కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అనేది ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. ఏ ఊరికి వెళ్లినా, ఏ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడినా ఈ మాటే వల్లించేవారు జగన్. కానీ పార్టీలో అధికారం విషయానికి వచ్చేసరికి మాత్రం సొంత సామాజిక వర్గమైన రెడ్డి సామాజిక వర్గానికే పెద్ద పీట వేస్తున్నారనే విమర్శలు మొదటి నుండి వస్తున్నాయి. వైకాపా నేతలు ఈ విషయాన్ని బాహాటంగా చెప్పకపోయినా కొన్ని నియోజకవర్గాల్లో రెడ్డి నేతల డామినేషన్ ఎక్కువగా ఉండటం, వారికి అధిష్టానం నుండి పూర్తి మద్దతు ఉండటంతో లీడర్ల నడుమ అంతరాలు బయటపడ్డాయి.
ఇక తాజాగా జిల్లాల బాద్యతలను వికేంద్రీకరిస్తూ పూర్తి అధికారాలను ప్రధానమైన ముగ్గురు రెడ్డి నేతలకే కట్టబెట్టడం చర్చనీయాంశమైంది. వైకాపా కేంద్ర పార్టీ కార్యాలయ భాద్యతలతో పాటు కర్నూల్, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల భాద్యతలను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించిన సీఎం ఉభయగోదావరి జిల్లాలు, చిత్తూరు, కృష్ణా, గుంటూరు భాద్యతలను సొంత బంధువు వైవీ సుబ్బారెడ్డికి అలాగే శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల భాద్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించారు. ఇకపై జిల్లాల రాజకీయాలన్నీ ఈ ముగ్గురు నేతల కనుసన్నల్లోనే నడవనున్నాయి.
ఇన్నాళ్ళు అన్ని రాజకీయ విషయాలను తానే స్వయంగా చూసుకుంటూ, ప్రతి నిర్ణయం తానే తీసుకుంటూ వచ్చిన సీఎం పూర్తి సమయం అక్కడే సరిపోతుండటంతో నియోజకవర్గాల వారీగా నాయకులతో సమన్వయం కాలేకపోయారు. కారణంగా కొందరు ఎమ్మెల్యేలు, లోకల్ లీడర్లు మీడియా ముందుకొచ్చి బాధలు చెప్పుకున్నారు. అది కాస్త పార్టీలోని బలహీనతల్ని బహిర్గతం చేసింది. దీంతో ఆలోచనలో పడిన సీఎం భారం తగ్గించుకోవడం కోసం జిల్లాల కీలక బాద్యతల్ని పార్టీలోని ముగ్గురు నేతలకు అప్పగించేశారు. ఇక మీదట జిల్లాల రాజకీయాలన్నీ వీరి ముగ్గురు చేతుల్లోనే ఉండనున్నాయి.
దీంతో ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతలు ఇప్పటికే జిల్లాల మీద అంతంతమాత్రంగా ఉన్న పట్టు ఇక మీదట పూర్తిగా సడలిపోతుందని ఆందోళన చెందుతున్నారట. ఈ కారణాలనే ఎత్తి చూపుతున్న ప్రతిపక్షం అభివృద్ది వికేంద్రీకరణ చేస్తామన్న ప్రభుత్వం పార్టీలోని రెడ్డి సామాజిక వర్గానికి అధికార వికేంద్రీకరణ చేసి పెట్టిందని, ఇది రెడ్లు రెడ్లు ఊళ్ళు పంచుకున్నట్టే ఉందని ఎద్దేవా చేస్తున్నారు. ప్రజలు సైతం పార్టీ కేంద్ర కార్యాలయ బాధ్యతలతో పాటు అన్ని జిల్లాల బాధ్యతలను రెడ్డి సామాజిక వర్గ నేతలకే కట్టబెట్టకపోతే వేరే సామాజిక వర్గాల్లోని నేతల్లో కనీసం ఒకరికైనా అవకాశం ఇచ్చి ఉండొచ్చు కదా అంటున్నారు.
ఇక ఇలాంటి ఆరోపణలను ఎదుర్కోవడానికి వైకాపా మొదటి నుండి వాడుకుంటున్న అంశం ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు. మొదట్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నామనే పేరుతో డిప్యూటీ సీఎంల సంఖ్యను ఐదుగురికి పెంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, పాముల పుష్ప శ్రీవాణి, ఆళ్ల నాని, నారయణస్వామి, అంజద్ బాషాలకు ఇచ్చారు. పేరుకు వీళ్లు డిప్యూటీ సీఎంలు అయినా పార్టీ వ్యవహారాల్లో, ప్రభుత్వ కీలక నిర్ణయాల్లో వీరి ప్రమేయం ఎంత మాత్రం అనేది అందరికీ తెలిసిన రహస్యమే. కనుక పేరుకే సమన్యాయం కానీ వాస్తవానికి వచ్చేసరికి వైకాపాలో రెడ్డి సామాజిక వర్గానిదే హవా అనే ప్రత్యర్థుల విమర్శలకు, ప్రజల్లోని అభిప్రాయానికి తాజాగా జిల్లాల బాధ్యతల అప్పగింత మరింత బలాన్ని చేకూర్చింది.