స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అరెస్టు, తదనంతర రాజకీయ పరిణామాలు ఒకెత్తు అయితే… ఆయన అరెస్టుపై టాలీవుడ్ నుంచి కరువైన రియాక్షన్ పై జరుగుతున్న చర్చ మరో ఎత్తు అన్నట్లుగా ఉంది!
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న నేపథ్యంలో… టాలీవుడ్ జనాలు, స్టార్ హీరోలు స్పందించడం లేదనే చర్చ మొదలైంది. అయితే… చంద్రబాబు అరెస్టుకు, టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏమిటి సంబంధం, ఎందుకు స్పందించాలి అనే కామెంట్లు కూడా బలంగా వినిపిస్తున్నాయని అంటున్నారు.
ఈ సమయంలో దివంగత సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు, నిర్మాత, మహేష్ బాబు బాబాయ్ ఆదిశేషగిరిరావు రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా బాబుకు మద్దతుగా నిలిచారు. రాజమండ్రిలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని పరామర్శించిన ఆయన… అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో కొత్త తరహా రాజకీయాలు చూస్తున్నట్టు చెబుతున్న ఆదిశేషగిరి రావు… విద్వేష రాజకీయాలు మంచిది కాదని హితవు పలికారు. ఇదే సమయంలో గతంలో చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డిల పరిపాలనను తాను చూశానని… ముఖ్యమంత్రులుగా వాళ్లిద్దరి వ్యవహార శైలుల్ని తాను దగ్గరనుంచి గమనించానని అన్నారు.
ముఖ్యమంత్రులుగా వాళ్లిద్దరూ ఎప్పుడూ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడలేదని.. అయితే, జగన్ పాలనలో అలాంటివి చూస్తున్నానని అన్నారు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని నిర్మాత ఆదిశేషగిరి రావు అన్నారు. దీంతో చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన టాలీవుడ్ జనాల్లో తాజాగా ఈయన కూడా వచ్చి చేరారు.
కాగా… చంద్రబాబు అరెస్ట్ పై ఇప్పటివరకూ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాతలు నట్టికుమార్, అశ్వనీదత్, కేఎస్ రామారావు, బండ్ల గణేష్ లు స్పందించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో రాజకీయాలు వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు అంటూ నిర్మాత సురేష్ బాబు రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆదిశేషగిరి రావు.. చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడారు.