నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేకి ఇంట్లో మూలనకూర్చోవడం తెలియదు. ఇంట్లో ఆఫీసు గదిలో కూర్చుని సాయంకోసమో సలహా కోసం వచ్చేవాళ్లకోసం ఒక ఫోన్ కాల్ చేసో, ఒక సిఫార్స్ లెటర్ పడేసి, హమ్మయ్య ఈ రోోజు కు ప్రజా సేవ ఇలా చేసేశాం అని రిలాక్సయ్యే బాపతు కాదు. వాళ్ల పార్టీ బాస్ జగన్మోహన్ రెడ్డి ఎలా గయితే, నిత్యం పాదయాత్రలనో మహాధర్నాలనో రాష్ట్రమంతా తిరుగుతుంటాడో, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా విరామమెరుగని యోధుడే. ఎపుడూ నియోజకవర్గం గల్లీల్లోనో, రోడ్లమీదనో కార్పొరేషన్ ఆఫీస్ ఎదరుగా ధర్నా చేస్తూనో కనబడుతుంటారు. ఎవరైనా కోటం రెడ్డి ని కలుసుకోవాలనుకుంటే చాలా ఈజీ. ఆయన ఏరియాలో తిరుగుతూ ఉంటే ఏదో ఒక చోట తారసపడతాడు. అదీ శ్రీధర్ రెడ్డి జగమెరిగిన అడ్రసు. ఈ మధ్య ఆయన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే మన ఇంటికి అంటూ యాత్ర పూర్తి చేశారు. ఇపుడు మళ్లీ ఆందోళనలోకి దిగాడు.
శ్రీధర్ రెడ్డి ఈ రోజు మాగుంట లే-అవుట్లో ధర్నా చేశాడు. కారణం, రెండు వారాలు కాకముందే అక్కడ కొత్తగా వేసిన రోడ్డు కుంగిపోయింది. ఇంత అధ్వాన్నంగా రోడ్లేస్తే, ఈ ప్రాంతంలో ప్రజలు బతికేదెట్టా అనేది కోటం రెడ్డి ప్రశ్న. అందులో ఈ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ మీద, దాని బిల్లులు పాస్ చేసిన అధికారుల మీద చర్య తీసుకోవల్సిందే నని డిమాండ్ చేస్తూ ఆయన ధర్నాలో కూర్చున్నాడు.
దీనితో నెల్లూరు కార్పొరేషన్ ఎస్ ఇ దిగివచ్చాడు. కుంగిన రోడ్డు కు బిల్లులు ఆపేస్తాాం, ధర్నా విరమించండి రిక్వెస్టు చేశాడు.
‘కంకరతో వేసిన రోడ్డు కాదు. బూడిదతో వేసిన రోడ్డు. ముఖ్యమంతి పర్యటన పేరుతొ లక్షలు దిగమింగారు,’ అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు.