కత్తి మహేష్ సంచలన ప్రకటన

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మాదిగ రాజకీయ చైతన్య సభలో మహేశ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భగా ఆయన తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. సభలో ప్రసంగిస్తూ పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై విమర్శలు చేశారు. దీనిపై పూర్తి వివరాలు కింద ఉన్నాయి చదవండి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కత్తి మహేష్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. జనసేనకు జనబలం లేదని, కేవలం సినీ గ్లామర్‌తో పవన్‌ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడని కత్తి మహేష్ ఆరోపించారు. పవన్‌ను చూడడానికి మాత్రమే జనం వస్తున్నారని, ఆయనకు ఓటు వేయడానికి కాదని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడా ఆయన గెలిచే అవకాశాలు లేవని తేల్చి చెప్పారు.

పవన్ ఏ ప్రాంతానికి వెళితే, ఆ ప్రాంతం నుండి పోటీ చేస్తానని అంటున్నారని, ఇటీవల పాయకారావుపేటకు వెళ్లి అక్కడి నుంచి కూడా పోటీ చేస్తానని ప్రకటించారని గుర్తు చేశారు. అది రిజర్వ్‌డ్‌ నియోజకవర్గమని, అక్కడ ఎలా పోటీ చేస్తాడో ఆయనకే తెలియాలని ఎద్దేవా చేశారు కత్తి మహేష్. శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించినప్పుడు ‘మీకు నేనున్నాను’ అని చెప్పిన పవన్‌ అక్కడ తితలీ తుఫాన్‌ బీభత్సం సృష్టించినా ఇంత వరకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో 500 మంది ఓటర్లను కూడా ప్రభావితం చేయలేరని కత్తి మహేశ్‌ దుయ్యబట్టారు. 5 వేల నుంచి 6 వేల ఓట్లున్న మనమెందుకు చాలెంజ్‌ చేయకూడదని మాదిగ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మాదిగలను పట్టించుకునే వారికే ఓట్లు వేయాలని సూచించారు. ఎవరు డబ్బులిస్తే వారివైపు మాట్లాడడం పవన్‌కు అలవాటని ఎద్దేవా చేశారు.

ప్రస్తుతం బీజేపీ నాయకులు పవన్‌ను పోషిస్తున్నారని పేర్కొన్నారు కత్తి మహేష్. రాబోయే రెండు మూడు నెలల్లో ఇది కూడా మారుతుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎవరితో జతకడతాడో తెలియదని, తన స్వార్థం కోసమే రాజకీయాల్లోకి వచ్చాడు అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రెండుసార్లు సీఎం అయిన చంద్రబాబు మాదిగలను మోసం చేశారని విమర్శించారు.

వచ్చే ఎన్నికల్లో తాను చిత్తూరు ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. అయితే ఎప్పటి నుండో కత్తి మహేష్ వైసీపీలో చేరతాడనే రూమర్లు వినిపిస్తున్నాయి. కాగా వీటిపై క్లారిటీ వచేసినట్టే ఉంది. ఎందుకంటే చిత్తూర్ ఎంపీ టికెట్ ఇస్తే వైసీపీలో చేరతానని కత్తి మహేష్ స్పష్టం చేశారు. అధిష్టానం అందుకు ఒప్పకోకుంటే ప్లాన్ బి గా కాంగ్రెస్ లో చేరతానని తెలిపారు.