వైఎస్ వివేకా డెత్ మిస్టరీ: సీబీఐ ఏం తేల్చబోతోంది.?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ కీలకమైన ముందడుగు వేసిందనే ప్రచారం జరుగుతోంది. పులివెందులకు చెందిన సునీల్ యాదవ్ అనే వ్యక్తిని గోవాలో అరెస్ట్ చేసిన సీబీఐ, కోర్టులో హాజరు పరిచింది, కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారణ మరింత వేగవంతం చేసింది. సునీల్ యాదవ్ ఇచ్చిన సమాచారంతో, ఇప్పుడు ఆయుధాల వేట కొనసాగుతోందట. ఓ చెరువులో ఆయుధాల్ని పడేశారన్న సమారారంతో, ఆ చెరువులో ఆయుధాల కోసం వెతుకులాట మొదలైంది. నిన్న సాయంత్రం వరకు గాలించిన సీబీఐ, నేడు మరోమారు ఆ ప్రక్రియ చేపట్టనుంది. ఆయుధాలు దొరికితే, ఈ కేసులో అదో పెద్ద మలుపు అవుతుంది. వైఎస్ వివేకానందరెడ్డిని ఆయన ఇంట్లో అత్యంత కిరాతకంగా చంపేశారు. అయితే, గుండెపోటుతో చనిపోయినట్లుగా తొలుత బంధువులు ప్రచారం చేయడం పలు అనుమానాలకు తావిచ్చింది.

అసలు వైఎస్ వివేకానందరెడ్డిని చంపాల్సిన అవసరం ఎవరికి వుంది.? అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. సరిగ్గా ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరగడంతో, దీన్ని రాజకీయ హత్యగానే భావిస్తున్నారంతా. అలా 2019 ఎన్నికల్లో వైసీపీకి రాజకీయ లబ్ది చేకూరింది కూడా. టీడీపీనే ఈ హత్య చేయించిందని అప్పట్లో వైసీపీ, రాష్ట్ర ప్రజల్ని నమ్మించగలిగింది. రాష్ట్ర ప్రభుత్వం కేసు విచారణ చేపట్టినా, ఫలితం లేకుండా పోయింది. సీబీఐ కూడా చాన్నాళ్ళుగా ఈ కేసుని విచారిస్తూనే వుంది. సునీల్ యాదవ్ అరెస్టుతో కేసు కీలక మలుపు తిరిగినట్లయ్యింది. అయితే, ఇంకెన్నాళ్ళు ఈ కేసు సాగతీతకు గురవుతుంది.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. స్వయానా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాబాయ్ అయిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఎప్పటికి ఓ కొలిక్కి వచ్చేనో ఏమో.