ఇప్పట్లో సోషల్ మీడియా ప్రభావం ఎంత ప్రబలంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి యూట్యూబర్ అవ్వడం సాధారణమైపోయింది. కానీ, యూట్యూబ్ ప్రభావం ఇప్పుడున్నంతగా ఉండని కాలంలో కొందరు తమ టాలెంట్‌తో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో ‘ఫన్ బకెట్’ వీడియోలతో పాపులారిటీని సంపాదించిన భాస్కర్ ఒకరు. అయితే.. లైంగిక వేధింపుల కేసులో కోర్టు అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించడం సంచలనం రేపింది.
విశాఖకు చెందిన భాస్కర్ ‘ఫన్ బకెట్’ వీడియోల్లో ప్రధాన పాత్రల్లో కనిపిస్తూ మంచి పేరు సంపాదించాడు. అతని నటన, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, ఈ విజయాన్ని ఆస్వాదిస్తుండగానే అతనిపై ఓ మైనర్ బాలిక లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం కలకలం రేపింది. బాధితురాలి కుటుంబం చేసిన ఫిర్యాదుతో విశాఖ పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ కోర్టు పరిధిలో కొనసాగింది.
కేసు దర్యాప్తులో భాగంగా భాస్కర్‌పై ఆరోపణలు నిజమని తేల్చడానికి పోలీసులు పలు కీలక ఆధారాలను కోర్టులో సమర్పించారు. అందులో భాగంగా బాధితురాలిపై భాస్కర్ చేసిన లైంగిక వేధింపులు నిర్ధారించారు. ఈ ఆధారాల ఆధారంగా కోర్టు భాస్కర్‌ను దోషిగా తేల్చింది. ఈ మేరకు అతడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.4 లక్షల పరిహారం బాధితురాలికి చెల్లించాల్సిందిగా ఆదేశించింది.
ఈ తీర్పుతో భాస్కర్ కెరీర్‌పై ప్రభావం పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు ‘ఫన్ బకెట్’ వీడియోల ద్వారా దశాబ్దానికి పైగా ప్రేక్షకుల మనసు గెలుచుకున్న భాస్కర్ ఇంతటి పరిస్థితికి రావడం అతని ఫాలోవర్స్ ను షాక్ కు గురి చేసింది. ఈ కేసు తర్వాత యూట్యూబ్ మరియు సోషల్ మీడియా ప్రభావం, అందులో నటించే వ్యక్తుల వ్యక్తిగత జీవన విధానం పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.