బోలెడు స్నేహం, మంచితనం మిగిలించి వెళ్లిపోయాడు వివేకా….

 కడప జిల్లా ఒక స్నేహ శీలిని కోల్పోయింది. వివేకా అని అంతా అప్యాయంగా పిలుచుకునే  వై ఎస్ వివేకానందరెడ్డి చనిపోయారు.  69వ వసంతంలో అడుగుపెట్టాడానికి కొద్ది రోజుల ముందే ఆయన కనుమరగయిపోయాడు.

కడప మాజీ లోక్ సభ సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి (ఏప్రిల్ 1, 1950- మార్చి 15, 2019) కడప రాజకీయాల్లో కనిపించరనే వార్త చాలా మంది కి పెద్ద లోటు.  శుక్రవారం తెల్లవారుజామున  పులివెందుల ఇంట్లో ఆయనకు గుండెపోటు వచ్చిందని, వెంటనే మృతి చెందారని సమాచారం అందింది.

సౌమ్యుడు, స్నేహశీలి,నిరాడంబరుడు అని ఆయనకు పేరుంది.  గతంలో ఉమ్మడి ఆంధ్రలో  మంత్రిగా పనిచేశారు . ఒక దఫా ఎమ్మెల్సీగా వివేకానందరెడ్డి ఎన్నికయ్యారు. 13, 14 వ లోక్ సభలలో ఎంపి గా ఉన్నారు.  ఆయన తిరుపతి శ్రీవేంకటేశ్వర అగ్రి కల్చర్ కాలేజీలో ఎజిబిఎస్ సి చదివారు. 1989,1994లలో పులివెందుల  నియోజకవర్గం  నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.  1999 లోక్ సభ ఎన్నికల్లో 90వేల మెజార్జీ తెచ్చుకుని అత్యంత ఎక్కువ మెజారిటీ పొందిన ఎంపి అయ్యారు. ఆతర్వాత 2004 ఎన్నికల్లో మెజారీటీ 1,10,000కు పెంచుకుని మరొక రికార్డు సృష్టించారు. అప్పటికదే రాష్ట్రంలో అత్యంత ఎక్కువ మెజారిటీ.

 వైఎస్‌ వివేకానందరెడ్డి మరణంతో పులివెందుల నియోజకవర్గంలోనే కాదు కడప జిల్లా అంతటా విషాదఛాయలు అలుముకున్నాయి. వైఎస్ కుటుంబంలోనే కాదు, కడప జిల్లా రాజకీయాల్లో ఇంతటి సౌమ్యుడిని మనం చూల్లేం. ఎపుడూ పిల్లలకోడిలా జనంమధ్య కనిపించే వివేకానందరెడ్డి సొంత అన్న ముఖ్యమంత్రి గా ఉన్నా మంత్రుల దగ్గరికి, ఐఎస్ ఎస్ అధికారుల దగ్గిర వినతి పత్రాలతో, పెండింగు పనులను పూర్తి చేయించుకునేందుకు అభ్యర్థనలతో వస్తూ ఆందరిని ఆశ్చర్యపరిచేవాడు. సిఎం బ్రదర్ వస్తున్నాడని అధికారులు హడావిడి చేసే వారు తప్ప ఆయన చడీ చప్పుడు లేకుండా మామాలూ విజిటర్ గా వచ్చి, వినతిపత్రం ఇచ్చి , ’తప్పకుండా చేయండి సార్,’ అని అభ్యర్థించి వెళ్లిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మంత్రుల కొడుకులు తమ్ముళ్లు, బామ్మర్దులు వాళ్ల పేర్లు చెప్పుకుని  ‘దున్నేస్తున్న’  ఈ రోజుల్లో కౌలు రైతులగా కామ్ గా వుండిన వాడాయన.

వైఎస్ బిజీ రాజకీయాల్లో ఉన్నపుడు  ఆయన తరఫున జనానికి అందుబాటులో ఉండింది వివేకాయే అని చెబుతారు. ఆయన కోపంగానో, ఎవరిమీదనో అరుస్తున్నట్లు, కరుస్తున్నట్లు వచ్చిన వార్తలు తక్కువు. కడప జిల్లా రాజకీయాల్లో ఉంటూ ఏ వివాదంలోనూ చిక్కుకోకుండా జనం మధ్య మసలుకున్న నాయకుడాయనే అనవచ్చు. మనిషి ఎపుడూ సీరియస్ గా కనిపిస్తాడు. సీరియస్ గా వ్యవహరించడం అనేది ఆయన స్వభావంలో లేనేలేదు. వైఎస్ ఎపుడూ నవ్వుతూ కనిపిస్తే, నవ్వకుండా మనసు దోచేసే వాడు వివేకా. వైఎస్ పాదరసం లా పరిగెడితే, దేనిమీద అత్రుత లేని వాడు వివేకా.

ఎంపిగా ఉన్నపుడు రోజూ పార్లమెంటు కొచ్చే వాడు. ఢిల్లీలో ఉంటూ పార్లమెంటును ఎగ్గొట్టే బాపతు కాదు. రాష్ట్రానికి చెందిన ఒక పెద్ద రాజకీయకుంటుం నుంచి వచ్చిన వాడనే దర్పం ఎపుడూ ప్రదర్శించే వాడు కాదు. పబ్లీకున అన్న పేరును ఎపుడూ వాడుకోని వాడు. వచ్చిన వాళ్లందరితో మెల్లిగా, చెవిలో ఏదో చెబుతున్నట్లు గా మాట్లాడి వూరట కల్గించి పంపడం ఆయనకు అలవాటు. రాజకీయాల్లో తన మార్కు నిలపుకునే పనులేవీ చేయకపోయినా, బోలెడు  స్నేహం, మంచితీనం మిగిలించి వెళ్లిపోయాడు వివేకా. ఈ కాలంలో అరుదయిన లక్షణాలవేగా.  వివేకా లేడన్నది పెద్ద లోటే…

రాజకీయంగా ఫెయిల్యూర్ కథ

అయితే, రాజకీయాల్లో ఆయనకు వ్యూహాలు, ఎత్తుగడలు పెద్దగా తెలియవు. అందుకే ఆయన రాజకీయాలు విఫలమయ్యాయి. రాజకీయంగా ఆయనదొక ఫెయిల్యూర్ కథ. వైఎస్ మరణించాక అన్నకుమారుడు జగన్ తో వెళ్ల లేకపోయారు. అందుకే జగన్ జరిపిన ఓదార్పు యాత్రలో కాంగ్రెస్ వెనక ఉండి నడిపిన రాజకీయాల వల్ల పాల్గొనలేదు. నాటి కాంగ్రెస్ నాయకుడి చేతిలో బందీ అయిపోయారు. 2011లో జగన్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఏర్పాటు చేసినపుడు కూడా ఆయన కొత్త పార్టీలో చేరకుండా కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. ఎత్తులు, పై ఎత్తులు తెలియవు కాబట్టే, ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతిలో దొరికి పోయారు. ఆయన మాటలు విని కాంగ్రెస్ లో ఉండిపోయారు. కాంగ్రెస్ పావుగా ఎమ్మెల్సీ కూడా అయ్యారు. కిరణ్ ఎత్తుల్లో భాగంగా మంత్రి కూడా అయ్యారు. కుటుంబ విబేధాలు కొంతవరకు దీనికి కారణమయినా, కాంగ్రెస్ వాటిని వాాడుకునేందుకు ప్రయత్నించింది. చివరకు వదిన విజయమ్మ మీద 2011 లో పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ఓడిపోయారు. అయితే, ఆయన దాదాపు 80 వేల వోట్లు వచ్చాయి. అదే ఆశ్చర్యం. ఇవన్నీ ఆయన మంచితనానికి పడిన వోట్లే.చివరకు ఆయన మళ్లీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి వచ్చిన జగన్ తో చేతులు కలిపారు. బాగా ఆలస్యంగా ఈ పని చేశారని అంటారు.