Ys Viveka : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇది నిజంగానే చాలా కీలకమైన ట్విస్టుగా చెప్పుకోవాల్సి వుంటుంది. వైఎస్ వివేకానందరెడ్డి రెండో పెళ్ళి చేసుకున్నారనీ, ఆ రెండో పెళ్ళి కారణంగానే ఆయన హత్యకు గురయ్యారనీ కొత్త వాదన తెరపైకొచ్చింది. ఈ మేరకు వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివశంకర్ రెడ్డి తరఫున ఆయన భార్య తులసమ్మ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారుట.
నిజమేనా.? అసలు వైఎస్ వివేకానందరెడ్డి (Ys Viveka) రెండో పెళ్ళి ఎందుకు చేసుకున్నారు.? రెండో పెళ్ళి చేసుకుంటే, రాజకీయాల్లో యాక్టివ్‌గా వున్న వైఎస్ వివేకానందరెడ్డి, ఆ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు.? అన్న ప్రశ్నలు సహజంగానే తెరపైకొస్తాయి.
గతంలో వైఎస్ వివేకా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పని చేసిన విషయం విదితమే. అప్పుడు కూడా వైఎస్ వివేకా రెండో పెళ్ళి వ్యవహారం తెరపైకి రాలేదంటే, కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది.
వివేకా రెండో పెళ్ళి నేపథ్యంలో ఆయన మొదటి భార్య హైద్రాబాద్‌లోని తన కుమార్తె సునీతా రెడ్డి దగ్గరకు వెళ్ళిపోయారన్న వాదన వినిపిస్తోంది. రెండో పెళ్ళి వ్యవహారం కారణంగానే ఆస్తి తగాదాలు పుట్టుకొచ్చాయనీ, సునీతారెడ్డి భర్త నరెడ్డి రాజశేఖర్ రెడ్డి.. హత్య కుట్రలో భాగస్వామి అనీ.. ఆరోపణలు వస్తున్నాయి.
అయితే, ఇందులో నిజమెంత.? అన్నది తేలాల్సి వుంది. సిట్ సజావుగా విచారణ చేస్తోంటే, దాన్ని తప్పుదోవ పట్టించేందుకు వైఎస్ వివేకా సతీమణి, కుమార్తె.. సీబీఐ కోర్టును ఆశ్రయించారని వైసీపీ ఆరోపిస్తుండడం మరో ఆసక్తికరమైన అంశం.