రూస్వేల్ట్ కానక్కర్లేదు, బాబూ! మీరు తిరోగామి కాకుంటే చాలు…

( మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి*)

 

ఒక దేశం లేదా రాష్ట్రం తీవ్రమైన సంక్షోభంలో ఉన్నపుడు అక్కడి ప్రజలు రాజకీయాలను మరచి పాలకులకు అవకాశం ఇవ్వాలి. అమెరికా సంక్షోభంలో ఉన్నపుడు సాంప్రదాయానికి భిన్నంగా దేశ అధ్యక్షుడిగా రూస్వేల్ట్ ను నాలగు సార్లు ఎన్నుకున్నారని ఆ కారణంగా అమెరికా అభివృద్ది చెందిన దేశంగా మారిందని అలాంటి స్థిలో ఉన్న ఏపీని బాగు చేయడానికి తనకు అవకాశం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చినారు.  ఒక అధికారిక ప్రభుత్వం కార్యక్రమములో బాబు ఈ పిలునిచ్చినారు.

అమెరికాలో ఏమి జరిగింది…

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1929-33 మద్య కాలంలో 3 కారణాలతో తీవ్ర సంక్షోభానికి గురైనది అమెరికా. 1. వ్యవసాయంలో సాంకేతికతను జోడించడం ఆధునిక పద్దతులను అవలంభించడం వంటి  కారణంగా అధిక ఉత్పత్తి జరిగింది. ఫలితంగా వ్యవసాయ సంక్షోభంలో పడిపోయింది.  2. పరపతి విధానం దెబ్బతిన్న కారణంగా  బ్యాంకింగ్ వ్యవస్థ పతనం అయింది. 3. స్టాక్ మార్కెట్ లో బినామీ కంపినీల ప్రవేశం, కృత్రిమ పెరుగుదల వలన అభివృద్ది చెంది అంతే త్వరగా కుప్పకూలింది. అలా అమెరికా సంక్షోభం 1929 నుంచి 1933 వరకు కొనసాగింది. దేశంలోని ప్రతి నలుగురిలో ముగ్గురికి పని లేని స్థితి. ఆ పరిస్థితులలో అమెరికా 32 వ అధ్యక్షుడిగా ప్రాంక్లీన్ డి. రూస్వెల్ట్  డెమోక్రటిక్ పార్టీ తరపున ఎన్నికయినారు.

 

రూస్వేల్ట్ ఇతరులను నిందించి తనకు అవకాశం ఇవ్వమని ప్రాధేయపడలేదు. ఆయన  పాలన తీరును గమనించిన ఆ దేశ ప్రజలే  వారికి వారుగా అవకాశం ఇచ్చినారు.

 

రూజ్ వెల్ట్ సంస్కరణలతో అభివృద్ది పధంలో అమెరికా…

తీవ్ర సంక్షోభంలో ఉన్న అమెరికాను అభివృద్ధి పరచడానికి వారు గొప్ప సంస్కరణలను రూపొందించినారు. ధనిక కుటుంబంలో జన్మించిన రూస్వేల్ట్  హర్వర్డ్ యూనివర్సిటీలో విద్యభ్యాసం చేసి కొలంబియాలో న్యాయశాస్త్రం పూర్తిచేసినారు. న్యూయార్క సెనెటర్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి  3 సార్లు దేశ ఉపాధ్యక్షుడిగా పోటీ చేసి ఓటమి చెందారు. 1930లో న్యూయార్క్ గవర్నర్ గా ఎన్నికయినారు. అటు పిమ్మట 1933 నుంచి 45 వరకు వరుసగా 4 పర్యాయాలు దేశ అధ్యక్షుడిగా ఎన్నిక అయిన రూస్వేల్ట్ నాలుగో పర్యాయం ఎన్నికయిన తర్వాత మరణించినారు. ధనిక కుటుంబంలో జన్మించినప్పటికీ పేదల అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు. న్యూడీల్ పేరుతో  కీలక నిర్ణయాలను ప్రకటించారు. సాంఘిక సంస్కరణలు, సంక్షేమ మార్గంలో  వారు తీసుకున్న అనేక సంస్కరణల ఫలితంగా అమెరికా త్వరితగతిన కోలుకోవడమే కాదు అబివృద్ది చెందిన దేశంగా ఎదగడానికి మంచి పునాదులు పడ్డాయి. అధికారికంగా అమెరికాలో రెండు పర్యాయాలు మాత్రమే ఎన్నిక కావాలి అన్న చట్టం 1951 న వచ్చినప్పటికి అంతకు పూర్వం కూడా రూస్వేల్ట్ కు ముందు దాదాపు అందరూ 2 పర్యాయాలు మాత్రమే అధ్యక్షులుగా ఉన్నారు. దేశాన్ని పురోగమన మార్గంలో వారు నడుపుతున్నారన్న నమ్మికతో  దేశం పూర్తిగా కోలుకునేంత వరకు వారికి అవకాశం ఇవ్వాలని భావించిన అక్కడి ప్రజలు గత సంప్రదాయాలకు భిన్నంగా రూస్వేల్ట్  కు నాలుగు పర్యాయాలు అవకాశం ఇచ్చినారు. ఇక్కడ గమనించవలసింది. వారు అడిగితే అక్కడి ప్రజలు అవకాశం ఇవ్వలేదు. తీవ్రసంక్షోభంలో ఉన్న అమెరికాను వారు నడుపుతున్న పద్ధతులపట్ల నమ్మికతో ప్రజలు వారిని కొనసాగించినారు.

అమెరికా పరిస్థితులకు ఆంధ్రప్రదేశ్ కు పొంతన ఉందా…

అమెరికా ఒక దేశం దానికి అధ్యక్షుడు రూస్వేల్ట్ కానీ ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం అంతే కాదు నాటి అమెరికా అంతటి సంక్షోభం ఏపీ లో ఉందా అంటే కచ్చితంగా లేదు. ఏపీలో తీవ్ర సంక్షోభానికి కారణం కేవలం విభజన, కేంద్రం సాయం చేయకపోవడం మాత్రమేనా.  విభజన వలన రాష్ట్రం నష్టపోయింది అనడంలో తప్పులేదు. కానీ అది ఎంత అన్నదే ఇక్కడ ప్రశ్న. విభజన నాటికి అంటే 2014 ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మొత్తం బడ్జెట్ దాదాపు 1.32 లక్షల కోట్లు. అందులో హైదరాబాదు ఆదాయం 22 వేల కోట్లు ఇపుడు విభజన కారణంగా కోల్పోయింది హైదరాబాదు ఆదాయం మాత్రమే. తెలంగాణ వాటా పోతే ఏపీ నికరంగా కోల్పోయింది 12 వేల కోట్లు  ఆమేరకు ప్రతి ఏటా ఆదాయం తగ్గడం కష్టం కాదనలేము కానీ అది అమెరికా సంక్షోభం అంతా ? ముఖ్యమైన విషయం కోల్పోయింది 12 వేల కోట్లు అయితే కేంద్రం తీసుకున్న కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటా 32 శాతం నుంచి 42 శాతానికి పెంచే మార్పు పలితంగా ప్రతిఏటా 22 వేల కోట్లు ఏపీకి వస్తుంది. ఇక్కడ చెప్పదలచుకున్నది విభజన దాని పలితంగా హైదరాబాదు ఆదాయం కోల్పోవడం వలన ఏర్పడిన సమస్య పరిస్కారం అయినట్లే కధా. ఇంకా విభజన సమస్యల గురించి ఉత్పాతం జరిగినట్లు మాట్లాడటం విచిత్రం. అంతగా విభజనే కారణం అని భావించినట్లు అయితే బాబు విభజనను నేరుగా ఎందుకు వ్యతిరేకించలేదు. రాష్ట్రం సంక్షోభలో ఉంది అంటే మునుపటి పాలకులే ప్రధాన  కారణం. మరీ ఉమ్మడి రాష్ట్రంలో ఏపీని ఎక్కువ సంవత్సరాలు పాలించిది బాబే. హైదరాబాదును తానే అభివృద్ధి చేశానంటున్న బాబు అది కోల్పోతే ఏపీ తీవ్రసంక్షోభంలోకి వెళ్లే  పరిస్థితికి గురికావడం అంటే గడిచిన పాలన ఆయన దూరదృష్టితో చేసినట్లు కాదనే  వాస్తవాన్ని బాబు అంగీకరిస్తారా.

బాబూ మీరు రూస్వేల్ట్  కాకపోయినా పరవాలేదు కానీ… 

తీవ్రసంక్షోభంలో ఉన్న అమెరికాను తన సంస్కరణలతో బలమైనా దేశంగా తీర్చిదిద్దినారు రూస్వేల్డ్. వారిలాగా తనకు అవకాశం ఇవ్వమని అడుగుతున్న చంద్రబాబు మొదట గమనించాల్సింది రూస్వేల్ట్ ఇతరులను నిందించి తనకు అవకాశం ఇవ్వమని అడగలేదు తన పాలన పద్ధతులను గమనించిన ఆ దేశ ప్రజలు వారికి వారుగా అవకాశం ఇచ్చినారు. మీరు కేంద్రాన్నో మరొకరినో నిందించి కాకుండా  గడిచిన నాలుగు సంవత్సరాలుగా అమలు చేస్తున్న విధానాలు మంచివి అని  భావించితే  జనమే మీకు ఓట్లు వేస్తారు. ఒక వేళ అమెరికా దేశంలోని జనమంతటి తెలివి మన వారికి లేదని మీరు భావించితే మీ పాలన విధానాలను జనానికి వివరించి ఓట్లు అడగాలి. అంటే  గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఏమి చేసినారు వాటి ఫలితంగా రాష్ట్రం ఎలా ముందుకు వెలుతున్నది అన్న విషయాలు చెప్పి ఓట్లు అడగాలి. కానీ అందుకు భిన్నంగా ఇతరులను నిందించడం, పరిస్దితులను విపరీత అర్దంలో చూపి ప్రజలను తనకు ఓటు వేయాలనే పద్ధతులలో రాజకీయం చేయడం మాత్రం బాబు చూసి నేర్చుకోవాలి.

 

(*యం. పురుషోత్తం రెడ్డి, యలసీమ మేధావుల పోరం, తిరుపతి)