`మాతో పెట్టుకుంటే మీరు ఫినిష్ అవుతా`రంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాకినాడలో బీజేపీ నాయకులను హెచ్చరించి 24 గంటలు కూడా గడవక ముందే- దాన్ని నిజం చేసి చూపించారు టీడీపీ నాయకులు. ఏ ఛోటా మోటా బీజేపీ నాయకులో కాదు.. ఏకంగా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి మీదే దాడికి వెళ్లారు. అక్కడే బైఠాయించారు. నినాదాలు చేశారు. ఇంటి గేటు దూకడానికీ ప్రయత్నాలు చేశారు. కాకినాడలో చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకోవడంపై నిరసనకు పలువురు టీడీపీ నాయకులు కన్నా ఇంటి వద్ద నిరసన ప్రదర్శలు చేపట్టారు.
ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు కన్నా ఇంటికి చేరుకున్నారు. పోటీగా ఆందోళనకు దిగారు. కన్నాకు మద్దతుగా నినాదాలు చేశారు. పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. వాగ్వివాదానికి దిగారు. ఒకరినొకరు తోసుకున్నారు. దీనితో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు చేరుకుని, ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. అనంతరం కన్నా విలేకరులతో మాట్లాడారు.
చంద్రబాబు, లోకేష్ దగ్గరుండి మరీ తనపై దాడి చేయించారని ఆరోపించారు. వారిద్దరూ తనను చంపాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనపై తాను కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తిరుపతిలో తమ పార్టీ అధ్యక్షుడు అమిత్ షాపైనా టీడీపీ గూండాలు దాడి చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పోలీసులతో పాలన సాగిస్తున్నారని చెప్పారు.