నేడు తెలంగాణ కేభినేట్ భేటి

ఆగష్టు 15 న మూడు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టనుండడంతో వాటిపై చర్చించేందుకు శుక్రవారం మద్యాహ్నం మూడు గంటలకు తెలంగాణ కేభినేట్ భేటి కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరగనుంది. మిషన్ భగీరథ, కంటికి వెలుగు, రైతు భీమా ఈ మూడు పథకాలను ఆగష్టు 15న సీఎం ప్రారంభించనున్నారు. మూడు ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు ఒకే ముహూర్తం కావడంతో సీఎం మంత్రులకు పలు సూచనలు చేయనున్నారు. అదే విధంగా పంచాయతీల గడువు ముగియడంతో ప్రత్యేకాధికారుల నియమాకం, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు కూడా చర్చకు రానుంది. అదే విధంగా 9200 పంచాయతీ కార్యదర్శుల నియమాకం, దానికి సంబంధించిన మార్గదర్శకాలు, లక్ష ఉద్యోగాల హామీలో ఇప్పటివరకు జరిపిన నియమాకాలకు సంబంధించి చర్చించనున్నారు.

మిషన్ భగీరథ పనులను ఆగష్టు 14 అర్ధరాత్రి వరకు ముగించి 15 నాడు ఎట్టి పరిస్థితిలోనూ నీళ్లు ఇవ్వాల్సిందేనని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మిషన్ భగీరథలో పనిచేసేవారికి ఆదివారం సెలవు కూడా రద్దు చేశారు. అందరికి కంటిచూపు అందాలనే లక్ష్యంతో కంటి వెలుగు పథకాన్ని ప్రారంభిస్తున్నారు. దీనిని కూడా సీఎం ఆగష్టు 15న గజ్వేల్ లో ప్రారంభించనున్నారు. రైతు బీమా పథకాన్ని కూడా స్వాతంత్య దినోత్సవం సందర్భంగా సీఎం ప్రారంభించనున్నారు. మూడు భారీ పథకాలకు ఒకే ముహుర్తం కావడంతో కేభినేట్ భేటి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి వరకు సాగనుంది.