తనను వాడుకొని వదిలేశాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాళి ఆందోళన

తనను శారీరకంగా వాడుకుని తీరా పెళ్లి చేసుకొమ్మంటే తప్పించుకు తిరుగుతున్న ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు దీక్షకు దిగింది. తాము ఏడేళ్లుగా ప్రేమించుకున్నామని గత సంవత్సరం నుంచి ఒకే గదిలో ఉంటూ సహజీవనం చేస్తున్నామని బాధితురాలు తెలిపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తీరా పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేస్తున్నాడని ఆ యువతి వాపోయింది. అసలు వివరాలు ఏంటంటే…

వరంగల్ జిల్లా  ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన శ్రీపతి శ్వేతకు ఇంటర్‌ చదివే రోజుల్లో అదే మండలానికి చెందిన సట్ల సుధీర్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శ్వేత హైదరాబాద్‌లోని ఓ బ్యూటీషియన్‌ సంస్థలో పని చేస్తోంది. సుధీర్‌ హెచ్‌డీఎఫ్‌సీలో ఉద్యోగం చేస్తున్నాడు.

వీరిద్దరు కూడా హైదరాబాద్ లో ఉండడంతో నిత్యం కలుసుకునేవారు. గత సంవత్సరం సుధీర్ ఇక వేరు వేరుగా ఎందుకు ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా మనమిద్దరం భార్య భర్తలమని చెప్పి రూం కిరాయి తీసుకొని అక్కడే ఉందామని చెప్పాడు. దీనికి ఒప్పుకున్న శ్వేత ఇంటి ఓనర్ తో తామిద్దరం భార్య భర్తలమని చెప్పి రూం తీసుకున్నారు. వీరిద్దరు సంవత్సరం నుంచి ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు.

సుధీర్ ఇంటి ముందు ధర్నా చేస్తున్న శ్వేత

శ్వేత నమ్మకం కోల్పోకుండా ఆ రూంలోనే ఆమె మెడలో తాళి కట్టాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా శ్వేత తల్లిదండ్రులకు తెలిసింది. దీని పై శ్వేతని నిలదీయగా అసలు నిజం చెప్పింది. దీనిని పెద్ద మనుషుల సమక్షంలో పెట్టగా ఇరు కుటుంబాలు సభ్యులు వారికి పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నారు. మంచి ముహుర్తం చూసి వారికి పెళ్లి చేయాలని వారు అనుకున్నారు. 

ఇంతలో వారిద్దరు వచ్చి హైదరాబాద్ రూంలో ఉన్నారు. ఈ క్రమంలో తాను ఇంట్లో లేని సమయలో ఎవరో యువకుడు వచ్చి వెళ్లాడంటూ సుధీర్ శ్వేతను అనుమానించాడు. ఆమెతో గొడవపడ్డాడు. అప్పటి నుంచి తనని పెళ్లి చేసుకోనంటూ తప్పించుకు తిరుగుతున్నాడని శ్వేత ఆరోపించింది. ఇదే విషయమై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదని పెద్ద మనుషులకు చెప్పినా వారు కూడా పట్టించుకోలేదని శ్వేత వాపోయింది.

తనను శారీరకంగా వాడుకోని పెళ్లి చేసుకునే ఆలోచన లేక సుధీర్ తప్పించుకుంటున్నాడని శ్వేత భోరున విలపించింది. తనకు సుధీర్ తో వివాహం జరిపించి న్యాయం చేయాలని వేడుకొంది. శ్వేత మౌన పోరాటానికి మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి.

ఇదిలా ఉండగా సుధీర్‌ తండ్రి మల్లయ్య తనను ఓ విలేకరి రూ. 5లక్షలు ఇస్తే సముదాయిస్తానని, లేకుంటే ఇంటి ముందు బైఠాయిస్తుందని చెప్పాడని, తాను డబ్బులు ఇవ్వకపోవడంతో అనుకున్న ప్రకారం ఇలా జరిగిందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది కావాలనే చేస్తున్నారని శ్వేత ఆరోపిస్తుంది. శ్వేత ఆందోళనతో న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చినా కూడా శ్వేత ఆందోళనను విరమించలేదు.