రోజుల్లోనే ఈ మేరకు ఓ స్పష్టత రానుందట కూడా. ఇటీవల సప్తగిరి, తాను టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించాడు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో భేటీ అయ్యాడు. అలాగే, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణని కలిసి ఆశీస్సులు కూడా తీసుకున్నాడు సప్తగిరి. అయితే, తెరవెనుక ఇంకో కథ నడుస్తోంది.
అదేంటంటే, సప్తగిరి అంటే.. పవన్ కళ్యాణ్ మనిషి అట.! పవన్ కళ్యాణ్ మీద వీరాభిమానం వున్నా, ఆ విషయం అత్యంత సన్నిహితుల వద్దనే లాక్ చేసేశాడట సప్తగిరి. ‘కాటమరాయుడు’ సినిమా టైటిల్ తొలుత సప్తగిరి దగ్గర వుండేది. పవన్ కళ్యాణ్ అడగడంతో ఇచ్చేశాడు.
2024 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేయాలనుకున్నాడట సప్తగిరి. అది కూడా, చివరి నిమిషంలో అనౌన్స్మెంట్ వచ్చేలా, పవన్ కళ్యాణ్‌తోనూ చర్చించాడట. కానీ, మధ్యలో సీన్ మారింది.
జనసేన నుంచి అంటే, పొత్తుల్లో టిక్కెట్ కష్టం కావొచ్చు.. అదే టీడీపీ నుంచి అయితే బెటర్.. అని సన్నిహితులు సూచించడంతో, అదే అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ వద్ద వెలిబుచ్చాడట సప్తగిరి. పవన్ కళ్యాణ్ ‘సరే’ అనడంతో, సప్తగిరి టీడీపీ వైపు తిరిగాడని అంటున్నారు.
నిజమేనా.? రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు మరి.!