‘సూఫీయం సుజాతాయుమ్’ – కథ తక్కువ మతం ఎక్కువ!

sufiyum sujathayum

మలయాళంలో తొలి డైరెక్ట్ ఓటీటీ రిలీజుగా అమెజాన్లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సూఫీయం సుజాతాయుమ్’ మతాంతర ప్రేమ కథ. మతాంతర ప్రేమ కథలతో దక్షిణ సినిమాలు కొత్త కాదు. 1974 లో మలయాళంలో ‘చట్టకారి’ నుంచీ తమిళంలో మణిరత్నం ‘బొంబాయి’ మీదుగా, మళ్ళీ మలయాళంలో ‘అన్నయుం రసూలమ్’ వరకూ ఎన్నో వచ్చాయి. జయాపజయాలతో నిమిత్తం లేకుండా మతాంతర ప్రేమ ఒక శాశ్వత బాక్సాఫీసు ఫార్ములా అయి కూర్చుంది. ఇప్పుడు తాజాగా మరో మతాంతరం ‘సూఫీయం సుజాతాయుమ్’ (సూఫీ అండ్ సుజాత) ప్రేక్షకుల ముందు కొచ్చింది. సోకాల్డ్ లవ్ జిహాద్ సమస్య గురించి కేరళలో జరుగుతున్న రభస ఈ ప్రేమ కథకి ఓ కేంద్ర బిందువైంది. దర్శకుడు నరనిపుళ షానవాజ్ 2017 లో కుల వివక్ష మీద ‘కరి’ అనే శక్తివంతమైన సినిమా అందించిన నేపథ్యంలోంచి వచ్చి, మలి ప్రయత్నంగా ఈ మతాంతర ప్రేమని ప్రయత్నంచాడు. ఈ ప్రయత్నంలో ఎంతవరకు సఫలమయ్యాడో చూద్దాం.

కథ

కేరళ గ్రామంలో సుజాత (అదితీ రావ్ హైదరీ) అనే అగ్రవర్ణ మూగ అమ్మాయి మల్లికార్జునన్ (సిద్దీఖ్) ఏకైక కూతురు. పరికిణీ కట్టులుని సైకిలెక్కి హుషారుగా తిరుగుతూంటుంది. తల్లి కమల (కళారంజని), నానమ్మ (వల్సలా మీనన్) వుంటారు. సుజాత గ్రామంలో పిల్లలకి కథక్ నృత్యం నేర్పుతూంటుంది. సాంప్రదాయ వంశమైనా నానమ్మకి ఆధునిక భావాలుంటాయి. ‘ఈ రోజుల్లో పసుపు రాసుకోవడమేమిటి గోరింటాకు పెట్టుకో’  అని మనవరాలికీ, ‘పాత రోజుల్లో లాగా పని వాడితో వెట్టి చేయించడం మంచి పధ్ధతి కాదు’ అనీ కోడలికీ ఉద్బోధ చేస్తూంటుంది. ఇలా వుండగా ఒక రోజు సుజాత బస్సులో ప్రయాణిస్తూంటే అదే బస్సులో సూఫీ (దేవ్ మోహన్) అనే అతను వస్తూంటాడు. అతను సూఫీ సన్యాసి. అతడి జపమాల పడిపోయింది చూసుకోకుండా బస్సు దిగి వెళ్ళిపోతాడు. సుజాత దాన్ని తీసికెళ్ళి అతడికి అందిస్తుంది.

సూఫీ అబూబాకర్ ముల్లా అనే సూఫీగురువు ఇంట్లో బస చేస్తాడు. ముల్లా పిల్లల్ని కూర్చోబెట్టుకుని క్లారినెట్ వాయిస్తూంటాడు. అక్కడికి వచ్చి పోతూండే సుజాత అతడి క్లారినెట్ కి తన నాట్యాన్ని జత చేసి ఆనందిస్తూంటుంది. ఇప్పుడు సూఫీ వచ్చి బస చేయడంతో, అతణ్ణి ప్రత్యేక శ్రద్ధతో గమనిస్తూంటుంది. అతను వజూ చేసుకుని ముని వేళ్ళ మీద నడుస్తూంటే తనూ అలా ప్రయత్నించడం చేస్తుంది. ఉదయాన్నే అతను మసీదులో అజాన్ (నమాజ్ పిలుపు) ఇస్తూంటే ఆ ధ్వనికి పులకించి లయబద్ధంగా నాట్యం చేస్తూంటుంది. అతను నమాజ్ చేస్తూంటే పక్కన చేరి అనుకరిస్తుంది. పరికిణీ తీసేసి షల్వార్ కమీజ్ ధరించడం మొదలెడుతుంది. ఇలా అతడితో ప్రేమలో పడిపోతుంది. అతనూ ప్రేమిస్తాడు.

 ఈ ప్రేమ ఇంట్లో తెలిసిపోవడంతో హడావిడిగా వారం రోజుల్లో సుజాతని ఎన్నారై డాక్టర్ రాజీవ్ (జయసూర్య) కిచ్చి పెళ్లి చేసేసి దుబాయి పంపించేస్తాడు తండ్రి. ఇప్పుడేం జరిగింది? సూఫీ – సుజాతల ప్రేమ ఏమైంది? తిరిగి కలుసుకున్నారా? ఎలా?… ఇదీ మిగతా కథ.

నటీనలు- సాంకేతికాలు

sufiyum sujathayum

అదితీ రావ్ హైదరీ ఈ సున్నిత టైటిల్ పాత్రని సమున్నతంగా నటించింది. సినిమా ఎక్కువగా ఆమె మీదే వుంటుంది. మూగతనం మీద మరీ ఎక్కువ ఫోకస్ చేయకుండా, ఆ లోపంతో స్ట్రగుల్ చేయకుండా, ప్రేమ చుట్టూ పాత్రని నడపడంతో, నటిగా ఆమె నటన ఒక పోయెట్రీలా కన్పిస్తుంది. దీనికి ఆథ్యాత్మిక సంగీతమూ తోడయ్యింది. కథతో సినిమా ఆ శాజనకంగా లేకపోయినా అదితీరావ్ గ్లామర్ తో నయనానందకరంగానే వుంటుంది. క్లయిమాక్స్ లో ఆమె తీసుకునే నిర్ణయం డిస్టర్బింగ్ గా వుంటుంది.

మరో టైటిల్ పాత్ర సూఫీగా దేవ్ మోహన్ ది కూడా సున్నితమైన నటన. మాటలు తక్కువ. ప్రేమ తత్వంకన్నా సూఫీ సాంప్రదాయం, భక్తీ మరీ ఎక్కువ. పాత్ర నిడివి కూడా తక్కువే. సెకండాఫ్ కాసేపటి తర్వాత ముగిసిపోయే పాత్ర. ఈ పాత్రతో దేవ్ మోహన్ కొత్తగా పరిచయమయ్యాడు.

 ఎన్నారైగా జయసూర్యది మూగ అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఆమె భగ్న ప్రేమని మౌనంగా భరించే పాత్ర. డీసెంట్ నటన. ఇక సుజాత తండ్రిగా సిద్దీఖ్ ది ఇంకో గుర్తుండే నటన. కూతురు సూఫీతో వెళ్లి పోవడాన్ని చూసి తట్టుకోలేని సన్నివేశంలో అతడి భావోద్వేగం బలమైనది.

 నటనల తర్వాత సాంకేతిక బలం గురించి చెప్పుకోవాలి. ముఖ్యంగా సహజ సౌందర్యంతో కూడిన కళాదర్శకత్వం. ప్రకృతికి దగ్గరగా వుండే గ్రామీణ వాతావరణపు కళాదర్శకత్వంతో అచ్చమైన కేరళ నేటివిటీని ఫీలవుతాం. ఇక కెమెరా వర్క్ ఒక ఆర్టు. సూఫీ భక్తి భావపు విజువల్స్ ఇంకో లోకంలోకి తీసికెళ్తాయి. ఇక జయచంద్రన్ స్వరాలూ ఆలాపనలూ సూఫీ సాంప్రదాయంలో వుండవు. సూఫీ సంగీతమంటే ప్రధానంగా ఖవ్వాలీలు. అయితే ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ లో ఖురాన్ ఉల్లేఖనాల ఆలాపనలు, వాటికి తగిన స్వరాలే తప్ప, ఖవ్వాలీల జాడే లేదు. చిట్ట చివర్లో ఒక్క ఖవ్వాలీ వస్తుంది. అది కూడా బిట్ సాంగ్. ఇప్పుడు ఆధునిక పరికరాలతో ఫ్యూజన్ చేసిన న్యూ జనరేషన్ ఖవ్వాలీలు విన్పించి వుంటే యూత్ అప్పీల్ బాగా వుండేది.

కథా కథనాలు

sufiyum sujathayumఇస్లాం నుంచి వచ్చిందే సూఫీయిజం. ఇస్లామీయులు మతం గురించి ఆలోచిస్తే, సూఫీలు దైవం గురించి ఆలోచిస్తారు. ఆథ్యాత్మిక తత్వంతో తమలోకి తాము ప్రయాణిస్తారు. సూఫీలు తమకున్నదంతా ఇచ్చేస్తారు. ఇస్లామీయులు కొంత దానం చేస్తారు. ఇస్లామీయులు కఠిన నియమాలతో సనాతనంగా వుంటారు. సున్నీల ప్రాబల్యంగల ఇస్లాంని వహాబీ ఇస్లాంగా మార్చేసి టెర్రరిజానికి దారి తీశారు. సూఫీలు శాంతి బోధకులు. కుల మతాల్ని చూడరు. వాళ్ళ దర్గాలు అన్ని వర్గాల భక్తుల దర్శనీయ స్థలాలుగా వుంటాయి. ఇలాటి సూఫీలు సోకాల్డ్ లవ్ జిహాద్ కి పాల్పడే అవకాశమే లేదు.

అయితే ఈ సినిమా కథ సోకాల్డ్ లవ్ జిహాద్ గురించా, అసలు ప్రేమ గురించా అంటే ఏదీ కాదు. ఇదే ఈ సినిమాతో వచ్చిన సమస్య. కేరళ సోకాల్డ్ లవ్ జిహాద్ కేసులతో వార్తల్లో వుంటోంది. అవి లవ్ జిహాద్ కేసులు కావని సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వమూ తేల్చి చెప్తున్నా ప్రచారం ఆగడం లేదు. దర్శకుడు నవాజ్ ఈ మద్దతుతో లవ్ జిహాద్ కేంద్ర బిందువుగా అపోహలు తొలగించే ప్రయత్నం చేయకుండా కేవలం పైపైన తడిమి వదిలేశాడు. ఇంకోటేమిటంటే లవ్ జిహాద్ – సూఫీయిజం ఈ రెండు పరస్పర విరుద్ధ భావజాలాల్ని కథలోకి తేవడంతో ఇదేం కథో అర్ధంగాకుండా పోయింది. ఈ చర్చ కేవలం ఒక సన్నివేశానికే పరిమితం చేసి వదిలేశాడు దర్శకుడు. సుజాత తండ్రి సూఫీ ముల్లాతో అంటాడు – లవ్ జిహాద్ చేసి మొత్తం మీ మతం పేరే చెడగొడుతున్నారని. సూఫీలు లవ్ జిహాద్ చెయ్యరని ఎందుకో ముల్లా స్పష్టం చేయలేకపోతాడు. అసలు సూఫీ సన్యాసి అయిన హీరో ప్రేమలో పడడంపై అగ్రహిస్తాడు ముల్లా. నీకు పెళ్ళాం పిల్లలే కావాలనుకుంటే దానికి తగిన మార్గాలు వేరే వున్నాయని. అంటే సన్యాసిగా నువ్వు దీనికి తగవని. అలాంటిది మతాంతర ప్రేమతో లవ్ జిహాద్ ప్రసక్తే వుండదు, ముల్లాకి ఈ చర్చే అనవసరం.

ఇక ప్రేమ విషయం. ఈ కథలో దేనికీ కారణాలుండవు. సుజాత సూఫీతో ఎందుకు ప్రేమలో పడిందో, సూఫీ సుజాతతో ఎందుకు ప్రేమలో పడ్డాడో, అసలు మూగ అమ్మాయి అయిన సుజాతని పెళ్లి చేసుకున్న ఎన్నారై ఎందుకు పెళ్లి చేసుకున్నాడో కారణాలుండవు. అంతా పైపైన చేసి వదిలేసిన కథనమే, లైటర్ వీన్ ప్రేమ కథల్లాగా.

ఇక కాన్ఫ్లిక్ట్ కి స్థానమే లేదు. తగిన ప్రేమ సన్నివేశాలు లేకపోవడం ఒకటైతే, అకస్మాత్తుగా ఆమెకి పెళ్ళయి పోవడంతో ప్రేమ కథ ఆగిపోయి, పదేళ్ళు కాల గర్భంలో కలిసిపోవడంతో పుట్టిన కాన్ఫ్లిక్ట్ కాస్తా ఎగిరిపోయింది. పదేళ్ళ తర్వాత అతనుండడు, భర్తతో ఆమెకి వేరే కథ మొదలు. ఇలా కథ తెగిపోవడంతో సెకండాఫ్ సిండ్రోం లో పడి సినిమా పరమబోరుగా మారిపోయింది.

sufiyum sujathayumఇక సినిమా సాంతం ప్రేమ కాకుండా ఏకధాటిగా మతమే కన్పించడంతో, మత శ్లోకాలే విన్పించడంతో, ఆ ఆచార వ్యవహారాలే చూపించడంతో, ప్రేమ సినిమా కాక భక్తి సినిమాలా తయారయ్యింది. 2017 లో ఇంకో నవాజ్ – అంటే షానవాజ్ బావకుట్టి తీసిన ‘కిస్మత్’ లవ్ జిహాద్ మీద బలమైన వాస్తవిక కథగా వచ్చిందని రివ్యూలు వచ్చాయి. ఇది ముస్లిం అబ్బాయి – దళిత అమ్మాయి ప్రేమ కథ.  

Bottom Line – కథ తక్కువ మతం ఎక్కువ!

‘సూఫీయం సుజాతాయుమ్’ (మలయాళం)
రచన – దర్శకత్వం : నరనిపుళ షానవాజ్
తారాగణం: దేవ్ మోహన్, అడితీరావ్ హైదరీ, జయసూర్య, తదితరులు
సంగీతం : జయచంద్రన్, ఛాయాగ్రహణం : అనూ మూతేడత్
నిర్మాత : విజయ్ బాబు
2/5

―సికిందర్