హిమాచల్ ప్రదేశ్‌లో ఓ చిన్న వ్యాపారికి కరెంట్ బిల్లు భారీ షాక్ ఇచ్చింది. హమీర్పూర్ జిల్లా జట్టాన్ గ్రామానికి చెందిన లలిత్ ధిమాన్‌కు సాధారణంగా నెలకు 3,000 వరకు బిల్లు వచ్చేది. అయితే ఈసారి ఆయనకు రూ.2,10,42,08,405ల భారీ బిల్లు రావడంతో అవాక్కయ్యారు. గందరగోళంతో విద్యుత్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.
తక్షణమే బిల్లు పరిశీలించిన అధికారులు ఇది సాంకేతిక లోపం కారణంగా జరిగిందని నిర్ధారించారు. అసలు బిల్లు 4,047 మాత్రమేనని వెల్లడించడంతో లలిత్ కాస్త ఊరట పొందారు. ఇలాంటి తప్పుడు బిల్లింగ్ సంఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. వీటివల్ల వినియోగదారులలో భయం నెలకొంటోంది. అత్యంత ఆశ్చర్యకరంగా, ఇటువంటి మరో ఘటన గుజరాత్‌లో జరిగింది. అక్కడ టైలర్‌గా పని చేసే అన్సారీకి రూ. 86 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది.
ఈ ఘటనలు విద్యుత్ శాఖలో తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. తప్పుడు బిల్లింగ్ వల్ల వినియోగదారులే కాదు, సంబంధిత అధికారులు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా విద్యుత్ శాఖ మరింత సమర్థవంతమైన సాంకేతిక వ్యవస్థలను అభివృద్ధి చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.