ఢిల్లీలో తల వంచిన కేసీఆర్ జగన్, చంద్రబాబుల కంటే ఉత్తముడే 

KCR is more betetrthan YS Jagan, Chandrababu Naidu

ఢిల్లీ విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యవహార శైలి తీవ్ర చర్చనీయాంశమవుతోంది.  బీజేపీ ఏపీ, తెలంగాణతో ఎలాగైనా పాతుకుపోవాలని పరితపిస్తూ అన్ని రాజకీయ వ్యూహాలను అమలుచేస్తోంది.  స్థానిక పాలన పార్టీలను గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోంది.  ఎదురుతిరిగిన వారి మీద పరోక్షంగా కన్నెర్రజేస్తోంది.  ఇన్నాళ్లు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి మాటకు మాట సమాధానం చెప్పగల నాయకుడు ఎవరు అంటే కేసీఆర్ పేరు వినబడేది.  బీజేపీ అంటే కేసీఆర్ కు అంత మంట.  విద్యుత్ బిల్లు సహా తాజాగా చేసిన వ్యవసాయ చట్టాన్ని కూడ వ్యతిరేకించారు ఆయన.  రాష్ట్రంలో బీజేపీ ఆనవాళ్లు కూడా ఉండకూడని భావిస్తుంటారు.  అలాంటి వ్యక్తి ఈమధ్య ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, అమిత్ షా, ఇంకొందరు మంత్రులను కలిసొచ్చారు.  

అయితే ఈ పర్యటన కేసీఆర్ భయానికి నిదర్శనమని చాలా మంది అన్నారు.  రాష్ట్రంలో బీజేపీ పుంజుకున్నందు వలన తమని తాము కాపాడుకోవడానికి బీజేపీతో దోస్తీ ప్రయత్నాలు మొదలుపెట్టారని, ఇది లోపాయికారీ వ్యవహారమని కాంగ్రెస్ నేతలు అన్నారు.  వచ్చే ఎన్నికల్లో గెలవబోయేది తామే కాబట్టి ఇప్పటి నుండే మోదీ అనుగ్రహం కోసం ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలే చెప్పారు.  ఏది ఏమైనా కేసీఆర్ ఢిల్లీ టూర్ వినయపూర్వకంగా, సఖ్యతగా జరిగింది.  గతంలో మాదిరి కేసీఆర్ దూకుడుగా వెళ్ళలేదు.  మైత్రీ భావనతోనే ఉన్నారు.  వరద సాయం కింద రూ.1350 కోట్లు ఇవ్వాలని కోరారు.  పెండింగ్లో ఉన్న జీఎస్టీ బకాయిలు విడుదల చేయాలని, సాగునీటి ప్రాజెక్టులకు సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.  నీతి ఆయోగ్‌ సిఫారసు చేసిన రూ.24 వేల కోట్లు ఇవ్వాలని, నిధులు మంజూరుచేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, కొత్త విమానాశ్రయాల ఏర్పాటు ఇలా పలు అంశాల మీద కేసీర్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేసినట్టు తెరాస నేతలు చెప్పుకొచ్చారు. 

KCR is more betetrthan YS Jagan, Chandrababu Naidu
KCR is more betetrthan YS Jagan, Chandrababu Naidu

కేసీఆర్ చేసేదే రాజకీయం :

ఒకవేళ బీజేపీ, కాంగ్రెస్ నేతలు చెప్పిన ప్రకారమే కేసీఆర్ మోదీతో సఖ్యత కోసం ట్రై చేశారనే అనుకుందాం.  అందులో అంత తప్పేం లేదు.  కేంద్రంతో  అవసరమైనప్పుడు సఖ్యత నడపడం తక్కువతనమేమీ కాదు.. అదే తెలివి.  రాజకీయం తెలిసిన ఎవరైనా అదే చేస్తారు. అనువుగాని చోట అధికులమనరాదు అన్నట్టు పరిస్థితులు బాగోలేనప్పుడు కొంచెం తగ్గితే తప్పేం లేదు అనేది కేసీఆర్ భావన.  ఒక్కసారి గతం చూస్తే బీజేపీని అంత ధీటుగా, ముక్కుసూటిగా ఎదిరించింది కేసీఆర్ ఒక్కరే.  పరిస్థితులు బాగున్నప్పుడు ఏకంగా ఎన్డీయే, యూపీఏలను ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ పెట్టాలని ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో కూడ చేస్తారు.  కానీ కాస్త అనుకూల పరిస్థితులు రావాలంతే.   

శాశ్వత శత్రువు చంద్రబాబు :

ఒకవేళ ఈ ఢిల్లీ టూర్ ఫలించి కేసీఆర్ అడిగిన సహకారం కేంద్రం అందిస్తే ఆ గొప్ప తగ్గిన కేసీఆర్ ఖాతాలో పడుతుంది.  అయినా కేంద్రంతో స్నేహం, వైరం రాష్ట్ర ప్రజలకు ఎందుకు.  కావాల్సింది పనులు జరగడం, దక్కాల్సిన  ప్రయోజనాలను దక్కించుకోవడం అంతే.  ఆ పనిలోనే ఉన్నారు కేసీఆర్.  అదే మిగతా పెద్ద లీడర్లు జగన్, చంద్రబాబుల సంగతే చూస్తే ఇందుకు పూర్తి విరుద్ధం.  చంద్రబాబు నాయుడేమో అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు బీజేపీతో  పెనవేసుకుని పోయారు.  పొత్తు ముసుగులో వారికి లొంగిపోయి హోదా, పోలవరం, ప్రత్యేక ప్యాకేజీ లాంటి విషయాల్లో ఏమీ చేయలేకపోయారు.  చివరకు పూర్తి సంబంధాలు తెంచుకుని ఈనాడు బీజేపీకి శత్రువయ్యారు.  ఉంటే ప్రయోజనం పొందలేని మిత్రుడిగానో లేకపోతే వారి కింద నలిగిపోయే శత్రువుగానో తప్ప తటస్థ వైఖరిని, సమయానుకూల  ధోరణిని  ప్రదర్శించలేదు.  రాజకీయ పరిభాషలో అది పెద్ద వైఫల్యమే.  

జగన్ కూడ బాబులానే :

ఇక జగన్ సంగతి చూస్తే బాబుగారి కంటే భిన్నంగా ఏమీ లేదు.  ప్రస్తుతం జగన్ కేంద్రంతో సాన్నిహిత్యంగా ఉంటున్నారు.  ఆ సాన్నిహిత్యం వలన రాష్ట్రానికి జరుగుతున్న మంచి ఏమీ లేదు.  జగన్ మెతక వైఖరిని కేంద్రం అలుసుగా తీసుకుని హోదా, నిధులు, పోలవరం లాంటి విషయాల్లో ద్వంద పద్దతిని ఫాలో అవుతూ కాలం వెళ్లదీస్తోంది.  అంత స్నేహంగా ఉన్న జగన్ కనీసం  రాయలసీమకు ఎత్తిపోతల పథకాన్ని తెచ్చుకోలేకపోతున్నారు.  అలాంటి నిష్ప్రయోజనమైన స్నేహం ఉంటే ఎంత లేకుంటే ఎంత.  పైగా దాని మూలంగా 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీల బలం ఉన్నప్పటికీ జగన్ ఏమీ చేయలేని స్థితి.  ఆయనక్కూడ సమయానుకూలంగా సర్దుకోవడం, ఎదురుతిరగడం అనేది తెలియట్లేదు.  రేపు ఒక రోజున బీజేపీని ధిక్కరించాల్సిన తప్పనిసరి  పరిస్థితే వస్తే చంద్రబాబులానే శాశ్వత శత్రువు అయిపోతారు తప్ప తటస్థ స్థితిలో మాత్రం ఉండలేరు.  

మరి అలాంటప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఎక్కుతూ తగ్గుతూ పనులు జరుపుకునే ప్రయత్నంలో ఉన్న కేసీఆర్ ఉత్తముడనే కదా అనుకోవాలి.