బతుకమ్మ పండుగ వెనుక కథ ఇదే !

బతుకమ్మ పూల పండుగ. ఆదిశక్తిని రంగురంగుల పూలతో ఆరాధించే విశిష్టమైన సంస్కృతి. శుక్రవారం ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైంది. అయితే అసలు బతుకమ్మ వెనుక ఉన్న చారిత్రకగాథ విశేషాలు ఇవే ….
క్రీ.శ.కు 973 లో తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యుల సామంతులుగా ఉండేవారు. క్రీ.శ 973లో చాళుక్య రాజైన తైలపాడు.. రాష్ట్రకూటుల చివరి రాజైన కర్కుడిని వధించి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. అతని తదనాంతరం కుమారుడు సత్యాస్రయుడు పట్టాభిషక్తుడయ్యాడు. అప్పటి వేములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరి దేవాలయముంది. ప్రజలు ఆ దేవి విశేషంగా ఆరాదించేవారు. చోళరాజులు కూడా రాజరాజేశ్వరిని విశ్వసించేవారు. చోళరాజు అయిన పరాంతక సుందర చోళుడు తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు.
వేములవాడ నుంచి తంజావూరు..


రాజరాజ చోళుడు రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని తర్వాత వచ్చిన రాజేంద్ర చోళుడు కళ్యాణి చాళుక్య రాజైన సత్యాశ్రయుడిని యుద్ధంలో ఓడించి వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలేయాన్ని కూల్చేశాడు. ఈ ఆలయంలోని ఉన్న భారీ శివలింగాన్ని రాజేంద్ర చోళుడు తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. ఆ శివలింగాన్ని 1010లో నిర్మించిన బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠాంచాడు. వేములవాడలో పార్వతిసమేతుడై ఉన్న శివుని లింగాన్ని వేరుచేసి రాజేంద్ర చోళుడు బృహదీశ్వరాలయంలో పొందుపరిచాడు. ఈ విషయం గురించి తమిళ శిలాశాసనాల్లోనూ ఉంది. వేములవాడ నుంచి శివలింగాన్ని వేరుచేసి తంజావూరులోని బృహదీశ్వరాలయంలో ప్రతిష్టించడం తెలంగాణ ప్రజలను కలిచివేసింది. బృహదమ్మ (పార్వతి) నుంచి శివుని లింగాన్ని వేరుచేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించచం మొదలు పెట్టారు. ఆ విధంగా ప్రతి ఏటా బతుకమ్మ సంబరాలను జరుపుకుంటున్నారు. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిదిరోజుల పాటు ఆటపాటలతో పూలను నీటిలో వదులుతారు. బతుకమ్మ పండుగను ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. ఈ సంబరాల వారం అంతటా బొడ్డెమ్మ (మట్టితో చేసే దుర్గాదేవిని) నిమజ్జనం చేస్తారు.