వివేకా డెత్ మిస్టరీలో చీకటి కోణం వీడేదెప్పుడు.?

మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి కీలక నిందితుడు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలాన్నీ సీబీఐ కోర్టు ముందుంచిన విషయం విదితమే. అదిప్పుడు బహిర్గతమైంది. న్యాయమూర్తులకు ఆ వాంగ్మూలం వివరాలు అందాయి. దాంతో, మళ్ళీ ఇంకోసారి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు చుట్టూ పొలిటికల్ రచ్చ మొదలైంది.

వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారు.? అన్నదానిపై దస్తగిరి వాంగ్మూలంలో అన్ని వివరాలూ వున్నాయి. దస్తగిరితోపాటు గంగిరెడ్డి, సునీల్ యాదవ్.. ఇలా పలు పేర్లు తెరపైకొచ్చాయి. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు కూడా ప్రస్తావనకు రావడం గమనార్హం. అంతేనా, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేరు కూడా ఈ వాంగ్మూలంలో ప్రస్తావనకు వచ్చినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి.

అయితే, వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు ఎందుకు చంపారన్నదానిపై ఇప్పటికీ భిన్న వాదనలు వినిపిస్తూనే వున్నాయంటే, అది వ్యవస్థల వైఫల్యంగానే చెప్పుకోవచ్చు. ఎంపీగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా పని చేసిన నాయకుడు అత్యంత దారుణ హత్యకు గురై ఏళ్ళు గడుస్తున్నా, దోషులు దొరక్కపోవడం శోచనీయమే.

దేశంలో ఎన్నో వందల వేల లక్షల కేసుల్ని చాలా తేలిగ్గా పరిష్కరించే పోలీస్, సీబీఐ వంటి వ్యవస్థలు, వివేకానందరెడ్డి హత్య కేసుకి సంబంధించిన మిస్టరీని ఛేదించలేకపోవడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?

కేవలం ఈ హత్య కేసు విచారణ అలా అలా సాగడానికి అసలు కారణం బహుశా రాజకీయమే అవ్వొచ్చు. రాజకీయ కారణాలతో ఇలాంటి కేసుల విచారణ సాగతీతకు గురైతే, వ్యవస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిపోతుంది. 60 కోట్ల లావాదేవీలు ఓ ప్రముఖ నాయకుడి హత్యకు కారణమైతే, ఆ లావాదేవీలేంటన్నది ఇప్పటిదాకా ఎందుకు బయటకు రాలేదో ఏమో.!

గొడ్డలి పోటు ఎందుకు గుండె పోటుగా ప్రొజెక్షన్ జరిగిందన్నదానిపైనే ఇప్పటికీ మిస్టరీ వీడలేదంటే, అసలు దోషులు ఎప్పటికైనా బోనులో నిల్చుంటారని ఎలా ఆశించగలం.?