వారెవ్వా… ఈ యువతి మామూలు అమ్మాయి కాదు

జీవనయానంలో కష్టాలనే ముళ్లను… ఒడుపుగా ఏరిపారేసే నైపుణ్యం ఉన్నవారే ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అయిన అబ్ధుల్ కలాం వంటి మహనీయులు ఈ విషయాన్ని స్పష్టంగా నిరూపించారు. అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని చాలా మంది తమ జీవితాలను తీర్చిదిద్దుకుంటున్నారు. సరిగ్గా అటువంటి విధానంతోనే తన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటుంది కేరళకు చెందిన హనన్ హమీద్ అనే పందొమ్మిదేళ్ల విద్యార్ధిని. హనన్ స్వస్థలం త్రిస్సూర్ జిలా మాధవన ప్రాంతం. తన కుటుంబంలోని ఆర్థిక పరిస్థితిని ఒడిదుడుకులను అధిగమించేందుకు ఆమె అనేక రకాలుగా శ్రమిస్తోంది. తన కలల సాకారం కోసం నిరంతరం పోరాడుతుంది. ఇది గిట్టని కొందరు పోకిరిగాళ్లు ఆమెను ఎగతాళి చేస్తూ బెదిరిస్తున్నారు. 

   

          విద్యార్థిని  హనన్ హమీద్           

విద్యార్దిని హనన్ హమీద్ తోడుపుళలో అల్ అజర్ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. చదువుతూనే తన కుటుంబ పరిస్థితి బాగుకోసం హనన్ రేడియో ప్రోగ్రాములు చేయడం, ఈవెంట్ మేనేజ్ మెంటు, చేపలు అమ్మడం వంటి పనులన్నీ చేస్తుంది.  హనన్ ఉదయం మూడు గంటలకు నిద్ర లేచి ఒక గంట పాటు చదువుకొని ఆ తర్వాత సైకిల్ పై మార్కెట్ కు వెళ్లి చేపలను కొనుగోలు చేసి తీసుకొస్తుంది. వాటిని తెలిసిన వారి ఇంట్లో ఫ్రిజ్ లో ఉంచుతుంది. ఆ తర్వాత తను కాలేజికి వెళ్తుంది. హనన్ ఇంటికి కాలేజికి 60 కిలోమీటర్ల దూరం. కాలేజికి రోజూ సైకిల్ పై వెళ్లి వస్తుంది. అంటే రోజూ 120 కిలోమీటర్లు సైకిల్ పైనే హనన్ ప్రయాణిస్తుంది. కళాశాల నుంచి తిరిగొచ్చాక సాయంత్రం సమయంలో మార్కెట్ దగ్గర చేపలు అమ్ముతుంది. హనన్ గురించి తెలుసుకున్న  ఓ పత్రికి ఈ కథనాన్ని ప్రచురించింది. దీంతో హనన్ వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ఇటీవల హనన్ చేతికి ఉంగరాలు, ఆధునిక శైలిలో దుస్తులు ధరించి, తల దువ్వుకుని చేపలు అమ్మింది. ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ అయింది. అంతే మతఛాందసులు, పోకిరి గాళ్లు సామాజిక మాధ్యమాల్లో తెగరెచ్చిపోయి విమర్శలు చేస్తున్నారు. ఆమె బురఖా ధరించటం లేదని ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఎన్ పీఐ సభ్యులు ఆమెను బెదిరించినట్టుగా తెలుస్తోంది.

        పోెలీసుల రక్షణలో హనన్ హమీద్

ఈ విషయం తెలుసుకున్న కేరళ సీఎం పినరయి విజయన్  హనన్ కు హ్యాట్సాఫ్ చెప్పారు. యావత్తు కేరళ ఆమెకు మద్దతుగా నిలుస్తుందని, ఆమెకు రక్షణ కల్పించాలని కలెక్టర్ ను ఆదేశించారు. సీఎం విజయన్ హనన్ కు మద్దతుగా ఫేసుబుక్ లో పోస్టు చేశారు.  ఓ విద్యార్థి తన కాళ్లపై తాను నిలబడటం ఎంతో గర్వించదగ్గ విషయం. తను సంపాదించిన సొమ్ము తన చదువుకోసం ఖర్చు చేయడం ఎంతో సంతృప్తి. జీవితంలో అలాంటి అనుభవాలను పొందిన వారు మాత్రమే దీనిని అర్ధం చేసుకుంటారు అని ఆయన పోస్టు  చేశారు. హనన్ గురించి తెలుసుకున్న మలయాళ డైరెక్టర్ అరుణ్  గోపి… త్వరలో తాను తీయనున్న సినిమాలో హనన్ కు ఓ పాత్ర ఇవ్వనున్నట్టు తెలిపారు. తనపై వస్తున్న విమర్శలకు హనన్ స్పందించారు. నా బతుకు దెరువు కోసం నేను చేపలు అమ్ముతున్నాను. నా బతుకు నన్ను బతకనివ్వండని హనన్ మీడియాకు తెలిపింది. హనన్ గురించి దేశ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. శభాష్… హనన్ అంటూ ఆమెను పలువురు అభినందిస్తున్నారు.