తెలంగాణా సాహిత్య యోధుడు దాశరథి

తెలంగాణా సాహిత్య యోధుడు దాశరథి

మహాకవి దాశరథి 94వ జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్రమంతటా జరిగాయి . దాశరథి కృష్ణమా చార్య కేవలం కవి మాత్రమే కాదు , ,రచయిత , పండితుడు , స్వాతంత్ర సమర యోధుడు. తెలుగు , ఉర్దు , ఇంగ్లీష్ , సంస్కృతం లో భాషల్లో అఖండమైన ప్రఙ్ఞకలవాడు .

తెలంగాణ లో నిజాం నిరంకుశ వైఖరికి నీరసంగా కాలమెత్తి అక్షర సమరం చేసి … నిప్పులు కురిపించిన దాశరథి కవితా శరథి అనే పేరు తెచ్చుకున్నాడు . నిజామును తర తరాల బూజు అన్నందుకు ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు . అయినా దాశరథి వెరవలేదు , వెన్ను చూపించలేదు . జైల్లోనే వుంది అగ్ని ధారలను కురిపించాడు .

” ఓ నిజాము పిశాచమా కానరాడు
నిను బోలిన రాజు మాకెన్నడడేని
తీగలను తెంపి అగ్గిలోన దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ “

అంటూ దాశరథి నినదించాడు . నిజాము సర్కారుపై నిరసనలు తెలిపాడు . నిరంకుశుడైన నిజాముపై అలుపెరుగని పోరాటం చేసిన కవితా చక్రవర్తి . ఆయన నమ్మిన సిద్ధాంతాలకు జీవితంలో రాజీపడలేదు .

1948 సెప్టెంబర్ 17న తెలంగాణ రాష్ట్రము విముక్తి పొందిన తరువాత అనేక ఉద్యోగాలు చేశారు . దాశరథిలోని ప్రతిభ చూసిన అక్కినేని నాగేశ్వర రావు , ఆదుర్తి సుబ్బారావు 1961లో “ఇద్దరు మిత్రులు “చిత్రం ద్వారా సినిమా పాటల రచయితగా పరిచయం అయ్యాడు .

దాశరధి ఆ చిత్రంలో రాసిన ” ఖుషీ ఖుషీ గా నవ్వుతూ .. చలాకి మాటలు రువ్వుతూ ” పాట బహుళ ప్రేక్షకాదరణ పొందింది . ఆ తరువాత అనేక చిత్రాల్లో దాశరధి మధురమైన పాటలు రాశారు . అక్కినేని నాగేశ్వర రావు కు దాశరథి అంటే ప్రత్యేకమైన అభిమానం . దాశరథి తన కవితా గ్రంధం “గాలిబు గీతాలు ” ను అక్కినేనికి అంకితం చేశారు .

తెలుగు సినిమా రంగం హైద్రాబాద్ కు తరలి వచ్చిన తరువాత దాశరథి కూడా హైదరాబాద్ వచ్చారు . ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆయన్ని ఆస్థాన కవిగా నియమించింది . దాశరథి గారితో నాకు రెండు దశాబ్దాల పరిచయం . దాశరథి తెలుగు , ఉర్దు భాషల్లో అనర్గలంగా మాట్లాడగలడు , కవిత్వం చెప్పగలడు . కవిగా ఎంత ఎత్తుకు ఎదిగినా ఎల్లప్పుడూ ఒదిగి ఉండేవాడు . అహం ఎరుగని అసామాన్యుడు . ఎందరో యువ కవులను ప్రోత్సహించేవాడు .

అయితే దాశరధి కి తనను తాను ప్రమోట్ చేసుకోవడం తెలియదు . అందుకే కవిగా “అగ్నిధార” , “మహాంధ్రోదయం” , “రుద్రవీణ” , “మార్పు నాతీర్పు” , “ఆలోచనాలోచనాలు” , “ధ్వజమెత్తిన ప్రజ” , “కవితా పుస్తకం” ,”తిమిరంతో సమరం” లాంటి ఉత్తమోత్తమ కవితా గ్రంధాలను రాసినా , ప్రజలు ఆయన కవిత్వాన్ని అమితంగా అభిమానించిన వారికి కనీసం పద్మశ్రీ కూడా రాలేదు . చాలా సార్లు ఈ విషయాన్ని నాతో ప్రస్తావించి బాధపడేవాడు . “నాకు పనిచెయ్యడం తప్ప ,అవార్డుల కోసం కాకా పట్టడం తెలియదు ” అనేవాడు దాశరథి సుతి మెత్తని హృదయం కలవాడు . మనిషి సౌమ్యుడిగా అనిపించినా కవిగా మాత్రం కర్కశుడుగా అనిపించేవాడు .

 

1984 అక్టోబర్ 31న శ్రీమతి ఇందిరా గాంధీ తన బాడీ గార్డులు సత్వన్త్ సింగ్ , బియాంత్ సింగ్ తుపాకీ గుళ్లకు బలైపోయారు . ఈ మరణ వార్త దేశాన్ని కుదిపేసింది . అప్పుడు ఇందిరా గాంధీకి అక్షరాల్లో నివాళి అర్పించడానికి సంకల్పించాము . దాశరధి కూడా మాప్రయత్నానికి చేయూత ఇస్తానని అన్నాడు . రెండవరోజే … ఓ కవిత వ్రాసి పంపించాడు .

“రుధిర బుధ” అనే మకుటం పెట్టాడు
“భారత ధరిత్రిపై రక్త వర్షం కురిసింది
భయంకర హింసా రాక్షసి రారు తెరిసింది
అఖిల ప్రపంచ జనావళికి
అనురాగ మూర్తి నేల కూలింది
రుధిర బుధవారం
జరిగిపోయింది ఘోరం “

హైద్రాబాద్లో వున్న కవులందరితో కవితలు వ్రాయించాము . ఈ పుస్తకానికి “అమరేందిర ” అనే పేరు పెట్టాము . దీనిని అభినందన వారు ప్రచురించారు . ఈ కవితా గ్రంధములో నేను కూడా ఓ కవిత వ్రాశాను నవంబర్ 11, 1984 న “అమరేందిర ” గ్రంథావిష్కరణ హైదరాబాద్ రవీద్ర భారతిలో జరిగింది . దీనికి మహాకవి దాశరథి ముఖ్య అతిధిగా వచ్చి పుస్తకావిష్కరణ చేశారు . నిర్మాత శ్రీమతి సీతా పద్మరాజు పుస్తకాన్ని తీసుకురావడంలో సహాయం అందించారు .

భగీరథ