శ్రీభాగ్ వప్పందం అంటే ఏమిటి (స్పెషల్ స్టోరీ)

(యనమల నాగిరెడ్డి)

నవంబర్ 16న విజయవాడలో  “శ్రీ భాగ్ ఒప్పందం” అమలు కోసం సీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక సత్యాగ్రహం జరుగుతున్న సందర్భంగా  ప్రత్యేకం.

నిరంతరం కరువు కాటకాలతో అలమటిస్తూ,చుక్క నీటి కోసం ఆకాశం వైపు ఆశతోనూ, తమ కడగండ్లు తీరుస్తారనే నమ్మకంతో   పాలకులు, ప్రతిపక్షము , ఇతర రాజకీయపార్టీల వైపు నమ్మకంతోనూ  ఎదురుచూస్తూన్నరాయలసీమ ప్రజానీకం అటు ప్రకృతి చేతిలోనూ,ఇటు నాయకుల చేతిలోను  గత వంద సంవత్సరాలుగా మోసపోతూనే ఉన్నారు. అతివృష్టి, అనావృష్టి, అసలు వర్షాలు కురిపించకుండానే ప్రకృతి వేధిస్తున్నది. తమ స్వప్రయోజనాలే పరమావధిగా పాలకులు ఈ సీమపై  సవతి ప్రేమ చూపిస్తూ అన్ని రంగాలలో అణగదొక్కి చివరకు తాగు నీటికి కూడా కటకట లాడే పరిస్థితి కల్పించారు.

ఈ దశలో ప్రజలు చైతన్యవంతులై ఉద్యమిస్తే తప్ప రాయలసీమ కష్టాలు తీరవని గుర్తించిన కొందరు యువకులు నంద్యాలకు చెందిన బొజ్జా దశరధ రామి రెడ్డి స్థాపించిన రాయలసీమ సాగునీటి సాధన సమితి స్ఫూర్తిగా ఏర్పడిన  సీమ ప్రజా సంఘాల సమన్వయ వేదికను ఏర్పాటు చేశారు. వీరి ఆధ్వర్యంలోగత నాలుగు సంవత్సరాల కాలంలో అనేక ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వీరి ఆవేదన చెవిటి ముందు శంఖం ఊదినట్లుంది తప్ప ఏ నాయకుడికి చీమ కుట్టినట్లు కూడా లేదు. పాలక, ప్రతిపక్ష పార్టీలు, ఇతర బడా రాజకీయ పార్టీలు రాయలసీమకు అన్యాయం జరిగిందని సన్నాయి నొక్కులు నొక్కడం తప్ప చేసిందేమి లేదు. కనీసం రాష్ట్రం నది బొడ్డునుండి అరిస్తే వారికి వినిపిస్తుందనే ఆశతో ఉద్యమకారులు విజయవాడలో సత్యాగ్రహం చేపట్టారు.

ఈ నేపథ్యంలో 1953లో ఆంద్ర రాష్ట్ర అవతరణకు ప్రాతిపదికగా నిలచిన  “శ్రీ భాగ్” ఒప్పందాన్ని అమలు చేయాలని వారు కోరుతున్నారు. 1936 నవంబర్ 16న కోస్తాఆంధ్ర, రాయలసీమకు చెందిన పెద్దమనుషుల మధ్య కుదిరిన “శ్రీ భాగ్” ఒప్పందాన్నిఇప్పటికైనా అమలు చేయాలని, రాయలసీమలో ప్రజలు బ్రతకడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ, రాయలసీమ వాణిని  రాజధాని కేంద్రంగా ప్రపంచానికి చాటి చెప్పడానికి రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక నవంబర్ 16న విజయవాడ ధర్నా చౌక్ లో ఒక్క రోజు సత్యాగ్రహం నిర్వహించనున్నారు. (ఆఫ్ కోర్స్ చంద్రబాబు గారు, ఆయన ప్రజాస్వామ్య ప్రభుత్వం దయపెడితేనే సుమా).

రాయలసీమ — కోస్తాఆంధ్ర  వైరుధ్యం

ఒక్క మాటలో చెప్పాలంటే కోస్తాంద్ర, రాయాలసీమ ప్రాంతాల మధ్య ఉన్న సంబంధం గత అనేక దశాబ్దాలుగా “పిల్లి-ఎలుక” సంసారంగానే ఉంది. సాగునీటి వసతి ఇతోధికంగా లభించడంతో ఆర్థికంగా, సామాజికంగా,విద్య, వైద్య,పారిశ్రామిక,సాంస్కృతిక రంగాలలో అభివృద్ధి చెందిన కోస్తా ప్రాంతానికి, నిత్యం కరువు కాటకాలతో అలమటిస్తూ, పాలెగాళ్ళ పాలనలో జీవశ్చావాల్ల బ్రతుకులీడ్చి, ప్రస్తుతం ప్రజాస్వామ్యం ముసుగులో మరో రకం పాలెగాళ్ళ చేతిలో నలుగుతూ,  అతి కష్టం మీద జీవనం సాగిస్తున్న రాయలసీమ జిల్లాల ప్రజలకు గత వంద సంవత్సరాలుగా అనేక రకాల వైరుధ్యం కొనసాగుతుంది.

కోస్తా నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం చేస్తున్న సమయంలో  రాయలసీమ ప్రాంతవాసులు మద్రాస్ రాష్ట్రంలోనే తమ ప్రాంత ప్రయోజనాలు పరిరక్షింపబడగలవని అభిప్రాయపడ్డారు. అలాగే మద్రాస్ రాష్ట్రంలో కొనసాగడానికే మొగ్గు చూపారు కూడా. కోస్థా ఆంధ్ర ప్రాంత నాయకులు మొదట హామీలు ఇవ్వడం, ఆ తర్వాత కాలంలో స్వప్రయోజనాల కోసం  ఆ హామీలను తుంగలో తొక్కి రాయలసీమ అవసరాలను తాకట్టు పెట్టడం సర్వసాధారణంగా మారిందని అందువల్ల రాయలసీమ వాసులు కోస్తా నాయకులకు దూరంగా ఉండడమే మంచిదనే అభిప్రాయం సీమ నాయకుల్లో బలంగా ఉండేది. కోస్తా నాయకులతో వేగలేమని, వారి ప్రయోజనాలకోసం రాయలసీమను బలిపెట్టగలరని సీమ నాయకులు అభిప్రాయపడ్డారు. 1937లో నంద్యాలలో జరిగిన జరిగిన బహిరంగ సభలో అప్పటి సీమ పెద్దకాపు నీలం సంజీవ రెడ్డి ఈ అంశాన్ని విస్పష్టంగా ప్రకటించారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రమే మంచిదని కూడా అప్పటి నాయకులు అభిప్రాయ పడ్డారు.

 రాయలసీమ మద్దతు లేకపోతె తెలుగు రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదని నమ్మిన కోస్తా నాయకులు  ఈ రేండు ప్రాంతాల మధ్య సయోధ్య కుదర్చడానికి 1936లోనే “సౌహార్ధ్రసంఘం’’ (goodwill committee)” పేరుతొ ఒక కమిటీని, సమన్వయం కోసం మరో  ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఏ రెండు ప్రాంతాల సాహచర్యం అలాగే “అనుమానాల కాపురం” గానే సాగుతున్నది.

ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం

ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో  ఉన్న తెలుగు మాట్లాడే ప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని కోస్తా ఆంధ్ర నాయకులు ఉద్యమాలు 19 శతాబ్దం మొదట్లో ప్రారంభించారు. తమిళ నేతల ఆధిపత్యం భరించలేక పోవడం, తమకు తగిన గౌరవం లభించడం లేదని, ఇదే ధోరణి కొనసాగితే తమ అస్తిత్వం ఉండదని కోస్తా నాయకులు భావించారు. 1913లో ఆంధ్ర రాష్ట్ర దీక్షను బాపట్లలో ప్రారంభించారు. 13 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత 1926లో ప్రత్యేక యూనివర్సిటీని మద్రాస్ ప్రభుత్వం మంజూరు చేసింది.  ఈ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఈ ప్రాంత నాయకులు బెజవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్టణం ప్రాంతాలను చుట్టి చివరకు అనంతపురం జిల్లాను ఎంపిక చేశారు. యూనివర్సిటీని అనంతపురంలో ఏర్పాటుచేయడానికి ఆంధ్ర యూనివర్సిటీ సెనేట్,ఆంధ్ర మహాసభ, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ లు ఆమోదించాయి. ఐతే ముందుగా ఇందుకు అంగీకరించిన కోస్తా నాయకులు ఆచరణలో ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ శాసనసభలో ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఓట్లు వేశారు.

అప్పటి నుండి రాయలసీమ వాసులు 18 సంవత్సరాల పాటు ఆంధ్ర ఉద్యమంలో పాలుపంచుకోలేదు. 1937లో కడప కోటి రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర మహాసభలో పప్పూరి రామాచార్యులు కోస్తా సీమ ప్రాంత ప్రజల మధ్య ఉన్న వైరుధ్యాల గురించి వివరించడం జరిగింది. ఇందుకు ఫలితంగా మహాసభ మొసలికంటితిరుమలరావు అధ్యక్షుడుగా, పోపూరి రామాచార్యులు,తాడిపత్రి వెంకట రమణాచార్యులు, ప్రొద్దటూరి ఏ.కె.ముని, వావిలాల గోపాలకృష్ణ, కడప కోటి రెడ్డి సభ్యులుగా  “సౌహార్ద్రసంఘం (good will committee)” ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుత్వానికి, ఈ రెండు ప్రాంతాలకు సమన్వయం కోసం మరో ఉపసంఘం ఏర్పాటైంది. ఈ కమిటీ బరంపురం నుండి బళ్ళారి వరకు పర్యటించి అనేక అంశాలను అధ్యయనం చేసింది. చివరకు రెండు ప్రాంతాల నాయకుల మధ్య ఒక ఒప్పందం “శ్రీ భాగ్ ఒడంబడిక” పేరుతొ ఒక అంగీకారం కుదిరింది.

రాయల సీమ సత్యాగ్రహం గోడ పత్రిక ఆవిష్కరిస్తున్న మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి

శ్రీభాగ్ ఒప్పందం

ఈ నేపథ్యంలో రెండు ప్రాంతాల మధ్య సయోధ్యకుదర్చడానికి ఏర్పాటైన కమిటీ 1936 నవంబర్ 11న మద్రాస్ లోని దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు  స్వగృహం (శ్రీభాగ్)లో సమావేశమై ఒక అంగీకారానికి వచ్చింది. ఈ ఒప్పందం మేరకు

  1. ఆంధ్రులలో సంస్కృతి, సాంఘీక ఐకమత్యం పెంపొందించుటకు గానూ, వైజ్ఞానిక కేంద్రములను ఆంధ్రదేశమునంతటికి ఉపయోగించుటకు ఆంద్ర విశ్వవిద్యాలయం వాల్తేరులోనూ, అనంతపురం కేంద్రంగా అభివృద్ధి పరచాలని,ఇతర కళాశాలలను తత్సంబంధమగు విషయ పరిజ్ఞానమును కనుకూలమగుచోట్ల నెలకొల్పవలసినదనియూ కమిటీ అభిప్రాయపడింది.

  2. రాయలసీమ, నెల్లూరు జిల్లాలలో ఆర్థిక అభివృద్ధి కోస్తా జిల్లాలతో సమానంగా కలుగు నిమిత్తమై, పదేళ్ల వరకూ, అవసరమగుచో అంతకంటే ఎక్కువ కాలము నీటి పారుదల స్కీములకు ముఖ్యంగా “తుంగభద్ర ,కృష్ణ, పినాకిని నదుల” నీటిని గురించి, వానికి పైన పేర్కొనబడిన జిల్లాలమేలు నిమిత్తం ప్రాధాన్యమివ్వ వల్సినదనియు,మేజరు ప్రాజెక్టుల విషయమున కూడా పదేండ్ల కాలము ఈ జిల్లాల అభివృద్ధి కొరకే ప్రభుత్వ ద్రుష్టి కేంద్రీకరింప బడవలయుననియూ, ఎప్పుడైనను పై నదుల నీటి పంపకం విషయమైన సమస్య కలిగినపుడు, మీద పేర్కొనబడిన జిల్లాల అవసరమును మొదట తీర్చవలయుననియూ, ఈ విధానం నీటి నుండియే ప్రభుత్వం అమలుకు ప్రయత్నించవలెననియూ కమిటీ వారు తీర్మానించుచున్నారు.   

  3. జిల్లా కింతమందని సమాన సంఖ్యగల ప్రాతినిధ్యం “శాసనసభలో’ నుండవలెనని ఈ కమిటీ వారంగీకరించుచున్నారు.  

  4. విశ్వ విద్యాలయము, హైకోర్టు, ముఖ్యపట్టణము, ఈ మూడును ఒక్క చోటనే చేర్చి ఒక్క ప్రదేశమునకే ప్రాముఖ్యతనిచ్చుట కంటె వేరు, వేరు ప్రాంతములలో నుండుట బాగని ఈ కమిటీ వారు తలచుచున్నారు. కావున విశ్వవిద్యాలయము ఉన్నచోటనే ఉండవచ్చునని,హైకోర్టు,ముఖ్యనగరములను కోస్తా జిల్లాలలోనూ, రాయలసీమలోనూ ఉచిత ప్రదేశములలో నుండవలెననియూ,ఇందులో ఏది కావాలనో రాయలసీమ వారే కోరుకొనవలెననియూ ఈ కమిటీ అభిప్రాయము. పై ఒడంబడికలోని షరతులుఉభయపక్షాలవారి అంగీకారంతో మార్చబడవచ్చును.

ఈ ఒడంబడిక పత్రంలో రెండు ప్రాంతాల నుండి సభ్యులుగా ఉన్న 1) కడప కోటిరెడ్డి 2) కల్లూరు సుబ్బారావు, 3) సి.సుబ్బరామిరెడ్డి, 4) హెచ్. సీతారామిరెడ్డి 5) పట్టాభిసీతారామయ్య,6) కొండా వెంకటప్ప, 7) పప్పూరి రామాచార్యులు 8) ఆర్. వెంకటప్పనాయుడు గార్లు సంతకాలు చేశారు.  ఈ ఒడంబడికను ఆంధ్ర మహాసభ ఆమోదంతో మద్రాస్ ప్రభుత్వానికి పంపారు.

 

రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక  సత్యాగ్రహం

ఆ తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు తర్వాత, సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ లోను,   2014లో జరిగిన రాష్ట్ర విభజన తర్వాత 1953 నాటి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటికీ “యధావిధిగా రాయలసీమకు సరిదిద్దలేని ద్రోహం” జరుగుతూనే ఉంది.  అయితే 1953 నుండి నేటి వరకు ఈ ద్రోహం మొత్తం రాయలసీమ నేతల నాయకత్వంలోనే జరగడం విశేషం.

 

ఈ నేపథ్యంలో రాయలసీమకు  జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి, ఈ అన్యాయాలను ఇప్పటికైనా సరిదిద్దాలని ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలకు కోరడానికి రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక  శ్రీభాగ్ ఒడంబడిక పుట్టిన నవంబర్ 16న విజయవాడలో ఒక్క రోజు సత్యాగ్రహం చేయాలని సంకల్పించింది. ఇందుకోసం వేదిక కన్వీనర్ బొజ్జ దశరథరామిరెడ్డి గత నాలుగు నెలలుగా రాయలసీమ నాలుగు జిల్లాలలో పర్యటించారు.  ప్రత్యేకించి కర్నూల్ జిల్లాలో ఆయన సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలను,ప్రత్యేకించి రైతులను చైతన్య పరచడానికి కృషి చేశారు. దశరథరామి రెడ్డి నాయకత్వంలో రాయలసీమ నాలుగు జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో సీమ వాసులు ఈ నెల 15 నుండి విజయవాడకు తరలి వెళ్లనున్నారు.

సీమ గళం వినిపించడానికి రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక చేస్తున్న ప్రయత్నాలను “ప్రభుత్వం తనదైన శైలిలో ప్రజాస్వామ్యబద్ధంగా” అడ్డుకుంటుందా?  లేక అనుమతిస్తుందా? అన్నప్రశ్నకు జవాబు ఈ నెల 16న దొరుకుతుంది.

 

(ఫీచర్ ఫోటో శ్రీ భాగ్ భవనం చెన్నై)