బాబుకు షాకిచ్చిన చిత్తూరు రైతు… 45 రోజుల్లో రూ.4 కోట్లు!

కూరగాయల మార్కెట్ లోకి వెళ్లిన సామాన్యుడు టమాటాలవైపు చూడటానికి కూడా సంశయిస్తున్నాడన్నా అతిశయోక్తి కాదేమో. ఆ స్థాయిలో రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి టమాటా ధరలు. ఇలా కొండెక్కిన టామాటా ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటే… కొంతమంది రైతులను మాత్రం కోటీశ్వరులను చేస్తోంది. నిజంగానే రైతులను రాజులను చేస్తోంది.

అవును…గ‌త రెండు నెల‌లుగా దేశ‌వ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న ట‌మాటో ధ‌ర‌లు… గతవారం కాస్త త‌గ్గిన‌ట్టు క‌నిపించినా… ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌తో మ‌ళ్లీ పెరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కొంత మంది రైతుల‌ను ట‌మాటాలు కోటీశ్వరుల‌ను చేశాయి. ఇందులో భాగంగా ఏపీకి చెందిన రైతు కోటీశ్వరుడయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌ లోని చిత్తూరు జిల్లాకు చెందిన ఓ టమోటా రైతు 45 రోజుల్లోనే రూ.4 కోట్లు రాబట్టి అక్షరాలా జాక్‌ పాట్ కొట్టాడు. టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో మురళి అనే రైతు అదృష్టం ఒక్కసారిగా మారిపోయింది. మురళి దంపతులు ఏప్రిల్‌ లో కరకమండ్ల గ్రామంలోని 22 ఎకరాల భూమిలో టమోటా సాగు చేశారు.

పంట ఏపుగా పెరగడంతో గత 45 రోజులలో 40,000 టమాట బాక్సులను విక్రయించారు. ఇలా పెద్ద మొత్తంలో ఆదాయం రావడంతో గతంలో ఇదే కూరగాయ సాగు వల్ల చేసిన రూ.1.5 కోట్ల అప్పులు తీర్చగలిగామని రైతు చెబుతున్నారు. ఈ సందర్భంగా రైతు చెప్పిన విషయాలు చంద్రబాబు కు షాకిచ్చేవిగా ఉన్నాయని తెలుస్తుంది.

అవును… ఈ స్థాయిలో తన పంట దిగుబడి రావడానికి విద్యుత్ సరఫరా బాగుండడం ఒక కారణం అని పరోక్షంగా జగన్ కి థాంక్స్ చెబుతున్నాడు సదరు రైతు. దీంతో ఈ మాట చంద్రబాబుకి దిమ్మతిరిగేదే అనే మాటలు వినిపిస్తుండటం కొసమెరుపు.

కాగా… దేశంలో టమాటా ధరలు పెరిగిపోవడానికి కారణం వైఎస్ జగన్ అంటూ… చంద్రబాబు తనదైన విశ్లేషణ చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో టమాటా రైతులను జగన్ ప్రోత్సహించకపోవడం వల్లే దేశంలో వాటి ధరలు ఇలా పెరిగిపోయాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

చిత్రంగా… చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లాకు చెందిన టమాటా రైతే… ఏపీలో విద్యుత్ సరఫరా బాగుండటం వల్ల కూడా ఇది సాధ్యమైందని రైతు చెప్పడం గమనార్హం. ఏది ఏమైనా… ఏ రకంగా చూసుకున్నా చంద్రబాబు చేసిన విమర్శలు బౌన్స్ బ్యాక్ అవుతున్నాయని అంటున్నారు పరిశీలకులు.