గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా నేడు గ్రాండ్ గా విడుదలైంది. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా, యువకుడిగా, తండ్రిగా మూడు విభిన్న పాత్రలలో కనిపించి మెప్పించారు. ముఖ్యంగా ఐఏఎస్ రామ్ నందన్ పాత్రను ఆవిష్కరించడంలో చరణ్ చూపిన నైపుణ్యం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆయన పాత్రకు అవసరమైన గంభీరతను అందించేందుకు ప్రత్యేకమైన హోమ్‌వర్క్ చేయడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
ఇక రామ్ నందన్ పాత్రకు కథా రచయిత కార్తీక్ సుబ్బరాజ్ ప్రముఖ ఐఏఎస్ అధికారి టీఎన్ శేషన్ జీవితాన్ని ప్రేరణగా తీసుకున్నట్లు సమాచారం. 90వ దశకంలో భారత ఎన్నికల కమిషనర్‌గా శేషన్ తీసుకున్న సంస్కరణలు, రాజకీయ అవినీతిపై కఠినమైన చర్యలు ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీ, అసభ్య పదజాలం వాడకాన్ని అడ్డుకోవడంలో శేషన్ కీలక పాత్ర పోషించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఆయన తీసుకున్న కఠిన నిర్ణయాలు, నిజాయితీ భారత రాజకీయాల్లో మంచి గుర్తింపుని తీసుకు వచ్చాయి.
శేషన్ వర్క్ ఎథిక్, తెగువను పక్కాగా ప్రతిబింబిస్తూ, శంకర్ ఈ పాత్రను రియాలిటీకి దగ్గరగా తెరకెక్కించారట. రామ్ నందన్ పాత్రలో చరణ్ చూపించిన హావభావాలు, డైలాగులు ప్రేక్షకులపై ప్రత్యేకమైన ప్రభావం చూపించాయి. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా రూపొందించబడటంతో ప్రేక్షకులు సినిమాతో మమేకం అవుతున్నారు. శేషన్‌ను ఆధారంగా తీసుకోవడం ఈ పాత్రకు మరింత జీవం పోసిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.