జూలై 27న  టిటిడి లోకల్ ఆలయాలు బంద్

చంద్రగ్రహణం కారణంగా జూలై 27వ తేదీ శుక్రవారం సాయంత్రం తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని టిటిడి స్థానికాలయాల తలుపులు మూసివేయనున్నారు. తిరిగి జూలై 28వ తేదీ శనివారం ఉదయాత్పూర్వం ఆలయాల తలుపులు తెరిచి శుద్ధి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. జూలై 27న రాత్రి 11.54 గంటల నుండి జూలై 28న ఉదయం 3 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయాలను మధ్యాహ్నం 3 గంటలకు మూసివేస్తారు. మరుసటిరోజు ఉదయం 4.30 గంటలకు ఆలయాల తలుపులు తెరుస్తారు. శుద్ధి అనంతరం ఉదయం 5 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయాలను సాయంత్రం 5 గంటలకు మూసివేస్తారు. మరుసటిరోజు ఉదయం 5 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. ఉదయం 8 గంటలకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.

చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయాన్ని మధ్యాహ్నం 3 గంటలకు మూసివేస్తారు. మరుసటిరోజు ఉదయం 4.30 గంటలకు ఆలయాల తలుపులు తెరుస్తారు. శుద్ధి అనంతరం ఉదయం 5 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయాన్ని సాయంత్రం 4.30 గంటలకు మూసివేస్తారు. మరుసటిరోజు ఉదయం 4.30 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి అనంతరం ఉదయం 6.30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.