ఏపీలో టీడీపీ – జనసేన కూటమిలోకి బీజేపీ వచ్చి చేరింది. దీని వెనుక పడిన కష్టం అంతా తనదే అని.. ఈ కూటమి క్రెడిట్ పూర్తిగా తనకే దక్కుతుందని.. ఈ కూటమి ఏర్పడటానికి తానే సూత్రదారి అని పవన్ ప్రకటించుకుంటున్న పరిస్థితి. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదనేది పవన్ బలంగా నమ్ముతూ, చంద్రబాబుని ఒప్పించి, బీజేపీతో పొత్తు కుదిర్చారు. ఇప్పుడు ఇదే పవన్ కు సమస్యగా మారిందని తెలుస్తుంది.
ఏపీలో 2019 తగిలిన భారీ దెబ్బ దృష్ట్యా టీడీపీ ఒంటరిగా పోటీ చేయాలని భావించలేదని అంటారు. ఈ సమయంలో పవన్ తోడు అత్యంత కీలకమని నమ్మిన బాబు.. ఆ దిశగా పవన్ ని ఒప్పించారు. ఈ విషయంలో తమ్ముళ్లు కూడా హ్యాపీగానే ఉన్నారని.. సీట్లు మాత్రం పాతికకు మించకుండా జాగ్రత్తపడితే చాలని బాబుకు చెప్పారని కథనాలొచ్చాయి. ఈ విషయంలో తమ్ముళ్లు కోరుకున్నట్లుగానే బాబు వ్యూహాత్మకంగా పావులు కదిపారు.
తాను ఊహించుకుంటున్నంత బలం తనకు లేదనే విషయం పవన్ కు అర్ధమయ్యేలా చెప్పడంలో సక్సెస్ అయ్యారు! దీంతో… 24 స్థానాలకు పవన్ అంగీకరించారు. గాయత్రీ మంత్రంలోని అక్షరాలు 24 అవ్వడం కూడా ఆయన అన్ని సీట్లకు అంగీకరించడానికి ఒక కారణం అని తెలిపారు! ఆ సంగతి అలా ఉంటే… హస్తినలో ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చిన పవన్… బీజేపీ పెద్దలను ఒప్పించడంలో సక్సెస్ అయినట్లుగా తాజాగా ప్రకటించుకున్నారు కూడా.
అయితే… బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్ సభ సీట్లు కేటాయించడంపై మాత్రం తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారని తెలుస్తుంది. 6 లోక్ సభ స్థానాలు అంటే… సుమారు 42 అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభావితం చేసే స్థానాలనే చెప్పాలి! పవన్ కూడా ఈ లాజిక్ కు అంగీకరిస్తారు. 24 + 3 లోక్ సభ (3 * 7 = 21) మొత్తం 40కి పైగానే స్థానాలు అని పవన్ తాను పోటీ చేసే స్థానాలు తక్కువేమీ కాదని చెప్పారు కూడా.
ఆ సంగతి అల ఉంటే… ఇన్ని కీలక స్థానాల్లో బీజేపీ నేతలు పోటీ చేస్తే… ఇంతటి టఫ్ సిట్యువేషన్ లో వాటిలో ఒకటో రెండో మాత్రమే బీజేపీ అభ్యర్థులు గెలిస్తే… పరిస్థితి ఏమిటి అనేది తమ్ముళ్ల ఆవేదనగా ఉందని తెలుస్తుంది! 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒకటో రెండో గెలిస్తే.. 21 స్థానాల్లోనూ జనసేన 10లోపే నిలిస్తే పరిస్థితి మొదటికే మోసం వచ్చేలా మారుతుందనడంలో సందేహం లేదని అంటున్నారంట.
కేవలం… జనసేన – టీడీపీ మాత్రమే కలిసి పోటీ చేస్తుంటే ఇంత టెన్షన్ తమకు ఉండేది కాదని.. బీజేపీపైనా, మోడీపైనా ఏపీ వాసులకు ఉన్న ఆగ్రహం అంతా ఇప్పుడు కూటమిపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. ప్రధానంగా ఎస్సీలు, చాలా వరకూ బీసీలు, క్రైస్తవులు, ముస్లింలు, గిరిజనల ఓట్లు పూర్తిగా టీడీపీ – బీజేపీ – జనసేన కూటమికి దూరమయ్యే ప్రమాదం లేకపోలేదని అంటున్నారని తెలుస్తుంది.
దీంతో… బీజేపీని తెచ్చి తమకు తగిలించి జగన్ నెత్తిన పవన్ పాలు పోశారని… ఈ ఎన్నికల్లో ఏమైనా తేడా వస్తే ఆ పాపం మొత్తం పవన్ దే అని తమ్ముళ్లు సీరియస్ గా చర్చించుకుంటున్నారని సమాచారం. దీంతో… జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. పొత్తు కోసం పవన్ హస్తినలో అంత కష్టపడితే చివరకు దక్కేది ఇదా అని అంటున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా… పవన్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారేలా ఉందనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి!!
మరి 2014 – 19 వరకూ తమదైన పాలన అందించిన ఈ కూటమిని ఏపీ ప్రజలు ఇప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది వేచి చూడాలి. తేడా వస్తే మాత్రం ఆ క్రెడిట్ అంతా పవన్ దేనట!