అమరావతిలో జగన్ పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. రైతులు అక్కడక్కడా నల్ల బెలూన్ లు పట్టుకుని నిరసన తెలిపారు. పోలీసులు వారిని కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయ్యారు. పట్టాలు పొందిన 50,793 పేద కుటుంబ సభ్యులు అంతా హ్యాపీ. వైసీపీ శ్రేణులు మరీ హ్యాపీ. జగన్ ఫుల్ ఖుషీ. విపక్షాలన్నీ మౌనం. మరి అమరావతికి భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏమిటి?
అమరావతి రైతుల భూములకు పూర్తిగా చంద్రబాబు & కో బాధ్యులు అనేది నిర్వివాదాంశం! బాబు ని నమ్మో, తమ నాయకుడని నమ్మో… కారణం ఏదైనా… అమరావతి రైతులు భూములు ఇచ్చారు. వారికి న్యాయం చేయడంలో బాబు తన ఐదేళ్ల పాలనలో సక్సెస్ ఫుల్ గా ఫెయిల్యూర్ అయ్యారు. అయినప్పటికీ వారు అన్యాయం అయిపోతున్నారని తెలిసి కూడా… వారిని రెచ్చగొట్టారు, మరోసారి తాను అధికారంలోకి రావడానికి వారి ఎమోషన్ ని వాడుకోవాలని పరితపించారు.
ఏదోలా జగన్ పాలనలో ఐదేళ్లపాటు వారంతా ఇబ్బందులు పడినా.. తర్వాత మరో ఐదేళ్లు తనకు పాలన రాకపోతుందా.. అమరావతిని అడ్డుపెట్టుకుని అధికారంలోకి రాకపోతామా అని బాబు భావించారు! ఈలోపు జగన్ మరింత వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. అమరావతి అంటే పెత్తందారులది కాదు.. ప్రజలందరిదీ అని చేసి చూపించారు. అందులో భాగంగా… పేదలకు పట్టాలు అందించారు. పట్టాలు అందుకున్న లబ్ధిదారుల్లో అత్యధికంగా బీసీలు 26,869 మంది, ఎస్సీలు 8495 మంది, ఎస్టీలు 1579 మంది, అగ్రవర్ణాల్లోని పేదలు 13,850 మంది ఉన్నారు.
ఈ సమయంలో అమరావతి రైతులను ఇంతకాలం వాస్తవాలకు దూరం చేస్తూ, భ్రమలకు దగ్గరచేస్తూ వారి జీవితాలను అటూ ఇటూ కాకుండా చేసిన టీడీపీ – జనసేన – కమ్యునిస్టు పార్టీలు – బీజేపీ మొదలైన నాయకులు చీకట్లో దాక్కుండిపోయారు! వెలుగులోకి రావడానికి, అమరావతి రైతుల తరుపున మాట్లాడటానికి సాహసించలేకపోయారు. ఆ విధంగా జగన్ వారి నోటిని వ్యూహాత్మకంగా నొక్కేశారు. కారణం… ఈ సమయంలో ఏ రాజకీయ పార్టీ అయినా అమరావతి రైతుల తరుపున మాట్లాడితే… ఏభైవేల పైచులుకు పేద కుటుంబాలకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు అనే సంకేతాలు పంపించారు. ఫలితంగా అమరావతి రైతులు ఒంటరైపోయారు! ఇది రైతులకు టీడీపీ – జనసేన – కమ్యునిస్టు పార్టీలు – బీజేపీ ల ద్రోహం!
ఇప్పటికైనా మించి పోయిందేమీ లేదు. రాజకీయ నాయకులను నమ్ముకుని ఇంకా వంచనకు గురవ్వడం అమరావతి రైతులకు ఏమాత్రం శుభం కాదు. ఇప్పటికైనా జగన్ తో చర్చలు జరిపి.. ఉన్నంతలో మేలు పొందడం మినహా మరో దారి లేదు! ఇంకా అవకాశవాద రాజకీయ నాయకులను, కష్టకాలంలో కలిసిరాని నేతలను, పార్టీలనూ నమ్ముకుని ఇబ్బందులు పడటం కంటే… ప్రభుత్వంతో చర్చలు జరిపి, అన్ని విధాల ప్రయోజనకరమైన ముగింపుకు వస్తే మంచిదని పలువురు సూచిస్తున్నారు. మరి, ఇప్పటికైనా రాజధాని రైతులు పునరాలోచిస్తారా.. లేక, రాజకీయ పార్టీల వంచనకు బలవుతూనే ఉంటారా అన్నది వేచి చూడాలి!